న్యూఢిల్లీ: రుణభారంతో కుదేలైన భూషణ్ స్టీల్‌ను చేజిక్కించుకోవడానికి టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ లివింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లు బిడ్‌లు సమర్పించాయి. వీటితో పాటు భూషణ్ స్టీల్‌కంపెనీ సొంత ఉద్యోగుల కన్సార్షియమ్ కూడా బిడ్‌ను సమర్పించిందని భూషణ్ స్టీల్ కంపెనీ బీఎస్‌ఈకి నివేదించింది.
జేఎస్‌డబ్ల్యూ, పిరమళ్ ఎంటర్‌ప్రైజెస్‌లు కలిసి జాయింట్ వెంచర్‌గా ఏర్పడి జేఎస్‌డబ్ల్యూ లివింగ్ ప్రైవేట్‌గా బిడ్‌ను దాఖలు చేశాయని పేర్కొంది. ఈ కంపెనీల రిజల్యూషన్ ప్లాన్ల వివరాలకు సంబంధించిన ఒక సవివరమైన నివేదికను ఆర్‌పీ(రిజల్యూషన్ ప్రొఫెషనల్) రుణదాతల కమిటీ (కమిటీ ఆఫ్ క్రెడిటర్స్)కు ఇటీవలే∙సమర్పించారని భూషణ్ స్టీల్ తెలిపింది.
ఎన్‌సీఎల్‌టీకి ఆర్‌బీఐ నివేదించిన 12 మొండి బకాయిల ఖాతాల్లో భూషణ్ స్టీల్ ఒకటి. ఈ కంపెనీ బ్యాంక్‌లకు రూ.44,478 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం బీఎస్‌ఈలో భూషణ్ స్టీల్ షేర్ 20% అప్పర్ సర్క్యూట్ తాకి, రూ.53.80 వద్ద ముగిసింది.
కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.202 కోట్లు పెరిగి రూ.1,219 కోట్లకు ఎగసింది. కాగా భూషణ్ స్టీల్ కొనుగోలు కోసం అన్ని కంపెనీల కన్నా అధికంగా టాటా స్టీల్ రూ.36,000 కోట్లు కోట్ చేసిందని, రెండో స్థానంలో ఉన్న జేఎస్‌డబ్ల్యూ స్టీల్ బిడ్ కన్నా టాటా స్టీల్ బిడ్ రూ.10,000 కోట్లు అధికమని మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో టాటా స్టీల్ షేర్ 5.8 శాతం నష్టపోయి, రూ.648 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో ఈ షేర్ 9 శాతం పతనమైంది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.3,834 కోట్లు ఆవిరైంది.
Comments
Please login to add a commentAdd a comment