
న్యూఢిల్లీ: ఎన్‌పీఏలకు భారీగా నిధులు కేటాయించాల్సి రావడంతో నిధుల కటకట బారిన పడకుండా బ్యాంకులకు వెసులుబాటు కల్పించే మార్గంపై ఆర్థిక శాఖ దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఓ ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ప్రొవిజన్ షోర్‌అప్ సర్టిఫికెట్స్(పీఎస్‌సీ)ను బ్యాంకులకు జారీ చేయడమే ఈ ప్రతిపాదన. దీని కింద బ్యాంకులు ఎన్‌పీఏలకు చేసిన కేటాయింపులకు సరిపడా పీఎస్‌సీలను పొందుతాయి.
దీంతో వాటికి నిధుల సమస్య తొలగిపోతుందని, ఆయా నిధుల్ని రుణాల జారీకి వినియోగించుకోవడం ద్వారా బ్యాంకులు మెరుగైన స్థితిలో కొనసాగేందుకు అవకాశం లభిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. ఇది కూడా నిధుల సాయం వంటిదేనని, ఒకేసారి కాకుండా పలు త్రైమాసికాల పాటు కొనసాగుతుందని వివరించాయి. పీఎస్‌సీలు అన్నవి కేవలం ఎన్‌పీఏకే పరిమితమని, బ్యాంకులు చేసే మొత్తం ప్రొవిజన్లకు కాదని స్పష్టం చేశాయి.
‘‘బ్యాడ్ బ్యాంకు, పీఎస్‌సీ యంత్రాంగానికి మధ్య పూర్తి తేడా ఉంది. బ్యాడ్ బ్యాంకు అన్నది బ్యాంకింగ్ రంగంలోని మొత్తం ఎన్‌పీఏలను స్వాధీనం చేసుకోవడం కోసం. పీఎస్‌సీ విధానంలో బ్యాంకులు ఎన్‌పీఏలను స్వా«ధీ నం చేసి తాము కేటాయింపులు చేసిన మేరకు పీఎస్‌సీలను తీసుకుంటాయి’’ అని ఆ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment