న్యూఢిల్లీ: ఎన్‌పీఏల భారాన్ని మోస్తున్న ప్రభుత్వరంగ బ్యాంకులకు రానున్న నాలుగు నెలల్లో రీక్యాప్ బాండ్ల ద్వారా రూ.70,000 కోట్ల నిధుల సాయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ అందించనుంది. ప్రభుత్వరంగ బ్యాంకులకు రెండేళ్ల కాలంలో రూ.2.11 లక్షల కోట్ల మూలధన సాయం చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం గత నెలలో ప్రకటించిన విషయం తెలిసే ఉంటుంది.
ఇందులో రూ.1.35 లక్షల కోట్ల మేర రీక్యాపిటలైజేషన్ బాండ్ల రూపంలో సాయం చేయనున్నట్టు అప్పుడే తెలిపింది. ఈ నేపథ్యంలో బాండ్ల స్వరూపం విషయమై ఆర్థిక శాఖ ప్రస్తుతం కసరత్తు చేస్తోందని, ఈ నెల చివర్లోగా నిర్ణయం వెలువడనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ బాండ్ల విలువ రూ.70,000–80,000 కోట్ల మధ్య ఉండొచ్చని పేర్కొన్నాయి. రీక్యాపిటలైజేషన్ బాండ్ల విషయంలో ప్రభుత్వం ముందు పలు అవకాశాలున్నాయని, ఏది మంచిదన్నది అధ్యయనం చేస్తామని జైట్లీ లోగడ స్పష్టం చేశారు.
రీక్యాప్ కార్యక్రమంతోపాటు గతంలో తీసుకున్న ఇంద్రధనస్సు రోడ్ మ్యాప్ కింద వచ్చే రెండేళ్లలో బ్యాంకులకు మరో రూ.18,000 కోట్ల సాయాన్ని కూడా అందించనున్నట్టు జైట్లీ చెప్పారు. కాగా, ప్రభుత్వరంగ బ్యాంకుల మొండి బకాయిలు 2017 మార్చి నాటికి రూ.7.33 లక్షల కోట్లకు పెరిగిపోయిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment