ఒక్కసారి వస్తే వదలని, చికిత్స అనేది లేని మధుమేహానికి వాయు కాలుష్యమూ ఒక కారణమని అంటున్నారు వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ఊబకాయం, వ్యాయామం లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మధుమేహానికి కారణమని ఇప్పటివరకూ అనుకుంటున్న విషయం తెలిసిందే. గాల్లోని సూక్ష్మ కాలుష్య కణాలు దుమ్ముధూళి శరీరం లోపలికి.. తద్వారా రక్తంలోకి చేరడం వల్ల గుండెజబ్బుల్లాంటి అనేక వ్యాధులు వచ్చే అవకాశముందని ఇప్పటికే అనేక పరిశోధనలు రుజువు చేశాయి.
అయితే ఈ కాలుష్య కణాలు ఇన్సులిన్ ఉత్పత్తిని తగ్గించి, మంట/వాపులకు కారణమవుతున్నట్లు తాజాగా తెలిసింది. 2016లో ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన కొత్త మధుమేహుల్లో కనీసం 14 శాతం మంది అంటే 32 లక్షల మంది వాయుకాలుష్యం కారణంగా ఈ వ్యాధిబారిన పడినట్లు తాము అంచనా వేస్తున్నట్లు ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త జయాద్ అల్ అలీ తెలిపారు.
అమెరికాలోని దాదాపు 17 లక్షల మంది మాజీ సైనికోద్యోగుల ఆరోగ్య సమాచారాన్ని 8.5 ఏళ్లపాటు సేకరించి విశ్లేషించడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చినట్లు ఆయన చెప్పారు. కాలుష్యాన్ని మధుమేహ కారణంగా గుర్తిస్తే.. మరింత కఠినమైన చట్టాలతో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు.
ఉదజని ఉత్పత్తికి చౌక విధానం...
మనం వాడే వంటగ్యాస్ కంటే మెరుగైన ఇంధనమైన ఉదజనిని నీటి నుంచి చౌకగా ఉత్పత్తి చేసేందుకు కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన విధానాన్ని ఆవిష్కరించారు. ఉదజని సామర్థ్యం గురించి చాలాకాలంగా తెలిసినప్పటికీ ఈ వాయువును చౌకగా ఉత్పత్తి చేసే అవకాశం లేకపోవడం, సురక్షిత నిల్వ, రవాణాల్లో ఉండే సమస్యల కారణంగా పెద్దగా వినియోగంలోకి రాలేదు.
ఈ నేపథ్యంలో కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు ఓ హైబ్రిడ్ ఉత్ప్రేరకం సాయంతో నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్‌లుగా సులువుగా విడగొట్టడంలో విజయం సాధించారు. వాడిన రెండు ఉత్ప్రేరకాల్లో ఒకటి ఉత్పత్తి అయిన హైడ్రోజన్‌ను వేరుచేసేందుకు ఉపయోగపడితే రెండోది ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసేందుకు పనికొస్తుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఝిఫెంగ్ రెన్ తెలిపారు.
ఇప్పటివరకూ ఉదజని ఉత్పత్తి కోసం అభివృద్ధి చేసిన టెక్నాలజీలు పరిశోధనశాల స్థాయిలో మాత్రమే బాగా పనిచేసేవని, రెండు ఉత్ప్రేరకాలతో సిద్ధం చేసిన ఈ కొత్త విధానాన్ని వాణిజ్య స్థాయిలో వాడుకోవచ్చునని ఆయన చెప్పారు. హైడ్రోజన్‌ను ఎక్కడికక్కడ చౌకగా తయారు చేసుకోగలిగితే రవాణా చాలా చౌక అయిపోతుంది. అదే సమయంలో కాలుష్యాన్ని కూడా గణనీయంగా తగ్గించవచ్చు.
బ్యాటరీ ఛార్జ్ చేసుకునే విధంబెట్టిదనిన...
స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ సున్నాకు దగ్గరైనప్పుడు హడావుడిగా ఛార్జ్ చేసుకోవడం. ఓ పది శాతం ఛార్జ్ చేసుకోగానే.. ఇకచాల్లే అని తీసేయడం మనలో చాలామంది సాధారణంగా చేసేపని. అయితే దీనివల్ల స్మార్ట్‌ఫోన్ బ్యాటరీపై ఎలాంటి ప్రభావం పడుతుందో అసలు ఆలోచించము. పైగా అప్పుడప్పుడూ కొంత కొంత ఛార్జ్ చేసుకుంటూ ఉంటే బ్యాటరీ ఎక్కువ కాలం మన్నుతుందని అనుకుంటూ ఉండటమూ కద్దు.
ఈ నేపథ్యంలో బ్యాటరీ యూనివర్సిటీ అనే కంపెనీ ఒకటి అసలు స్మార్ట్‌ఫోన్ బ్యాటరీలను ఎలా ఛార్జ్ చేసుకోవాలి? అందుకు గల కారణాలేమిటి అని వివరించింది. దీని ప్రకారం.. పూర్తిగా ఛార్జ్ అయిన తరువాత ఛార్జర్ నుంచి ఫోన్‌ను కచ్చితంగా వేరు చేయాలి. వందశాతం ఛార్జింగ్ తరువాత సమయం గడుస్తున్న కొద్దీ కొంచెం కొంచెం ఛార్జ్ అవుతూండటం వల్ల బ్యాటరీకి నష్టం జరుగుతుంది.
ఆ మాటకొస్తే బ్యాటరీని వందశాతం ఛార్జ్ చేయడమూ సరికాదని తెలిపింది. పదిశాతం ఛార్జ్ తగ్గిపోగానే మళ్లీ ప్లగ్ చేయడం మేలని, దీనివల్ల బ్యాటరీ ఎక్కువ కాలం మన్నడమే కాకుండా.. ఛార్జ్ అయిపోతోందన్న బెంగ కూడా ఉండదని వివరించింది. వీలైనంత వరకూ బ్యాటరీలను వేడి ప్రదేశాల్లో ఉంచకపోవడం మేలని సూచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment