రెండు రోజుల క్రితం బంపర్ లిస్టింగ్ సాధించిన రూట్ మొబైల్ కౌంటర్‌కు డిమాండ్ కొనసాగుతోంది. విదేశీ సంస్థలు కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం దీనికి కారణంకాగా.. యూనిఫై వెల్త్ మేనేజ్‌మెంట్ వాటా కొనుగోలు చేసినట్లు వెల్లడికావడంతో మజెస్కో లిమిటెడ్ షేరు సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. మరోపక్క ఆఫర్ ఫర్ సేల్‌కు మార్కెట్ ధర కంటే భారీ డిస్కౌంట్‌లో ఫ్లోర్ ధర నిర్ణయించడంతో జీఎంఎం ఫాడ్లర్ కౌంటర్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. వివరాలు చూద్దాం..
రూట్ మొబైల్
పబ్లిక్ ఇష్యూ ధర రూ. 350తో పోలిస్తే లిస్టింగ్ రోజు సోమవారం 86 శాతం లాభంతో రూ. 650 వద్ద స్థిరపడిన రూట్ మొబైల్ తాజాగా సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. ఎన్‌ఎస్‌ఈలో తొలుత 18 శాతం దూసుకెళ్లి రూ. 829కు చేరింది. వెరసి మూడు రోజుల్లో 134 శాతం ర్యాలీ చేసింది. ప్రస్తుతం 12.5 శాతం జంప్‌చేసి రూ. 781 వద్ద ట్రేడవుతోంది. లిస్టింగ్ రోజు గోల్డ్‌మన్ శాక్స్, కువైట్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ రూ. 210 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసినట్లు వెల్లడికావడంతో ఈ కౌంటర్ జోరు చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. షేరుకి రూ. 697 ధరలో వీటిని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
మజెస్కో లిమిటెడ్
ఎన్‌ఎస్‌ఈ బల్క్ డీల్ వివరాల ప్రకారం యూనిఫై వెల్త్ మేనేజ్‌మెంట్ మంగళవారం మజెస్కో లిమిటెడ్‌లో 2.06 లక్షల షేర్లను కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. షేరుకి రూ. 779 ధరలో వీటిని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తొలుత ఎన్‌ఎస్‌ఈలో మజెస్కో షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 817 వరకూ ఎగసింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 3 శాతం లాభంతో రూ. 801 వద్ద ట్రేడవుతోంది.
జీఎంఎం ఫాడ్లర్
ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రమోటర్ గ్రూప్ సంస్థలు 17.59 శాతం వాటాను విక్రయానికి పెట్టిన నేపథ్యంలో జీఎంఎం ఫాడ్లర్ కౌంటర్లో వరుసగా రెండో రోజు అమ్మకాలు ఊపందుకున్నాయి. కొనుగోలుదారులు కరువుకావడంతో 10 శాతం పతనమైంది. రూ. 4,215 దిగువన ఫ్రీజయ్యింది. ఓఎఫ్‌ఎస్‌కు ఫ్లోర్ ధర రూ. 3,500 కావడంతో మంగళవారం సైతం ఈ షేరు 10 శాతం కుప్పకూలిన విషయం విదితమే. నేటితో ఓఎఫ్‌ఎస్ ముగియనుంది. కంపెనీ ప్రమోటర్ సంస్థలు ఫాడ్లర్ ఇంక్, మిల్లర్స్ మెషీనరీతోపాటు, ఊర్మి పటేల్ సంయుక్తంగా 2.57 మిలియన్ షేర్లను విక్రయించనున్నారు. అధిక స్పందన లభిస్తే మరో 1.52 మిలియన్ షేర్లను సైతం విక్రయించనున్నాయి. తద్వారా మొత్తం 28 శాతంవరకూ వాటాను విక్రయించనున్నట్లు తెలియజేశాయి. జూన్‌కల్లా కంపెనీలో ప్రమోటర్ల వాటా 75 శాతంగా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment