న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ రంగంలో టాప్ పొజిషన్‌కు చేరాలని లక్షిస్తున్నట్లు పతంజలి ఆయుర్వేద్ గ్రూప్ చీఫ్ బాబా రామ్‌దేవ్ పేర్కొన్నారు. ప్రస్తుతం పతంజలి ఆయుర్వేదతోపాటు అనుబంధ సంస్థ రుచీ సోయా ఇండస్ట్రీస్ టర్నోవర్ రూ. 35,000 కోట్లకు చేరినట్లు వెల్లడించారు. రుచీ సోయా ఇండస్ట్రీస్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీవో) ప్రారంభంకానున్న సందర్భంగా రామ్‌దేవ్ విలేకరుల సమావేశంలో పలు అంశాలను ప్రస్తావించారు.
రానున్న కొద్ది నెలల్లో పతంజలి ఆయుర్వేద్ నుంచి ఫుడ్ బిజినెస్‌ను విడదీసి లిస్టెడ్ కంపెనీ రుచీ సోయాలో విలీనం చేయనున్నట్లు తెలియజేశారు. తద్వారా రానున్న ఐదేళ్లలో ఫుడ్, ఎఫ్‌ఎంసీజీ విభాగాలలో పతంజలి ఆయుర్వేద్, రుచీ సోయాను టాప్ ర్యాంక్ కంపెనీగా నిలపాలని ఆశిస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) తదుపరి రెండో ర్యాంకులో నిలుస్తున్నట్లు పేర్కొన్నారు. 2021 ఆర్థిక సంవత్సరంలో హెచ్‌యూఎల్ రూ. 45,996 కోట్ల టర్నోవర్ సాధించినట్లు ప్రస్తావించారు.
షేరుకి రూ. 615–650
గురువారం(24) నుంచి ప్రారంభమైన రుచీ సోయా ఎఫ్‌పీవో ఈ నెల 28న(సోమవారం) ముగియనుంది. షేరుకి రూ. 615–650 ధరల శ్రేణిలో ఇష్యూని చేపట్టింది. తద్వారా రూ. 4,300 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. తద్వారా రుణరహితంగా మారాలని రుచీ సోయా ఆశిస్తోంది. ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 1,290 కోట్లు అందుకుంది. కాగా.. పతంజలి గ్రూప్‌లోగల పలు కంపెనీలను దశలవారీగా లిస్టింగ్ చేయనున్నట్లు రామ్‌దేవ్ పేర్కొన్నారు. ఫుడ్ బిజినెస్‌ను రుచీ సోయాకు బదిలీ చేశాక పతంజలి గ్రూప్ నాన్‌ఫుడ్, సంప్రదాయ ఔషధాలు, వెల్‌నెస్ విభాగంలో కార్యకలాపాలు నిర్వహిస్తుందన్నారు. రుణ పరిష్కార ప్రణాళికల్లో భాగంగా 2019లో రుచీ సోయాను పతంజలి సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఎఫ్‌పీవో నేపథ్యంలో రుచీ సోయా షేరు దాదాపు 3 శాతం క్షీణించి రూ. 873 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment