న్యూఢిల్లీ: వంట నూనెల దిగ్గజం రుచీ సోయా ఇండస్ట్రీస్ రుణరహితంగా ఆవిర్భవించినట్లు తాజాగా ప్రకటించింది. బ్యాంకులకు చెల్లించవలసిన రూ.2,925 కోట్లను చెల్లించినట్లు తెలియజేసింది. దీంతో పూర్తిస్థాయిలో రుణ భారానికి చెక్ పెట్టినట్లు వెల్లడించింది. బాబా రామ్‌దేవ్ నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేద గ్రూప్ కంపెనీ రుచీ సోయా ఇటీవల ఫాలోఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీవో)ను చేపట్టిన సంగతి తెలిసిందే. తద్వారా రూ. 4,300 కోట్ల పెట్టుబడులను సమీకరించింది.
ఈ నిధులతో కొంతమేర రుణ చెల్లింపులు చేపట్టినట్లు రుచీ సోయా తెలియజేసింది. రుచీ సోయా రుణ రహిత కంపెనీగా ఆవిర్భవించినట్లు పతంజలి ఆయుర్వేద ఎండీ ఆచార్య బాలకృష్ణ తాజాగా ట్వీట్ చేశారు. కాగా..ఎఫ్‌పీవో కోసం క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దాఖలు చేసిన ప్రాస్పెక్టస్‌లో రుచీ సోయా రూ. 1,950 కోట్లను రుణ చెల్లింపులకు వినియోగించనున్నట్లు పేర్కొన్నట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. అయితే రూ.2,925 కోట్లను ఇందుకు వెచ్చించడం గమనార్హం!
స్టేట్‌బ్యాంక్ అధ్యక్షతన బ్యాంకు ల కన్సార్షియంకు చెల్లింపులు చేపట్టినట్లు రుచీ సోయా పేర్కొంది. ఈ కన్సార్షియంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ ఉన్నాయి. 2019లో దివాలా చట్ట ప్రక్రి యలో భాగంగా రుచీ సోయాను రూ. 4,350 కోట్లకు పతంజలి సొంతం చేసుకున్న విషయం విదితమే. కాగా, రుణ చెల్లింపుల వార్తల నేపథ్యంలో రుచీ సోయా షేరు ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 15 శాతం దూసుకెళ్లి రూ. 938 వద్ద ముగిసింది.
చదవండి: కోటీశ్వరులయ్యే మంత్రం చెప్పిన బాబా రామ్‌దేవ్.. సెబీ సీరియస్
Comments
Please login to add a commentAdd a comment