patanjali ayurveda
-
గోసాయిచిట్కా ప్రకటనలేనా?
ఏ ఉత్పత్తికైనా ప్రచారం కావాలి. ప్రచారానికి ప్రకటనలివ్వాలి. ప్రకటనల్లో చెప్పేదంతా సంపూర్ణ సత్యమని ఎవరూ అనుకోరు కానీ, ప్రజల్ని మభ్యపెట్టేలా అసత్యాల్ని వ్యాప్తిలో పెడితేనే చిక్కు. మరీ ముఖ్యంగా, జీవితాలను ప్రభావితం చేసే ఆరోగ్యం, ఆర్థిక అంశాలపై అసత్య వాణిజ్య ప్రకటనలు ప్రమాదకరం. పాపులర్ యోగాగురు బాబా రామ్‌దేవ్‌కు చెందిన ‘పతంజలి ఆయుర్వేద్’ సంస్థ ప్రకటనలు సరిగ్గా ఇలాగే ‘తప్పుదోవ పట్టించేలా, అసత్యపూర్వకం’గా ఉన్నాయని దేశ సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. రకరకాల జబ్బులు నయమవుతాయంటున్న సదరు ఉత్పత్తుల ప్రకటనలపై తాత్కాలిక నిషేధం విధించింది. పైగా, ‘దేశం మొత్తాన్నీ ఇలా ఓ సంస్థ మోసం చేస్తూ ఉంటే’, కేంద్రం చోద్యం చూడడాన్ని సుప్రీమ్ కోర్ట్ తప్పుబట్టింది. అలాంటి ప్రచారం చేయరాదని ఉత్తర్వులిచ్చినా సరే ఉల్లంఘించినందుకు గాను సంస్థ ఎండీకి కోర్టు ధిక్కార నోటీసులివ్వడం విశేషం. స్థానిక ఉత్పత్తులతో విపణిలో బహుళ జాతి సంస్థలను మించాలని చూస్తున్న రామ్‌దేవ్ మాత్రం ఇదంతా ఆయుర్వేదంపై, తన మూలికా వ్యాపారంపై సాగుతున్న కుట్ర అని ఆరోపిస్తున్నారు. టూత్‌పేస్ట్‌ల నుంచి ఆహార ఉత్పత్తులు, మందుల దాకా అన్నీ అందిస్తున్న పతంజలి సంస్థ ఆధునిక వైద్య విధానాలకూ, కోవిడ్ టీకాకరణకూ వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తోందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 2022లో కోర్టుకెక్కింది. ఇద్దరు జడ్జీల ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. కోవిడ్ వేళ అల్లోపతి వైద్యుల్ని తక్కువ చేసేందుకు రావ్‌ుదేవ్ ప్రయత్నించారు. ఆ వ్యవహార శైలిని 2022 ఆగస్ట్‌లో సుప్రీమ్ కోర్ట్ ప్రశ్నించింది. అసత్య ప్రకటనలు, తప్పుదోవ పట్టించేవాటిని తక్షణమే ఆపేయాలంటూ గత నవంబర్‌లో సుప్రీమ్ ఆదేశించింది. అప్పట్లోనే పతంజలి తరఫు వకీలు సైతం తమ ఉత్పత్తుల ప్రకటనకు సంబంధించి ఇకపై చట్టాన్ని ఉల్లంఘించబోమని కోర్టుకు విన్నవించారు. ఔషధ సామర్థ్యంపై మీడియాలో ప్రకటనలివ్వబోమని కూడా హామీ ఇచ్చారు కానీ కట్టుబడ లేదు. 2006లో ఆరంభమైన పతంజలి శరవేగంతో పైకి వచ్చింది. ప్రపంచమంతా కోవిడ్‌తో అతలా కుతలం అవుతున్నప్పుడు 2020 జూన్‌లో కోవిడ్‌కు మందు కనుక్కున్నామంటూ రామ్‌దేవ్ ప్రకటించారు. ‘కరోనిల్, శ్వాసారి’ మందుల్ని ఆవిష్కరించారు. అయితే, సంస్థ ఇచ్చిన పత్రాలన్నిటినీ క్షుణ్ణంగా సమీక్షించేంత వరకు సదరు ఉత్పత్తుల వాణిజ్య ప్రకటనల్ని ఆపేయాలంటూ ‘ఆయుష్’ మంత్రిత్వ శాఖ తేల్చిచెప్పింది. అయినా పతంజలి తన పంథా మానలేదు. సరికదా... కరోనా వేవ్‌లు కొనసాగుతుండగానే 2021 ఫిబ్రవరిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నియమానుసారం కోవిడ్ చికిత్సలో అండగా కరోనిల్ మందును వాడవచ్చని ‘ఆయుష్’ నుంచి ధ్రువీకరణ పత్రం వచ్చినట్టు అబద్ధమాడింది. కానీ, ఏ సాంప్రదాయిక ఔషధ సామర్థ్యాన్నీ తాము పరీక్షించనే లేదనీ, అసలు ధ్రువీకరించనే లేదనీ ఐరాస ఆరోగ్య సంస్థ ప్రకటించేసరికి బండారం బయటపడింది. ఇదొక్కటే కాదు... పతంజలి చుట్టూ ఎప్పుడూ ఏదో ఒక వివాదమే. 