గోసాయిచిట్కా ప్రకటనలేనా? | SC issues Patanjalis Ramdev notice | Sakshi
Sakshi News home page

గోసాయిచిట్కా ప్రకటనలేనా?

Published Fri, Mar 1 2024 4:09 AM | Last Updated on Fri, Mar 1 2024 12:57 PM

SC issues Patanjalis Ramdev notice - Sakshi

ఏ ఉత్పత్తికైనా ప్రచారం కావాలి. ప్రచారానికి ప్రకటనలివ్వాలి. ప్రకటనల్లో చెప్పేదంతా సంపూర్ణ సత్యమని ఎవరూ అనుకోరు కానీ, ప్రజల్ని మభ్యపెట్టేలా అసత్యాల్ని వ్యాప్తిలో పెడితేనే చిక్కు. మరీ ముఖ్యంగా, జీవితాలను ప్రభావితం చేసే ఆరోగ్యం, ఆర్థిక అంశాలపై అసత్య వాణిజ్య ప్రకటనలు ప్రమాదకరం. పాపులర్‌ యోగాగురు బాబా రామ్‌దేవ్‌కు చెందిన ‘పతంజలి ఆయుర్వేద్‌’ సంస్థ ప్రకటనలు సరిగ్గా ఇలాగే ‘తప్పుదోవ పట్టించేలా, అసత్యపూర్వకం’గా ఉన్నాయని దేశ సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

రకరకాల జబ్బులు నయమవుతాయంటున్న సదరు ఉత్పత్తుల ప్రకటనలపై తాత్కాలిక నిషేధం విధించింది. పైగా, ‘దేశం మొత్తాన్నీ ఇలా ఓ సంస్థ మోసం చేస్తూ ఉంటే’, కేంద్రం చోద్యం చూడడాన్ని సుప్రీమ్‌ కోర్ట్‌ తప్పుబట్టింది. అలాంటి ప్రచారం చేయరాదని ఉత్తర్వులిచ్చినా సరే ఉల్లంఘించినందుకు గాను సంస్థ ఎండీకి కోర్టు ధిక్కార నోటీసులివ్వడం విశేషం. స్థానిక ఉత్పత్తులతో విపణిలో బహుళ జాతి సంస్థలను మించాలని చూస్తున్న రామ్‌దేవ్‌ మాత్రం ఇదంతా ఆయుర్వేదంపై, తన మూలికా వ్యాపారంపై సాగుతున్న కుట్ర అని ఆరోపిస్తున్నారు. 

టూత్‌పేస్ట్‌ల నుంచి ఆహార ఉత్పత్తులు, మందుల దాకా అన్నీ అందిస్తున్న పతంజలి సంస్థ ఆధునిక వైద్య విధానాలకూ, కోవిడ్‌ టీకాకరణకూ వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తోందని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ 2022లో కోర్టుకెక్కింది. ఇద్దరు జడ్జీల ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. కోవిడ్‌ వేళ అల్లోపతి వైద్యుల్ని తక్కువ చేసేందుకు రావ్‌ుదేవ్‌ ప్రయత్నించారు. ఆ వ్యవహార శైలిని 2022 ఆగస్ట్‌లో సుప్రీమ్‌ కోర్ట్‌ ప్రశ్నించింది. అసత్య ప్రకటనలు, తప్పుదోవ పట్టించేవాటిని తక్షణమే ఆపేయాలంటూ గత నవంబర్‌లో సుప్రీమ్‌ ఆదేశించింది. అప్పట్లోనే పతంజలి తరఫు వకీలు సైతం తమ ఉత్పత్తుల ప్రకటనకు సంబంధించి ఇకపై చట్టాన్ని ఉల్లంఘించబోమని కోర్టుకు విన్నవించారు. ఔషధ సామర్థ్యంపై మీడియాలో ప్రకటనలివ్వబోమని కూడా హామీ ఇచ్చారు కానీ కట్టుబడ లేదు. 

2006లో ఆరంభమైన పతంజలి శరవేగంతో పైకి వచ్చింది. ప్రపంచమంతా కోవిడ్‌తో అతలా కుతలం అవుతున్నప్పుడు 2020 జూన్‌లో కోవిడ్‌కు మందు కనుక్కున్నామంటూ రామ్‌దేవ్‌ ప్రకటించారు. ‘కరోనిల్, శ్వాసారి’ మందుల్ని ఆవిష్కరించారు. అయితే, సంస్థ ఇచ్చిన పత్రాలన్నిటినీ క్షుణ్ణంగా సమీక్షించేంత వరకు సదరు ఉత్పత్తుల వాణిజ్య ప్రకటనల్ని ఆపేయాలంటూ ‘ఆయుష్‌’ మంత్రిత్వ శాఖ తేల్చిచెప్పింది. అయినా పతంజలి తన పంథా మానలేదు. సరికదా... కరోనా వేవ్‌లు కొనసాగుతుండగానే 2021 ఫిబ్రవరిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నియమానుసారం కోవిడ్‌ చికిత్సలో అండగా కరోనిల్‌ మందును వాడవచ్చని ‘ఆయుష్‌’ నుంచి ధ్రువీకరణ పత్రం వచ్చినట్టు అబద్ధమాడింది. కానీ, ఏ సాంప్రదాయిక ఔషధ సామర్థ్యాన్నీ తాము పరీక్షించనే లేదనీ, అసలు ధ్రువీకరించనే లేదనీ ఐరాస ఆరోగ్య సంస్థ ప్రకటించేసరికి బండారం బయటపడింది.

ఇదొక్కటే కాదు... పతంజలి చుట్టూ ఎప్పుడూ ఏదో ఒక వివాదమే. 2015లో దేశంలో మ్యాగీ నూడుల్స్‌పై రచ్చ రేగినప్పుడు భారత ఆహార భద్రత, నియంత్రణ సంస్థ ఆమోదమైనా లేకుండానే, పతంజలి ఆటా నూడుల్స్‌ మార్కెట్‌లోకి వచ్చాయి. ఆహార భద్రతా నియమాలను ఉల్లంఘించారంటూ ప్రభుత్వం ఆనక నోటీసిచ్చింది. అలాగే, ‘దివ్యపుత్రజీవక్‌ బీజ్‌’ వాడితే చాలు అబ్బాయే పుడతా డంటూ 2015లో మరో మందును మార్కెట్‌లోకి తేవడమూ వివాదమైంది. ఇక, 2016లో పతంజలి ఆమ్లా రసం వినియోగానికి పనికిరాదంటూ రక్షణ దళాల క్యాంటీన్‌ స్టోర్స్‌ డిపార్ట్‌మెంట్‌ దాన్ని అమ్మ కాన్ని నిలిపేసింది. నిరుడు ‘దివ్య దంత మంజన్‌’ను శాకాహార ఉత్పత్తిగా పేర్కొంటూ దానిలో ఒక జాతి చేపను వాడడమూ రగడయింది. పతంజలి వ్యవహారశైలిపై ప్రత్యర్థుల అభ్యంతరాలు చెప్పడం నిజమే కానీ, ప్రపంచ సంస్థలన్నీ కట్టగట్టుకొని దానిపై కుట్ర చేస్తున్నాయనే మాట అసంబద్ధం. 

యోగాతో ఎయిడ్స్, క్యాన్సర్‌లను తగ్గించవచ్చంటూ 2006లోనే ప్రకటించిన రామ్‌దేవ్‌ వ్యాపార ప్రయాణం రెండు దశాబ్దాలవుతున్నా నేటికీ అనుమానాస్పదమే. రామ్‌దేవ్‌ మాటల్నే కాదు, పతంజలి ప్రకటనల్నీ ఆరోగ్యశాఖ కొట్టిపారేస్తున్నా సరే... అవే అసత్యాలు విస్తృత ప్రకటన లుగా వ్యాప్తిలో ఉండడం దురదృష్టం. ఏ ఔషధమైనా సరే ఔషధ రెగ్యులేటర్ల కఠిన పరీక్షల్లో పాసై, నిర్ణీత చికిత్సకు ఉపయోగమని ఆమోదం పొందడం అల్లోపతిలో గీటురాయి. అలాగని సంప్రదాయ ఔషధ విధానాలన్నిటినీ కొట్టిపారేయమని కాదు కానీ, పరీక్షకు నిల్చి ఫలితాలతో గెలిస్తేనే ప్రపంచంలో ప్రామాణికత. పతంజలి తన ఉత్పత్తుల టముకు ఎంత మోగిస్తున్నా, అధీకృత శాస్త్రీయసంస్థలేవీ వాటికి ఆమోదముద్ర వేయలేదు. సాధారణ ఆరోగ్యం కోసమని స్పష్టంగా చెప్పే సంప్ర దాయ మందుల్ని నమ్మకం మీద వాడవచ్చు కానీ, కరోనా లాంటి నిర్ణీత వ్యాధుల నివారణకు పరమౌషధం అన్నప్పుడు శాస్త్రీయ నిర్ధారణ పరీక్షలు, ఫలితాలు కీలకం. 

అందులో వెనుకబడ్డ పతంజలి తీరా శాస్త్రీయ వైద్యవిధానాలపై అపనమ్మకం రేపుతోంది. సర్వ రోగ నివారిణి తమదే అన్నట్టు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తే అనవసర ఆరోగ్య సంక్షోభమే. నకిలీ వైద్యులు, గోసాయిచిట్కాలతో ఇల్లు ఒళ్ళు గుల్లవుతాయి. డ్రగ్స్‌ అండ్‌ మ్యాజిక్‌ రెమిడీస్‌ (అభ్యంతర కర యాడ్స్‌) యాక్ట్‌–1954 లాంటివి ఎప్పటి నుంచో ఉన్నా, పకడ్బందీగా అమలు చేయడంలో నిర్లిప్తత నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు సుప్రీమ్‌ చేసిన వ్యాఖ్యలు కీలకమై నవి. అరచేతిలో ఆరోగ్య స్వర్గం చూపే ప్రకటనల పట్ల జనం అప్రమత్తంగా ఉండాలి. అలాంటి సంస్థలపైనా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. ఇక నైనా, బుద్ధి తెచ్చుకొని పతంజలి తీరు మార్చుకోవాలి. తలబొప్పి కట్టిన పాలకులు బాధ్యతల నిర్వహణలో చిత్తశుద్ధి చూపాలి. 

– సభావట్‌ కళ్యాణ్, ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement