పశ్చిమ దేశాల్లోనూ యోగాకు ఆదరణ
ప్రముఖ యోగా గురు రాందేవ్‌బాబా
వాషింగ్టన్: పశ్చిమ దేశాల్లోనూ యోగాకు ఆదరణ పెరుగుతోందని ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా తెలిపారు. విభిన్న భావజాలాలు, సంస్కృతి, మతాల వల్ల ఎదురయ్యే సమస్యలకు యోగా పరిష్కారంగా మారుతోందన్నారు. యోగాతో ప్రజల దైనందిక జీవితం మారడంతో పాటు, అనేక సత్ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది సానుకూల వ్యాపారంగానూ ఉందన్నారు. ఉత్తర అమెరికా పర్యటనలో భాగంగా రాందేవ్ బుధవారం టొరెంటో చేరుకున్నారు. తమ సంస్థ పతంజలి ఆయుర్వేద రాబోయే మూడేళ్లలో పలు బహుళ జాతి సంస్థలను అధిగమిస్తుందని తెలిపారు.
న్యూయార్క్‌లో జరిగిన ఇండియాడే పెరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన రాందేవ్, ఈ వేడుకలను మరింత బాగా చేయాల్సిందని భావించారు. స్వాతంత్య్ర వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ బలూచిస్తాన్ ప్రస్తావన తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు. అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలు సంస్కృతికి, నాగరికతకి మధ్య వైరం పెరిగిందనడానికి అసలుసిసలు సాక్ష్యమని వెల్లడించారు.