2015లో దేశంలో మ్యాగీ నూడుల్స్‌పై రచ్చ రేగినప్పుడు భారత ఆహార భద్రత, నియంత్రణ సంస్థ ఆమోదమైనా లేకుండానే, పతంజలి ఆటా నూడుల్స్ మార్కెట్లోకి వచ్చాయి. ఆహార భద్రతా నియమాలను ఉల్లంఘించారంటూ ప్రభుత్వం ఆనక నోటీసిచ్చింది. అలాగే, ‘దివ్యపుత్రజీవక్ బీజ్’ వాడితే చాలు అబ్బాయే పుడతా డంటూ 2015లో మరో మందును మార్కెట్లోకి తేవడమూ వివాదమైంది. ఇక, 2016లో పతంజలి ఆమ్లా రసం వినియోగానికి పనికిరాదంటూ రక్షణ దళాల క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్మెంట్ దాన్ని అమ్మ కాన్ని నిలిపేసింది. నిరుడు ‘దివ్య దంత మంజన్’ను శాకాహార ఉత్పత్తిగా పేర్కొంటూ దానిలో ఒక జాతి చేపను వాడడమూ రగడయింది. పతంజలి వ్యవహారశైలిపై ప్రత్యర్థుల అభ్యంతరాలు చెప్పడం నిజమే కానీ, ప్రపంచ సంస్థలన్నీ కట్టగట్టుకొని దానిపై కుట్ర చేస్తున్నాయనే మాట అసంబద్ధం. యోగాతో ఎయిడ్స్, క్యాన్సర్లను తగ్గించవచ్చంటూ 2006లోనే ప్రకటించిన రామ్‌దేవ్ వ్యాపార ప్రయాణం రెండు దశాబ్దాలవుతున్నా నేటికీ అనుమానాస్పదమే. రామ్‌దేవ్ మాటల్నే కాదు, పతంజలి ప్రకటనల్నీ ఆరోగ్యశాఖ కొట్టిపారేస్తున్నా సరే... అవే అసత్యాలు విస్తృత ప్రకటన లుగా వ్యాప్తిలో ఉండడం దురదృష్టం. ఏ ఔషధమైనా సరే ఔషధ రెగ్యులేటర్ల కఠిన పరీక్షల్లో పాసై, నిర్ణీత చికిత్సకు ఉపయోగమని ఆమోదం పొందడం అల్లోపతిలో గీటురాయి. అలాగని సంప్రదాయ ఔషధ విధానాలన్నిటినీ కొట్టిపారేయమని కాదు కానీ, పరీక్షకు నిల్చి ఫలితాలతో గెలిస్తేనే ప్రపంచంలో ప్రామాణికత. పతంజలి తన ఉత్పత్తుల టముకు ఎంత మోగిస్తున్నా, అధీకృత శాస్త్రీయసంస్థలేవీ వాటికి ఆమోదముద్ర వేయలేదు. సాధారణ ఆరోగ్యం కోసమని స్పష్టంగా చెప్పే సంప్ర దాయ మందుల్ని నమ్మకం మీద వాడవచ్చు కానీ, కరోనా లాంటి నిర్ణీత వ్యాధుల నివారణకు పరమౌషధం అన్నప్పుడు శాస్త్రీయ నిర్ధారణ పరీక్షలు, ఫలితాలు కీలకం. అందులో వెనుకబడ్డ పతంజలి తీరా శాస్త్రీయ వైద్యవిధానాలపై అపనమ్మకం రేపుతోంది. సర్వ రోగ నివారిణి తమదే అన్నట్టు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తే అనవసర ఆరోగ్య సంక్షోభమే. నకిలీ వైద్యులు, గోసాయిచిట్కాలతో ఇల్లు ఒళ్ళు గుల్లవుతాయి. డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమిడీస్ (అభ్యంతర కర యాడ్స్) యాక్ట్–1954 లాంటివి ఎప్పటి నుంచో ఉన్నా, పకడ్బందీగా అమలు చేయడంలో నిర్లిప్తత నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు సుప్రీమ్ చేసిన వ్యాఖ్యలు కీలకమై నవి. అరచేతిలో ఆరోగ్య స్వర్గం చూపే ప్రకటనల పట్ల జనం అప్రమత్తంగా ఉండాలి. అలాంటి సంస్థలపైనా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. ఇక నైనా, బుద్ధి తెచ్చుకొని పతంజలి తీరు మార్చుకోవాలి. తలబొప్పి కట్టిన పాలకులు బాధ్యతల నిర్వహణలో చిత్తశుద్ధి చూపాలి. – సభావట్ కళ్యాణ్, ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు -
ఐదు పతంజలి ఔషధాలపై నిషేధం ఎత్తివేత
డెహ్రాడూన్: పతంజలి ఔషధాలు ఐదింటిపై విధించిన నిషేధాన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఆయుర్వేద, యునాని సర్వీసెస్ లైసెన్సింగ్ అధికారి పతంజలి ఔషధ ఉత్పత్తి సంస్థ దివ్య ఫార్మసీకి ఒక లేఖ రాస్తూ, ‘పొరపాటున ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది’ అని వివరించారు. గత వారం లైసెన్సింగ్ అథారిటీ ‘తప్పుదోవ పట్టించే ప్రకటనలు’ కారణంగా చూపుతూ ఐదు ఔషధాల ఉత్పత్తిని నిలిపివేయాలని పతంజలి ఉత్పత్తులను తయారు చేసే దివ్య ఫార్మసీని ఆదేశించింది. బీపీగ్రిట్, మధుగ్రిట్, థైరోగ్రిట్, లిపిడొమో, ఐగ్రిట్ గోల్డ్ ట్యాబ్లెట్లు ఇందులో ఉన్నాయి. చదవండి: ఫోన్‌పే యూజర్లకు అలర్ట్: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా! -
నంబర్ వన్‌పై రుచీ సోయా గురి
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ రంగంలో టాప్ పొజిషన్‌కు చేరాలని లక్షిస్తున్నట్లు పతంజలి ఆయుర్వేద్ గ్రూప్ చీఫ్ బాబా రామ్‌దేవ్ పేర్కొన్నారు. ప్రస్తుతం పతంజలి ఆయుర్వేదతోపాటు అనుబంధ సంస్థ రుచీ సోయా ఇండస్ట్రీస్ టర్నోవర్ రూ. 35,000 కోట్లకు చేరినట్లు వెల్లడించారు. రుచీ సోయా ఇండస్ట్రీస్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీవో) ప్రారంభంకానున్న సందర్భంగా రామ్‌దేవ్ విలేకరుల సమావేశంలో పలు అంశాలను ప్రస్తావించారు. రానున్న కొద్ది నెలల్లో పతంజలి ఆయుర్వేద్ నుంచి ఫుడ్ బిజినెస్‌ను విడదీసి లిస్టెడ్ కంపెనీ రుచీ సోయాలో విలీనం చేయనున్నట్లు తెలియజేశారు. తద్వారా రానున్న ఐదేళ్లలో ఫుడ్, ఎఫ్ఎంసీజీ విభాగాలలో పతంజలి ఆయుర్వేద్, రుచీ సోయాను టాప్ ర్యాంక్ కంపెనీగా నిలపాలని ఆశిస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) తదుపరి రెండో ర్యాంకులో నిలుస్తున్నట్లు పేర్కొన్నారు. 2021 ఆర్థిక సంవత్సరంలో హెచ్‌యూఎల్ రూ. 45,996 కోట్ల టర్నోవర్ సాధించినట్లు ప్రస్తావించారు. షేరుకి రూ. 615–650 గురువారం(24) నుంచి ప్రారంభమైన రుచీ సోయా ఎఫ్‌పీవో ఈ నెల 28న(సోమవారం) ముగియనుంది. షేరుకి రూ. 615–650 ధరల శ్రేణిలో ఇష్యూని చేపట్టింది. తద్వారా రూ. 4,300 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. తద్వారా రుణరహితంగా మారాలని రుచీ సోయా ఆశిస్తోంది. ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 1,290 కోట్లు అందుకుంది. కాగా.. పతంజలి గ్రూప్‌లోగల పలు కంపెనీలను దశలవారీగా లిస్టింగ్ చేయనున్నట్లు రామ్‌దేవ్ పేర్కొన్నారు. ఫుడ్ బిజినెస్‌ను రుచీ సోయాకు బదిలీ చేశాక పతంజలి గ్రూప్ నాన్‌ఫుడ్, సంప్రదాయ ఔషధాలు, వెల్నెస్ విభాగంలో కార్యకలాపాలు నిర్వహిస్తుందన్నారు. రుణ పరిష్కార ప్రణాళికల్లో భాగంగా 2019లో రుచీ సోయాను పతంజలి సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎఫ్‌పీవో నేపథ్యంలో రుచీ సోయా షేరు దాదాపు 3 శాతం క్షీణించి రూ. 873 వద్ద ముగిసింది. -
24 నుంచి రుచి సోయా ఎఫ్‌పీవో
ముంబై: పతంజలి ఆయుర్వేద్ గ్రూప్‌లో భాగమైన రుచి సోయా ఇండస్ట్రీస్ తాజాగా మార్చ్ 24న ఫాలో ఆన్ ఆఫర్ (ఎఫ్‌పీవో)కి రానుంది. దీని ద్వారా సుమారు రూ. 4,300 కోట్లు సమీకరించనుంది. ఎఫ్‌పీవోకి సంబంధించి ధరల శ్రేణిని షేరు ఒక్కింటికి రూ. 615–650గా నిర్ణయించారు. దివాలా ప్రక్రియ కింద చర్యలు ఎదుర్కొన్న తర్వాత తిరిగి లిస్ట్ అవుతున్న తొలి కంపెనీ ఇదే కావడం గమనార్హం. పతంజలికి రుచి సోయాలో ప్రస్తుతం 98.9 శాతం వాటాలు ఉన్నాయి. లోయర్ బ్యాండ్ ప్రకారం 19 శాతం – 18 శాతం వాటాలను ఎఫ్‌పీవో ద్వారా విక్రయించే అవకాశం ఉంది. మరో 6–7 శాతాన్ని 2022 డిసెంబర్‌లోగా విక్రయించనున్నట్లు కంపెనీ తెలిపింది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మార్గదర్శకాల ప్రకారం లిస్టెడ్ కంపెనీలో 25 శాతం పబ్లిక్ వాటా ఉండాలి. ఎస్బీఐ క్యాప్స్, యాక్సిస్ క్యాపిటల్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సంస్థలు ఈ ఇష్యూకి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా ఉన్నాయి. రుణాల చెల్లింపునకు రూ. 3వేల కోట్లు.. ఎఫ్‌పీవో ద్వారా సమీకరించిన నిధుల్లో రూ. 3,300 కోట్లను రుణాలను తీర్చేందుకు, మిగతా మొత్తాన్ని ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించుకోనున్నట్లు సంస్థ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాబా రాందేవ్ చెప్పారు. రుచి సోయా, పతంజలిని అంతర్జాతీయంగా ఫుడ్ బ్రాండ్స్‌గా తీర్చిదిద్దాలన్నది తమ లక్ష్యమని ఆయన వివరించారు. బ్రాండెడ్ ఫుడ్, న్యూట్రాస్యూటికల్స్, వంట నూనెలు, హెల్త్..వెల్నెస్ ఉత్పత్తుల కింద గ్రూప్ వ్యాపారాలు మొత్తం నాలుగు విభాగాలుగా ఉంటాయని రాందేవ్ పేర్కొన్నారు. రుచి సోయా కథ ఇదీ.. అతి పెద్ద బ్రాండెడ్ వంట నూనెల సంస్థల్లో రుచి సోయా కూడా ఒకటి. రుచి గోల్డ్ దేశీయంగా అత్యధికంగా అమ్ముడయ్యే పామాయిల్ బ్రాండ్స్‌లో ఒకటి. మహాకోష్, సన్‌రిచ్, రుచి స్టార్, రుచి సన్‌లైట్ వంటి ఇతర బ్రాండ్స్ కూడా కంపెనీకి ఉన్నాయి. ఇక న్యూట్రెలా పేరిట సోయా ఫుడ్స్‌ను కూడా విక్రయిస్తోంది. ఈ విభాగంలో 40 శాతం మార్కెట్ వాటా ఉంది. బ్యాంకులకు దాదాపు రూ. 9,345 కోట్ల మేర రుణాలు రుచి సోయా బాకీ పడటంతో 2017 డిసెంబర్లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కంపెనీపై దివాలా ప్రక్రియ కింద చర్యలు ప్రారంభించింది. 2018 డిసెంబర్లో నిర్వహించిన వేలంలో రుచి సోయాను పతంజలి దక్కించుకుంది. ఇందుకోసం రూ. 4,350 కోట్లు వెచ్చించింది. టేకోవర్ తర్వాత రుచి సోయా .. బిస్కెట్లు, కుకీలు, రస్కులు, నూడుల్స్ మొదలైన ఉత్పత్తులను కూడా విక్రయించడం మొదలుపెట్టింది. -
రుచీ సోయా.. 5% డౌన్ సర్క్యూట్
ఇటీవల నిరవధికంగా ర్యాలీ చేస్తున్న వంట నూనెల కంపెనీ రుచీ సోయా ఇండస్ట్రీస్ కౌంటర్లో తాజాగా అమ్మకాలు ఊపందుకున్నాయి. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 5 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు అధికంకాగా.. కొనుగోలుదారులు కరువుకావడంతో రూ. 76 నష్టపోయి రూ, 1444 దిగువన ఫ్రీజయ్యింది. కాగా.. ఈ షేరు జనవరిలో స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యాక వరుసగా అప్పర్ సర్క్యూట్లను తాకుతూ వస్తోంది. తద్వారా వారాంతానికల్లా 9400 శాతం ర్యాలీ చేసింది. ఇతర వివరాలు చూద్దాం.. నికర నష్టం గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో రుచీ సోయా రూ. 41 కోట్ల నికర నష్టం ప్రకటించింది. నికర అమ్మకాలు మాత్రం నామమాత్రంగా 1.4 శాతం పెరిగి రూ, 3191 కోట్లకు చేరాయి. దివాళా చట్టానికి లోబడి గతేడాది పతంజలి గ్రూప్ సొంతం చేసుకున్న రుచీ సోయా కౌంటర్ స్టాక్ ఎక్స్ఛేంజీలలో నిరవధిక ర్యాలీ చేస్తూ వస్తోంది. ఈ ఏడాది జనవరి 27న రూ. 16 వద్ద తిరిగి లిస్టయిన ఈ షేరు వారాంతాన ఎన్ఎస్ఈలో రూ. 1520 వద్ద ఫ్రీజయ్యింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. గత ఐదు నెలల్లో 9400 శాతం ర్యాలీ చేసింది. మధ్యలో అంటే మే నెలలో ఆరు రోజుల డౌన్ సర్క్యూట్ల తదుపరి తిరిగి వరుసగా 22వ సెషన్లోనూ 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. తిరిగి నేటి ట్రేడింగ్‌లో అమ్మకాలు తలెత్తడంతో 5 శాతం పతనమైంది. కంపెనీ దివాళాకు చేరడంతో నవంబర్ 2019లో ఈ షేరు 3.30 స్థాయిలో డీలిస్టయ్యింది. పబ్లిక్కు 0.8 శాతమే రుణ చెల్లింపుల్లో విఫలమై ఎన్‌ఎస్‌ఎల్‌టీకి చేరిన రుచీ సోయాను కార్పొరేట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పతంజలి ఆయుర్వేద రూ. 4500 కోట్లకు కొనుగోలు చేసిన విషయం విదితమే. తదుపరి కంపెనీ ఈక్విటీలో చేపట్టిన మార్పుల ఫలితంగా పతంజలి గ్రూప్‌నకు 98.87 శాతం వాటా లభించింది. పబ్లిక్కు కేవలం 0.97 శాతం వాటా మిగిలింది. దీనిలోనూ రిటైల్ ఇన్వెస్టర్లకు 0.82 శాతమే వాటా లభించినట్లు నిపుణులు పేర్కొన్నారు. వాటాదారుల వద్దనున్న ప్రతీ 100 షేర్లకుగాను 1 షేరునే కేటాయించింది. దీంతో ఈ కౌంటర్లో ఫ్లోటింగ్ స్టాక్ అతితక్కువగా ఉన్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. వెరసి ఈ కౌంటర్‌పట్ల అప్రమత్తత అవసరమని సూచించారు. లిస్టింగ్ నిబంధనల ప్రకారం కంపెనీలో పబ్లిక్కు ఏడాదిన్నరలోగా 10 శాతం వాటాను, మూడేళ్లలోగా 25 శాతం వాటాను కల్పించవలసి ఉంటుందని తెలియజేశారు. పబ్లిక్ వాటా పెరిగిన సందర్భంలో మాత్రమే కంపెనీ అసలు విలువ షేరు ధరలో ప్రతిబింబించగలదని వివరించారు. షేరు ర్యాలీపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దృష్టి పెట్టవలసి ఉన్నట్లు ఈ సందర్భంగా మార్కెట్ విశ్లేషకులు అంబరీష్ బలీగా, ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజరీ సంస్థ క్రిస్.. డైరెక్టర్ అరుణ్ కేజ్రీవాల్ తదితరులు అభిప్రాయపడ్డారు. -
ఇసాబ్ భారీ డివిడెండ్- పతంజలి ఎన్సీడీలు హిట్
ప్రధానంగా నిర్మాణ రంగ కంపెనీలకు కీలక ప్రొడక్టులను విక్రయించే విదేశీ అనుబంధ కంపెనీ ఇసాబ్ ఇండియా వాటాదారులకు భారీ డివిడెండ్‌ను ప్రకటించింది. ఇక మరోవైపు.. వర్కింగ్ కేపిటల్ అవసరాల కోసం బాబా రామ్‌దేవ్ గ్రూప్ కంపెనీ పతంజలి ఆయుర్వేద ఎన్సీడీల జారీ ద్వారా నిధుల సమీకరణ చేపట్టింది. ఇతర వివరాలు చూద్దాం.. ఇసాబ్ ఇండియా వెల్డింగ్, కటింగ్ ఎక్విప్మెంట్ తయారీ దిగ్గజం ఇసాబ్ ఇండియా వాటాదారులకు భారీ మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. షేరుకి 700 శాతం(రూ. 70) చొప్పున చెల్లించేందుకు బోర్డు అనుమతించినట్లు పేర్కొంది. జూన్ 23కల్లా వాటాదారులకు డివిడెండ్‌ను చెల్లించనున్నట్లు వెల్లడించింది. ఇందుకు రూ. 108 కోట్లను కేటాయించినట్లు వివరించింది. కోవిడ్-19 కట్టడికి అమలు చేస్తున్న లాక్‌డవున్‌లో భాగంగా ఆంక్షలను సడలించడంతో దశలవారీగా ఉత్పత్తి కార్యక్రమాలకు తెరతీసినట్లు తెలియజేసింది. దేశంలోని వివిధ ప్రాంతాలలోగల ప్లాంట్లు ప్రస్తుతం 50 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఇసాబ్ ఇండియా షేరు 19 శాతంపైగా దూసుకెళ్లింది. రూ. 1304 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1310 వరకూ ఎగసింది. పతంజలి ఆయుర్వేద ఎఫ్ఎంసీజీ దిగ్గజం పతంజలి ఆయుర్వేద తొలిసారి జారీ చేసిన డిబెంచర్లు మూడు నిముషాలలోనే సబ్స్క్రయిబ్ అయ్యాయి. మార్పిడి రహిత డిబెంచర్ల(ఎన్సీడీలు) జారీ ద్వారా రూ. 250 కోట్లను సమీకరించినట్లు పతంజలి ఆయుర్వేద పేర్కొంది. దరఖాస్తుదారులకు 10.1 శాతం కూపన్ రేటుతో మూడేళ్ల కాలానికి ఎన్సీడీలను కేటాయించినట్లు తెలియజేసింది. రిడీమ్ చేసుకునేందుకు వీలైన వీటిని స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్చేసింది. పతంజలి ఎన్‌సీడీలకు బ్రిక్‌వర్క్ AA రేటింగ్‌ను ప్రకటించింది. వర్కింగ్ కేపిటల్ అవసరాలు, సప్లై చైన్ పటిష్టతకు నిధులను వినియోగించనున్నట్లు పతంజలి పేర్కొంది. కాగా.. దివాళా బాట పట్టిన వంట నూనెల కంపెనీ రుచీ సోయాను గతేడాది డిసెంబర్లో పతంజలి ఆయుర్వేద సొంతం చేసుకున్న విషయం విదితమే. న్యూట్రెలా, సన్ రిచ్, రుచీ గోల్డ్, మహాకోష్ బ్రాండ్లను కలిగిన రుచీ సోయా కొనుగోలుకి రూ. 4350 కోట్లను వెచ్చించింది. -
పతంజలి ఆయుర్వేద చేతికి రుచి సోయా
న్యూఢిల్లీ: రుచి సోయా కంపెనీ కొనుగోలు ప్రక్రియను పతంజలి ఆయుర్వేద పూర్తి చేసింది. కేసు పరిష్కార ప్రణాళికలో భాగం గా రుణ దాతల కోసం పతంజలి ఆయుర్వేద రూ.4,350 కోట్లను ఎస్క్రో అకౌంట్లో డిపాజిట్ చేయడంతో ఈ కొనుగోలు ప్రక్రియ పూర్తయింది. రుచి సోయాకు రుణాలిచ్చిన రుణదాతలకు చెల్లింపుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇక ఇప్పటి నుంచి రుచి సోయా తమ గ్రూప్ కంపెనీ అని పతంజలి ఆయుర్వేద ప్రతినిధి ఎస్.కె. తిజరీవాలా పేర్కొన్నారు. -
రాందేవ్ ‘బాలకృష్ణ’కు అస్వస్థత
డెహ్రాడూన్: ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబాకు అత్యంత సన్నిహితులు, పతంజలి ఆయుర్వేద సంస్థ చైర్మన్ ఆచార్య బాలకృష్ణ శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. రిషికేశ్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పతంజలి యోగాపీఠం సభ్యులు ఈ విషయాన్ని ధృవీకరించారు. తల తిరగడం, ఛాతిలో నొప్పి రావడంతో బాలకృష్ణను ఆస్పత్రికి తరలించారు. ఎయిమ్స్ అత్యవసర విభాగపు వైద్యులు ఆయనకు ట్రీట్మెంట్ అందిస్తున్నారని సమాచారం. ఆచార్య బాలకృష్ణ నేపాల్ సంతతికి చెందిన భారతీయ బిలియనీర్. -
ఠాక్రేతో రాందేవ్ భేటీ.. మతలబేంటి?
మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్‌ఠాక్రేను ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ కలిశారు. ముంబైలోని ఆయన నివాసమైన 'కృష్ణ కుంజ్'లో ఉదయం 9.30 గంటల సమయంలో ఈ భేటీ జరిగింది. వారిద్దరూ ఈ భేటీలో ఏం చర్చించుకున్నారో తెలియలేదు గానీ.. ఆ తర్వాత మాత్రం రాందేవ్ బాబాను రాజ్ ఠాక్రే పొగడ్తల్లో ముంచెత్తారు. హిందూ సంప్రదాయం, యోగా, ఆయుర్వేదం తదితర అంశాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడంలో రాందేవ్ మంచి పాత్ర పోషిస్తున్నారని అన్నారు. పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల ద్వారా ఆయుర్వేదం ప్రాముఖ్యాన్ని ప్రపంచానికి చాటుతున్నారని తెలిపారు. రాందేవ్‌ను కలవడం చాలా గొప్పగా అనిపిస్తోందని కూడా ఆయన చెప్పారు. అయితే ఈ సమావేశం గురించి రాందేవ్ వైపు నుంచి గానీ, పతంజలి గ్రూపు నుంచి గానీ ఎలాంటి సమాచారం విడుదల కాలేదు. -
తదుపరి టార్గెట్.. మెక్ డోనాల్డ్స్!
పతంజలి ఆయుర్వేద పేరుతో మార్కెట్లో ఇప్పటికే సంచలనాలు సృష్టిస్తున్న యోగా గురు బాబా రాందేవ్.. ఇప్పుడు బహుళ జాతీయ ఫుడ్ చైన్ మెక్ డోనాల్డ్స్ ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. దాంతోపాటు కేఎఫ్‌సీ, సబ్వే రెస్టారెంట్లను కూడా టార్గెట్ చేసేలా ఉన్నారు. కొత్తగా రెస్టారెంటు వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టి.. అసలైన భారతీయ వంటకాలను అందించడం ద్వారా వాటి వ్యాపారాన్ని కొల్లగొట్టాలని చూస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రెస్టారెంట్ల చైన్ ఓపెన్ చేయాలని పతంజలి గ్రూపు తీవ్రంగా ఆలోచిస్తోంది. ఈ విషయాన్ని రాందేవ్ స్వయంగా వెల్లడించారు. ఇప్పటికే టూత్ పేస్టు నుంచి రకరకాల ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చి.. వాటికి మంచి ఆదరణ కూడా పొందిన పతంజలి సంస్థ.. ఇప్పుడు మూలికలు, ప్రత్యేకంగా శరీరానికి మేలుచేసే పదార్థాలతో కూడిన ఆహారాన్ని భారతీయులకు అందించాలని భావిస్తోంది. పతంజలి బిస్కట్ల లాంటి వాటికి ఇప్పటికే చాలామంది అభిమానులు ఉన్నారు. దాంతో ఇప్పుడు ఫుడ్ రీటైలింగ్‌లోకి అడుగుపెడితే కచ్చితంగా మిగిలినవాళ్లకు గట్టి పోటీ ఇవ్వగలమన్న విశ్వాసాన్ని పతంజలి వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. దేశంలో జరుగుతున్న మొత్తం రీటైల్ వ్యాపారంలో 57 శాతం వాటా ఆహార ఉత్పత్తులదే. 2025 నాటికి ఈ మార్కెట్ మూడు రెట్లు పెరిగి దాదాపు రూ. 71 లక్షల కోట్లు అవుతుందని అంచనా. డామినోస్ పిజ్జా లాంటి చాలామంది ఈ రంగంలో ఇప్పటికే పాతుకుపోయి ఉన్నారు. అయినా అవసరమైతే ఎంత పెట్టుబడి అయినా పెట్టి మరీ ఆహార వ్యాపారాన్ని కొల్లగొట్టాలన్నది రాందేవ్ వ్యూహంలా కనిపిస్తోంది. భారతీయులకు అనారోగ్యకరమైన ఆహారాన్ని అందించడం ఎందుకని.. ఆహారంతో పాటే ఆరోగ్యాన్ని కూడా ఇస్తే మంచిది కదా అని ఆయన అంటున్నారు. ఆహార పదార్థాలు, పౌష్టిక పదార్థాలు, సౌందర్య సాధనాలు.. వీటన్నింటికీ ఉన్నట్లే రీటైల్ ఫుడ్ చైన్లకు కూడా మంచి గిరాకీ ఉంటుందని ఆశిస్తున్నారు. -
పశ్చిమ దేశాల్లోనూ యోగాకు ఆదరణ
ప్రముఖ యోగా గురు రాందేవ్‌బాబా వాషింగ్టన్: పశ్చిమ దేశాల్లోనూ యోగాకు ఆదరణ పెరుగుతోందని ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా తెలిపారు. విభిన్న భావజాలాలు, సంస్కృతి, మతాల వల్ల ఎదురయ్యే సమస్యలకు యోగా పరిష్కారంగా మారుతోందన్నారు. యోగాతో ప్రజల దైనందిక జీవితం మారడంతో పాటు, అనేక సత్ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది సానుకూల వ్యాపారంగానూ ఉందన్నారు. ఉత్తర అమెరికా పర్యటనలో భాగంగా రాందేవ్ బుధవారం టొరెంటో చేరుకున్నారు. తమ సంస్థ పతంజలి ఆయుర్వేద రాబోయే మూడేళ్లలో పలు బహుళ జాతి సంస్థలను అధిగమిస్తుందని తెలిపారు. న్యూయార్క్‌లో జరిగిన ఇండియాడే పెరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన రాందేవ్, ఈ వేడుకలను మరింత బాగా చేయాల్సిందని భావించారు. స్వాతంత్య్ర వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ బలూచిస్తాన్ ప్రస్తావన తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు. అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలు సంస్కృతికి, నాగరికతకి మధ్య వైరం పెరిగిందనడానికి అసలుసిసలు సాక్ష్యమని వెల్లడించారు. -
పంచె పైకి కట్టి.. రాందేవ్ ఫుట్‌బాల్
యోగా గురువు రాందేవ్ బాబా ఏం చేసినా వెరైటీగానే చేస్తారు. తాజాగా ఆయన కొంతమంది స్టార్ ఆటగాళ్లతో కలిసి ఫుట్‌బాల్ ఆడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పథకాలైన స్వచ్ఛభారత్ మిషన్, బేటీ బచావో- బేటీ పఢావో కార్యక్రమాలపై అవగాహన పెంచేందుకు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాందేవ్ పాల్గొన్నారు. ఇందు కోసం బాలీవుడ్ తారలు, పార్లమెంటేరియన్లు కలిసి ఒక ఫుట్‌బాల్ మ్యాచ్ అడగా, అందులో తాను సైతం అంటూ.. రాందేవ్ తన పంచె పైకి కట్టుకుని ఫుట్‌బాల్ ఆడారు. ఆల్ స్టార్స్ ఫుట్ బాల్ క్లబ్బు జట్టులో రణబీర్ కపూర్, అర్జున్ కపూర్, డినో మోరియా, సిద్దార్థ మల్హోత్రా తదితరులుండగా... ఆ జట్టుకు అభిషేక్ బచ్చన్ నాయకత్వం వహించాడు. ఇక పార్లమెంటేరియన్ల జట్టుకు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి బాబుల్ సుప్రియో కెప్టెన్‌గా వ్యవహరించారు. టీఎంసీ ఎంపీ, భారత ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్ ప్రసూన్ బెనర్జీ, బీజేపీ ఎంపీలు మనోజ్ తివారీ, పర్వేష్ వర్మ, కమలేష్ పాశ్వాన్ సతీష్ గౌతమ్, భోలా సింగ్, ఐఎన్ఎల్డీ ఎంపీ దుష్యంత చౌతాలా, టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తదితరులు ఆడారు. ఆధునిక్ అనే ఓ ప్రైవేటు గ్యాలరీ ఏర్పాటుచేసిన ఈ ఆటను చూసేందుకు 200 రూపాయల నుంచి 800 రూపాయల వరకు టికెట్లు పెట్టారు. టికెట్ల అమ్మకం ద్వారా వచ్చిన మొత్తాన్ని ఆ రెండు పథకాల ప్రచారానికి విరాళంగా ఇచ్చారు. ఈ రెండు కార్యక్రమాల్లో దేనికీ రాందేవ్ విరాళం ఇవ్వకపోయినా.. ఫుట్ బాల్ మ్యాచ్ ఆడిన తారలు, నాయకులకు మాత్రం పతంజలి ఆయుర్వేద వారి ఎనర్జీ డ్రింకులు, స్నాక్స్ అందించారు. -
కోల్గేట్ మార్కెట్ వాటాకు రాందేవ్ బాబా గండి!
నిన్న కాక మొన్న నూడుల్స్ మార్కెట్లో ప్రవేశించి ఆటా నూడుల్స్‌తో నెస్లే కంపెనీకి గండికొట్టిన రాందేవ్ బాబా సంస్థ పతంజలి ఆయుర్వేద.. ఇప్పుడు టూత్‌పేస్ట్ మార్కెట్లోకి కూడా అడుగుపెట్టింది. ఇన్నాళ్లూ ఈ రంగంలో రారాజుగా ఉన్న కోల్గేట్ పామోలివ్ వాటాకు గండికొడుతోంది. ఇప్పటికే టూత్‌పేస్ట్ మార్కెట్లో 4.5 శాతం వాటాను పతంజలి ఆయుర్వేద చేజిక్కించుకుంది. ఈ విషయాన్ని కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ సంస్థ తెలిపింది. గడిచిన ఏడాది కాలంలో కోల్గేట్ సంస్థ తన మార్కెట్‌ను గణనీయంగా కోల్పోయింది. 'దంత కాంతి' పేరుతో ఆయుర్వేద టూత్‌పేస్టును పతంజలి ఆయుర్వేద విడుదల చేసింది. అందులో మెడికేటెడ్, అడ్వాన్స్డ్, జూనియర్ అనే మూడు రకాలను కూడా ప్రవేశపెట్టింది. ఇక త్వరలోనే ఫుడ్ డ్రింకులు, బేబీ కేర్ ఉత్పత్తులను కూడా ప్రవేశపెట్టి.. ఆ రంగాల్లో ఉన్న బహుళ జాతి సంస్థల గుత్తాధిపత్యానికి గండికొట్టాలని పతంజలి ఆయుర్వేద భావిస్తోంది. ఇన్నాళ్లూ బేబీ కేర్ రంగంలో జాన్సన్ అండ్ జాన్సన్ ఆధిపత్యం కొనసాగుతున్న విషయం తెలిసిందే.