రాష్ట్రంలో స్వచ్ఛ ఇం‘ధనం’ | AP among the 10 states selected for green hydrogen production | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో స్వచ్ఛ ఇం‘ధనం’

Published Mon, Jul 31 2023 4:04 AM | Last Updated on Mon, Jul 31 2023 4:04 AM

AP among the 10 states selected for green hydrogen production - Sakshi

సాక్షి, అమరావతి: గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తికి అనుకూలమైన రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్‌ ఎంపికైంది. స్వచ్ఛ ఇంధనం ఉత్పత్తికి అవసరమైన అన్ని వనరులు ఉండటం, ఇందుకోసం రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక పాలసీని తేవడంతో కీలకమైన గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టులు రాష్ట్రానికి రానున్నాయి. వీటి ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

రాష్ట్రాభివృద్ధికి మరింతగా చేయూతనిస్తాయి. ప్రకృతి పరిరక్షణకు ప్రపంచ దేశాలు చేసుకున్న ఒప్పందంలో భాగంగా మన దేశంలో స్వచ్ఛ ఇంధన ఉత్పత్తికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నాయి. గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కొత్త పథకాలు, పాలసీలు తెస్తున్నాయి. వాటి ద్వారా ఈ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నాయి.

ఇందులో భాగంగా దేశంలో 4.5 లక్షల టన్నుల గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర పభుత్వం టెండర్లు పిలిచింది. ఈ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఏపీ సహా 10 రాష్ట్రాలు అనుకూలమని  తేలి్చంది. దీంతో త్వరలోనే రాష్ట్రంలో గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. 

‘సైట్‌’తో ప్రోత్సాహకాలు 
ఏటా 125 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనంతో పాటు 5 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి సాధించాలనే లక్ష్యంతో నేషనల్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌ని కేంద్రం తీసుకువచ్చింది. ఇందులో భాగంగా, గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి చేసే పరిశ్రమలకు ఆర్థిక తోడ్పాటునందించడానికి స్ట్రాటజిక్‌ ఇంటర్వెన్షన్‌ ఫర్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ ట్రాన్సిషన్‌ ప్రోగ్రామ్‌ (సైట్‌) పథకాన్ని గత నెలాఖరులో ప్రవేశపెట్టింది.

ఉత్పత్తిదారులకు ఆ ర్థికంగా చేయూతనందించేందుకు రూ.19,744 కోట్లు కేటాయించింది. 2029–30 వరకు ఈ పథకం అమలులో ఉంటుంది. తొలి ఏడాది రూ.4,440 కోట్లు, రెండో ఏడాది రూ.3,700 కోట్లు, మూడో ఏడాది రూ.2,960 కోట్లు, నాలుగో ఏడాది రూ.2,220 కోట్లు, ఐదో ఏడాది రూ.1,480 కోట్లు చొప్పున ఆరి్ధక ప్రోత్సాహాన్ని అందిస్తుంది. 

ఏపీ సొంత పాలసీ 
రాష్ట్రంలో గ్రీన్‌ హైడ్రోజన్, అమ్మోనియా ఉత్పత్తిని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక పాల­­సీని రూపొందించింది. ఈ ఏడాది కేంద్రం పాల­సీని తేవడానికి ఒక రోజు ముందే రాష్ట్ర ప్రభు­త్వం ప్రత్యేక పాలసీని తీసుకొచ్చింది. రాష్ట్రంలో ప్రస్తుతం గ్రీన్‌ హైడ్రోజన్‌ డిమాండ్‌ ఏడాదికి దాదా­పు 0.34 మిలియన్‌ టన్నులు (ఎంటీ) ఉంది.

రాష్ట్ర ప్రభుత్వం రానున్న ఐదేళ్లలో సంవత్సరానికి 0.5 మిలియన్‌ టన్నుల గ్రీన్‌ హైడ్రోజన్, 2 మిలియన్‌ టన్నుల గ్రీన్‌ అమ్మోనియా ఉత్పత్తి సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక మిలియన్‌ టన్ను గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి చేయగలిగితే 12 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేసింది. ఈ పాలసీ ఐదేళ్లపాటు లేదా కొత్త పాలసీ జారీ అయ్యే వరకు అమలులో ఉంటుంది.

రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్‌ని ఉపయోగించడం ద్వారా నీటి నుంచి గ్రీన్‌ హైడ్రోజన్‌ లేదా గ్రీన్‌ అమ్మోనియా ఉత్పత్తి చేయా­లనుకునే డెవలపర్లు ఈ పాలసీ పరిధిలోకి వస్తారు. ఈ పాలసీ అమలుకు న్యూ అండ్‌ రెన్యూవబు­ల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ) నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వ విధానం, ప్రోత్సాహకాలతో రాష్ట్రానికి తప్పకుండా ప్రాజెక్టులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు 
ప్రాజెక్టు ప్రారంభించిన తేదీ నుంచి ఐదేళ్లపాటు గ్రీన్‌ హైడ్రోజన్‌ అమ్మకంపై డెవలపర్లకు స్టేట్‌ జీఎస్టీలో 100 శాతం తిరిగి చెల్లింపు 
గ్రీన్‌ హైడ్రోజన్, గ్రీన్‌ అమ్మోనియా ఉత్పత్తికి ఉపయోగించే పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టుకు వాణిజ్య ఆపరేషన్‌ తేదీ నుంచి ఐదేళ్ల పాటు విద్యుత్‌ సుంకంపై 100 శాతం మినహాయింపు 
♦ ఇంట్రాస్టేట్‌ ట్రాన్స్‌మిషన్‌ ఛార్జీల్లో 25 శాతం రీయింబర్స్‌మెంట్‌ 
♦  క్రాస్‌–సబ్సిడీ సర్‌చార్జి ఐదేళ్లు వెనక్కు 
♦  ప్రాజెక్టుకు భూమిని ప్రభుత్వమే నోడల్‌ ఏజెన్సీ ద్వారా నామ మాత్రపు ధరకు లీజుగా కేటాయింపు 
♦ భూ వినియోగ మార్పిడి ఛార్జీలు, స్టాంప్‌ డ్యూటీ నుంచి మినహాయింపు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement