రెండో స్థానంలో మహారాష్ట్ర, మూడో స్థానంలో ఉత్తరప్రదేశ్
2023–24లో ఏపీలో 1,81,11,600 టన్నుల పండ్ల ఉత్పత్తి
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ తొలి ముందస్తు అంచనాల్లో వెల్లడి
ఉద్యాన పంటలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుండటంతో పండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వివిధ రూపాల్లో సాయం అందిస్తుండటంతో పండ్ల రైతులు ఈ ఘనత సాధించారు.
దేశవ్యాప్తంగా 2023–24 ఆర్థిక సంవత్సరంలో 11,20,77,190 టన్నుల పండ్లు ఉత్పత్తి కాగా.. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా అత్యధికంగా 16.16 శాతంగా ఉంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల వారీగా పండ్ల ఉత్పత్తి, సాగు విస్తీర్ణంపై కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తొలి ముందస్తు అంచనాలను సోమవారం వెల్లడించింది. - సాక్షి, అమరావతి
1.81 కోట్ల టన్నులతో మనమే టాప్
2023–24 ఆర్థిక ఏడాదిలో 1,81,11,600 టన్నుల పండ్ల ఉత్పత్తితో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తరువాత మహారాష్ట్ర 1,42,78,250 టన్నుల పండ్లు ఉత్పత్తితో రెండో స్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్ 1,27,02,060 టన్నుల పండ్ల ఉత్పత్తితో మూడో స్థానంలో నిలిచింది. అరటి ఉత్పత్తిలో ఏపీ మొదటి స్థానంలో ఉండగా.. తమిళనాడు రెండో స్థానంలో, ఉత్తరప్రదేశ్ మూడో స్థానంలో నిలిచాయి.
బత్తాయి ఉత్పత్తిలో ఏపీ మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో మహారాష్ట్ర, మూడో స్థానంలో తెలంగాణ నిలిచాయి. నిమ్మ ఉత్పత్తిలో ఏపీ మొదటి స్థానంలో కొనసాగుతుండగా.. రెండో స్థానంలో గుజరాత్, మూడో స్థానంలో మధ్యప్రదేశ్ నిలిచాయి. మామిడి ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. బొప్పాయి ఉత్పత్తిలో గుజరాత్ మొదటి స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది.
ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం మహారాష్ట్రలో ఎక్కువగా ఉన్నప్పటికీ.. తక్కువ విస్తీర్ణమే ఉన్నా పండ్ల ఉత్పత్తిలో మాత్రం ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన ఉండటం విశేషం. ఆంధ్రఫ్రదేశ్‌లో పండ్లు సాగు విస్తీర్ణం 7,80,310 హెక్టార్లు ఉండగా.. మహారాష్ట్రలో 8,48,370 హెక్టార్లలో పండ్ల సాగు విస్తీర్ణం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment