(సాక్షి ప్రతినిధి, అమరావతి): విద్యుత్ వాహనాల్లో వాడే లిథియం అయాన్ బ్యాటరీ తయారీలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా గ్రీన్ హైడ్రోజన్‌ను ముందుకు తెస్తున్నారు శాస్త్రవేత్తలు. దీనిని భవిష్యత్ ఇంధనంగా కూడా చెబుతున్నారు. విద్యుత్ వాహనాల్లో గ్రీన్ హైడ్రోజన్‌ను ఇంధనంగా ఉపయోగించుకొని నడిచే ఫ్యూయల్ సెల్ ఆధారిత వాహనాల మీదా పలు దేశాలతోపాటు మన దేశంలోనూ ముమ్మరంగా పరిశోధనలు జరుగుతున్నాయి. గ్రీన్ హైడ్రోజన్ మీద నడిచే వాహనాలనూ (ఫ్యూయల్ సెల్ ఎల్రక్టానిక్ వెహికల్స్) (ఎఫ్‌సీఈవీ) దేశంలో తయారు చేశారు. కాలుష్య రహితంగా రవాణా రంగం రూపు మార్చడానికి గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. అదే సమయంలో కొన్ని సవాళ్లనూ మన ముందు ఉంచింది.
చదవండి: గుజరాత్‌లో మూడుముక్కలాట.. కేజ్రీవాల్ కింగా? కింగ్ మేకరా?
ఇదీ సాంకేతికత
హైడ్రోజన్, ఆక్సిజన్ మధ్య ఎలక్ట్రో కెమికల్ రియాక్షన్ వల్ల విద్యుత్ పుడుతుంది. ఈ శక్తిని వాడుకుని ఇంజన్ నడుస్తుంది. లిథియం అయాన్ బ్యాటరీ తయారీలో వాడే ముడిపదార్థాల లభ్యత మన దేశంలో తక్కువగా ఉండటం మనకు సమస్య. కానీ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడంలో ఉపయోగించే ముడి పదార్థాల సమస్య మనకు లేదు.
రానురాను తక్కువ ధరకే ఇంధనం
దేశంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి పన్ను రాయితీలతో పాటు ఇతర రాయితీలను కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తి ధరలు తగ్గుతున్నందున, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ధరలు కూడా క్రమేణా తగ్గుతాయని నీతి ఆయోగ్ ‘హార్నెసింగ్ గ్రీన్ హైడ్రోజన్’ నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం గ్రీన్ హైడ్రోజన్ ఒక కిలో ఉత్పత్తి చేయడానికి 2030లో 1.6 డాలర్లు, 2050కి 0.7 డాలర్లు అవుతుందని నీతి ఆయోగ్ అంచనా వేసింది.
హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్స్‌తో ప్రయోజనాలు ఇవీ..
♦ఒకసారి హైడ్రోజన్ నింపితే సుదీర్ఘ ప్రయాణం చేయొచ్చు. లిథియం అయాన్ బ్యాటరీ వాహనాలతో పోలిస్తే దీని రేంజ్ బాగా ఎక్కువ
♦రీ ఫ్యూయలింగ్ సులభం. వేగంగా పూర్తి చేయొచ్చు. చార్జింగ్ అవసరం లేదు. బ్యాటరీ చార్జ్ అయ్యే వరకు వేచి చూసే అవసరం ఉండదు.
♦కాలుష్యం వెలువడదు
♦దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం లేదు. అందువల్ల హైడ్రోజన్‌ను ప్రభుత్వాలు చౌకగా అందించే అవకాశం ఉంది. చౌకగా లభ్యమయితే వ్యయమూ బాగా తగ్గుతుంది.
సవాళ్లూ ఉన్నాయి..
♦హైడ్రోజన్‌కు మండే స్వభావం ఎక్కువ. నిల్వ చేసిన ట్యాంకు లోహాన్ని పెళుసుగా మార్చే గుణం ఉంటుంది. ఫలితంగా లీకేజీకి అవకాశాలు ఉంటాయి.
♦హైడ్రోజన్ ఉత్పత్తి అత్యంత జఠిలమైన ప్రక్రియ. ఉత్పత్తి వ్యయాన్ని ఇప్పుడే అంచనా వేయలేం. గ్రీన్ హైడ్రోజన్ కాకపోతే ఉత్పత్తి సమయంలో కాలుష్యం వెలువడుతుంది. సంప్రదాయ శిలాజ ఇంధనాలను ఉత్పత్తికి వాడితే వ్యయం తక్కువగా ఉంటుందని ఆశించలేం.
♦ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం.. హైడ్రోజన్ నిల్వ, రవాణా కష్టమైన అంశాలు. అందువల్ల రవాణా కూడా ఖరీదే.
♦దేశంలో డిమాండ్‌కు అనుగుణంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి చాలా సమయం పడుతుంది. వాహనాల తయారీతో పాటు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి టెక్నాలజీ మీద ఏకకాలంలో పనిచేయాలి.
హైడ్రోజన్ పలు రకాలు
ఉత్పత్తి విధానాన్ని బట్టి హైడ్రోజన్‌ను 6 రకాలుగా విభజించారు
1. గ్రీన్ హైడ్రోజన్
ఎలక్ట్రోలసిస్ ద్వారా నీటిని వినియోగించి హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తారు. ఈ విధానంలో పవన, సౌర విద్యుత్ లాంటి పునరుత్పాదక వనరులు వాడతారు. ఈ విధానంలో కాలుష్యానికి చోటు లేదు.
2. వైట్ హైడ్రోజన్ (సహజ హైడ్రోజన్)
శిలాజ ఇంధనాలు, సహజ వాయువు లభించినట్లుగానే హైడ్రోజన్ కూడా భూమిలో లభిస్తుంది. సహజ వాయువు ఉత్పత్తి మాదిరే డ్రిల్లింగ్ పద్ధతిలో హైడ్రోజన్‌ను వెలికితీయవచ్చు. అయితే వాణిజ్యపరంగా ఇది ఖరీదైన వ్యవహారం. పరిశోధనలకు మాత్రమే ఈ విధానాన్ని శాస్త్రవేత్తలు వాడుతున్నారు.
3. బ్లూ హైడ్రోజన్
బయోగ్యాస్‌ను బయోమీథేన్‌గా మార్చి హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తారు. ఈ విధానంలో కార్బన్ డై ఆక్సైడ్ అత్యంత కనిష్ట స్థాయిలో వెలువడుతుంది. ఇంటర్నేషనల్ ఎనర్జీ అసోసియేషన్ (ఐఈఏ) అంచనా ప్రకారం.. క్లీన్ ఎనర్జీరంగంలో 2050 నాటికి హైడ్రోజన్ ఉత్పత్తికి ఇదొక్కటే విధానం అనుసరిస్తారు.
4. పింక్ హైడ్రోజన్
ఎలక్ట్రోలసిస్ ద్వారా నీటిని వినియోగించి దీనిని ఉత్పత్తి చేస్తారు. విద్యుత్‌ను న్యూక్లియర్ ఎనర్జీ నుంచి తీసుకుంటారు.
5. యెల్లో హైడ్రోజన్
ఎలక్ట్రోలసిస్ ద్వారా నీటిని వినియోగించి దీనిని ఉత్పత్తి చేస్తారు. సంప్రదాయ విధానంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను దీనికి వాడతారు.
6. బ్లాక్, బ్రౌన్ హైడ్రోజన్
హైడ్రోజన్ ఉత్పత్తికి బొగ్గు వాడితే బ్లాక్, లిగ్నైట్ వాడితే బ్రౌన్ హైడ్రోజన్ అంటారు. ఇది కాలుష్యకారకమైన విధానం.
హైడ్రోజన్ కారు తయారయింది
టయోటా, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటీవ్ టెక్నాలజీ (ఐసీఎటీ) పైలెట్ ప్రాజెక్టు కింద హైడ్రోజన్ ఇంధన వాహనాన్ని తయారు చేశాయి. ‘టయోటా మిరాయ్’ పేరిట రూపొందించిన ఈ కారును కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల విడుదల చేశారు. ఇన్‌టేక్ గ్రిల్ ద్వారా గాలిలోని ఆక్సిజన్ తీసుకొని, ఇంధన ట్యాంకులోని హైడ్రోజన్‌తో సంయోగం చెంది.. ఇంజన్ నడవడానికి కావాల్సిన శక్తిని విడుదల చేస్తుంది. పొగ గొట్టం నుంచి పొగ కాకుండా, నీరే వస్తుంది.
పుణేలో రోడ్డెక్కిన తొలి హైడ్రోజన్ బస్సు
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండ్రస్టియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్), పుణేలోని మల్టీ నేషనల్ సాఫ్ట్‌వేర్ సంస్థ కేపీఐటీ కలిసి హైడ్రోజన్‌తో నడిచే బస్సును తయారు చేసి గత వారం రోడ్డెక్కించాయి. దేశంలో ఇదే తొలి హైడ్రోజన్ బస్సు. సాధారణ డీజిల్ బస్సు ఏడాది పాటు తిరిగితే కనీసం 100 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ విడుదల చేస్తుందని సీఎస్‌ఐఆర్ తెలిపింది. డీజిల్ బస్సులు దేశంలో లక్షల సంఖ్యలో ఉన్నాయని వాటి నుంచి వెలువడే కాలుష్యం అత్యధికమని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment