న్యూఢిల్లీ: కొత్త దివాలా చట్టం (ఐబీసీ) ఊతంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 1.80 లక్షల కోట్ల పైగా మొండిబాకీల (ఎన్‌పీఏ) రికవరీ కాగలదని కేంద్రం అంచనా వేస్తోంది. ఇప్పటికే కొన్ని పెద్ద ఖాతాల పరిష్కార ప్రక్రియ కొనసాగుతుండగా, మరికొన్ని ఖాతాలు సిద్ధంగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వేలానికి వచ్చిన ఎస్సార్ స్టీల్, భూషణ్ పవర్ అండ్ స్టీల్ వంటి కేసులను ఉటంకిస్తూ ఇదే తీరు కొనసాగితే తాము నిర్దేశించుకున్న రూ. 1.80 లక్షల కోట్ల మొండిబాకీల రికవరీ లక్ష్యాన్ని అధిగమించే అవకాశం ఉందని పేర్కొన్నారు. 2017–18లో బ్యాంకులు రూ. 74,562 కోట్లు రాబట్టుకోగలిగాయి.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా రూ. 36,551 కోట్లు రికవర్ చేసుకున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు నివేదించిన 12 భారీ మొండిబాకీ కేసుల పరిష్కారం ద్వారా కనీసం రూ. లక్ష కోట్ల పైగా రాగలవని బ్యాంకులు ఆశిస్తున్నాయి. ఆర్‌బీఐ రూపొందించిన భారీ ఎన్‌పీఏల్లోని ఎస్సార్ స్టీల్, భూషణ్ స్టీల్ పరిష్కార ప్రక్రియ ప్రస్తుతం తుది దశల్లో ఉంది. బినానీ సిమెంట్, జేపీ ఇన్‌ఫ్రాటెక్ పరిష్కార ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఎస్సార్ స్టీల్‌కి ఇచ్చిన సుమారు రూ. 49,000 కోట్ల రుణాల్లో దాదాపు 86 శాతం మొత్తాన్ని రాబట్టుకోవచ్చని బ్యాంకులు భావిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment