
ఠాక్రేతో రాందేవ్ భేటీ.. మతలబేంటి?
మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్‌ఠాక్రేను ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ కలిశారు. ముంబైలోని ఆయన నివాసమైన 'కృష్ణ కుంజ్'లో ఉదయం 9.30 గంటల సమయంలో ఈ భేటీ జరిగింది. వారిద్దరూ ఈ భేటీలో ఏం చర్చించుకున్నారో తెలియలేదు గానీ.. ఆ తర్వాత మాత్రం రాందేవ్ బాబాను రాజ్ ఠాక్రే పొగడ్తల్లో ముంచెత్తారు.
హిందూ సంప్రదాయం, యోగా, ఆయుర్వేదం తదితర అంశాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడంలో రాందేవ్ మంచి పాత్ర పోషిస్తున్నారని అన్నారు. పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల ద్వారా ఆయుర్వేదం ప్రాముఖ్యాన్ని ప్రపంచానికి చాటుతున్నారని తెలిపారు. రాందేవ్‌ను కలవడం చాలా గొప్పగా అనిపిస్తోందని కూడా ఆయన చెప్పారు. అయితే ఈ సమావేశం గురించి రాందేవ్ వైపు నుంచి గానీ, పతంజలి గ్రూపు నుంచి గానీ ఎలాంటి సమాచారం విడుదల కాలేదు.