ఇటీవల నిరవధికంగా ర్యాలీ చేస్తున్న వంట నూనెల కంపెనీ రుచీ సోయా ఇండస్ట్రీస్ కౌంటర్లో తాజాగా అమ్మకాలు ఊపందుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 5 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు అధికంకాగా.. కొనుగోలుదారులు కరువుకావడంతో రూ. 76 నష్టపోయి రూ, 1444 దిగువన ఫ్రీజయ్యింది. కాగా.. ఈ షేరు జనవరిలో స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యాక వరుసగా అప్పర్ సర్క్యూట్లను తాకుతూ వస్తోంది. తద్వారా వారాంతానికల్లా 9400 శాతం ర్యాలీ చేసింది. ఇతర వివరాలు చూద్దాం..
నికర నష్టం
గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో రుచీ సోయా రూ. 41 కోట్ల నికర నష్టం ప్రకటించింది. నికర అమ్మకాలు మాత్రం నామమాత్రంగా 1.4 శాతం పెరిగి రూ, 3191 కోట్లకు చేరాయి. దివాళా చట్టానికి లోబడి గతేడాది పతంజలి గ్రూప్ సొంతం చేసుకున్న రుచీ సోయా కౌంటర్ స్టాక్ ఎక్స్ఛేంజీలలో నిరవధిక ర్యాలీ చేస్తూ వస్తోంది. ఈ ఏడాది జనవరి 27న రూ. 16 వద్ద తిరిగి లిస్టయిన ఈ షేరు వారాంతాన ఎన్‌ఎస్‌ఈలో రూ. 1520 వద్ద ఫ్రీజయ్యింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. గత ఐదు నెలల్లో 9400 శాతం ర్యాలీ చేసింది. మధ్యలో అంటే మే నెలలో ఆరు రోజుల డౌన్ సర్క్యూట్ల తదుపరి తిరిగి వరుసగా 22వ సెషన్‌లోనూ 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. తిరిగి నేటి ట్రేడింగ్‌లో అమ్మకాలు తలెత్తడంతో 5 శాతం పతనమైంది. కంపెనీ దివాళాకు చేరడంతో నవంబర్ 2019లో ఈ షేరు 3.30 స్థాయిలో డీలిస్టయ్యింది.
పబ్లిక్‌కు 0.8 శాతమే
రుణ చెల్లింపుల్లో విఫలమై ఎన్‌ఎస్‌ఎల్‌టీకి చేరిన రుచీ సోయాను కార్పొరేట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పతంజలి ఆయుర్వేద రూ. 4500 కోట్లకు కొనుగోలు చేసిన విషయం విదితమే. తదుపరి కంపెనీ ఈక్విటీలో చేపట్టిన మార్పుల ఫలితంగా పతంజలి గ్రూప్‌నకు 98.87 శాతం వాటా లభించింది. పబ్లిక్‌కు కేవలం 0.97 శాతం వాటా మిగిలింది. దీనిలోనూ రిటైల్ ఇన్వెస్టర్లకు 0.82 శాతమే వాటా లభించినట్లు నిపుణులు పేర్కొన్నారు. వాటాదారుల వద్దనున్న ప్రతీ 100 షేర్లకుగాను 1 షేరునే కేటాయించింది. దీంతో ఈ కౌంటర్లో ఫ్లోటింగ్ స్టాక్ అతితక్కువగా ఉన్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. వెరసి ఈ కౌంటర్‌పట్ల అప్రమత్తత అవసరమని సూచించారు. లిస్టింగ్ నిబంధనల ప్రకారం కంపెనీలో పబ్లిక్‌కు ఏడాదిన్నరలోగా 10 శాతం వాటాను, మూడేళ్లలోగా 25 శాతం వాటాను కల్పించవలసి ఉంటుందని తెలియజేశారు. పబ్లిక్ వాటా పెరిగిన సందర్భంలో మాత్రమే కంపెనీ అసలు విలువ షేరు ధరలో ప్రతిబింబించగలదని వివరించారు. షేరు ర్యాలీపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దృష్టి పెట్టవలసి ఉన్నట్లు ఈ సందర్భంగా మార్కెట్ విశ్లేషకులు అంబరీష్ బలీగా, ఇన్వెస్ట్‌మెంట్ అడ్వయిజరీ సంస్థ క్రిస్.. డైరెక్టర్ అరుణ్ కేజ్రీవాల్ తదితరులు అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment