Battery charge
-
టెస్లాకు చెక్‌పెట్టనున్న ఫోర్డ్..! అదే జరిగితే..?
ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఎలక్ట్రిక్ వాహనాల్లో రారాజుగా పేరొందిన టెస్లాను ఢీ కొట్టేందుకు పలు ఆటోమొబైల్ కంపెనీలు సిద్దమయ్యాయి. ఛార్జింగే సమస్య..! ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో ఛార్జింగ్ సమయం ఒక్కటే ఆయా ఆటోమొబైల్ కంపెనీలకు పెను సవాలుగా మారాయి. ఇప్పటికే టెస్లా రూపొందించిన సూపర్ ఛార్జర్స్‌తో కొంత ఉపశమనం కల్గింది. టెస్లా ఆవిష్కరించిన సూపర్ ఛార్జర్స్‌కు పోటీగా మెరుపు వేగంతో చార్జ్ అయ్యే సూపర్ ఛార్జర్స్‌ను తీసుకురావడానికి పలు కంపెనీలు తలమునకలైనాయి. ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ పూర్తిగా ఫుల్ అయ్యేందుకు పట్టే సమయాన్ని తగ్గించడం కోసం పలు ఆటోమొబైల్ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ ఎలక్ట్రిక్ వాహనాలకు వాడే సూపర్ ఛార్జర్స్ విషయంలో టెస్లాకు చెక్ పెడుతూ సరికొత్త ఛార్జర్‌ను ఆవిష్కరించింది. చదవండి: లైంగిక వేధింపులు, ఎలన్ మస్క్‌కు మరో ఎదురుదెబ్బ టెస్లాకు సూపర్ ఛార్జర్స్‌కు చెక్..! టెస్లా తన కంపెనీ కార్ల కోసం సూపర్ ఛార్జర్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఛార్జర్ సహాయంలో ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలను కేవలం 20 నిమిషాల్లో ఫుల్ చార్జ్ చేయవచ్చునని టెస్లా పేర్కొంటుంది. ప్రస్తుతం ఫోర్డ్ తయారుచేసిన కొత్త కేబుల్ ఛార్జర్ డిజైన్ సహాయంతో టెస్లా సూపర్ ఛార్జర్స్ కంటే 4.6 రెట్లు వేగంగా ఛార్జ్ చేయవచ్చునని తెలుస్తోంది. అంటే కేవలం 5 నిమిషాల్లోనే ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలను ఫుల్ చార్జ్ చేయవచ్చును. ఈ సూపర్ కేబుల్ ఛార్జర్‌ను ఫోర్డ్, పర్డ్యూ యూనివర్శిటీ సంయుక్తంగా రూపొందించినట్లు తెలుస్తోంది. ఫాస్ట్ ఛార్జింగ్ సమయంలో వీపరితమైన వేడి...! టెస్లా సూపర్ ఛార్జర్స్‌తో బ్యాటరీలను ఛార్జ్ చేస్తున్నప్పుడు ఆయా కేబుల్స్ వీపరితంగా వేడెక్కె అవకాశం ఉంది. దీంతో ఆయా కేబుల్స్ త్వరగా పాడైపోయే అవకాశం లేకపోలేదు. దీనిని ఛాలెంజ్‌గా తీసుకున్న పర్డ్యూ యూనివర్సిటీ, ఫోర్డ్ సరికొత్త సూపర్ ఛార్జర్ కేబుల్ డిజైన్‌ను ఆవిష్కరించాయి. చదవండి: ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ఓలా..! -
వాయుకాలుష్యంతోనూ మధుమేహం?
ఒక్కసారి వస్తే వదలని, చికిత్స అనేది లేని మధుమేహానికి వాయు కాలుష్యమూ ఒక కారణమని అంటున్నారు వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ఊబకాయం, వ్యాయామం లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మధుమేహానికి కారణమని ఇప్పటివరకూ అనుకుంటున్న విషయం తెలిసిందే. గాల్లోని సూక్ష్మ కాలుష్య కణాలు దుమ్ముధూళి శరీరం లోపలికి.. తద్వారా రక్తంలోకి చేరడం వల్ల గుండెజబ్బుల్లాంటి అనేక వ్యాధులు వచ్చే అవకాశముందని ఇప్పటికే అనేక పరిశోధనలు రుజువు చేశాయి. అయితే ఈ కాలుష్య కణాలు ఇన్సులిన్ ఉత్పత్తిని తగ్గించి, మంట/వాపులకు కారణమవుతున్నట్లు తాజాగా తెలిసింది. 2016లో ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన కొత్త మధుమేహుల్లో కనీసం 14 శాతం మంది అంటే 32 లక్షల మంది వాయుకాలుష్యం కారణంగా ఈ వ్యాధిబారిన పడినట్లు తాము అంచనా వేస్తున్నట్లు ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త జయాద్ అల్ అలీ తెలిపారు. అమెరికాలోని దాదాపు 17 లక్షల మంది మాజీ సైనికోద్యోగుల ఆరోగ్య సమాచారాన్ని 8.5 ఏళ్లపాటు సేకరించి విశ్లేషించడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చినట్లు ఆయన చెప్పారు. కాలుష్యాన్ని మధుమేహ కారణంగా గుర్తిస్తే.. మరింత కఠినమైన చట్టాలతో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ఉదజని ఉత్పత్తికి చౌక విధానం... మనం వాడే వంటగ్యాస్ కంటే మెరుగైన ఇంధనమైన ఉదజనిని నీటి నుంచి చౌకగా ఉత్పత్తి చేసేందుకు కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన విధానాన్ని ఆవిష్కరించారు. ఉదజని సామర్థ్యం గురించి చాలాకాలంగా తెలిసినప్పటికీ ఈ వాయువును చౌకగా ఉత్పత్తి చేసే అవకాశం లేకపోవడం, సురక్షిత నిల్వ, రవాణాల్లో ఉండే సమస్యల కారణంగా పెద్దగా వినియోగంలోకి రాలేదు. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు ఓ హైబ్రిడ్ ఉత్ప్రేరకం సాయంతో నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్లుగా సులువుగా విడగొట్టడంలో విజయం సాధించారు. వాడిన రెండు ఉత్ప్రేరకాల్లో ఒకటి ఉత్పత్తి అయిన హైడ్రోజన్‌ను వేరుచేసేందుకు ఉపయోగపడితే రెండోది ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసేందుకు పనికొస్తుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఝిఫెంగ్ రెన్ తెలిపారు. ఇప్పటివరకూ ఉదజని ఉత్పత్తి కోసం అభివృద్ధి చేసిన టెక్నాలజీలు పరిశోధనశాల స్థాయిలో మాత్రమే బాగా పనిచేసేవని, రెండు ఉత్ప్రేరకాలతో సిద్ధం చేసిన ఈ కొత్త విధానాన్ని వాణిజ్య స్థాయిలో వాడుకోవచ్చునని ఆయన చెప్పారు. హైడ్రోజన్‌ను ఎక్కడికక్కడ చౌకగా తయారు చేసుకోగలిగితే రవాణా చాలా చౌక అయిపోతుంది. అదే సమయంలో కాలుష్యాన్ని కూడా గణనీయంగా తగ్గించవచ్చు. బ్యాటరీ ఛార్జ్ చేసుకునే విధంబెట్టిదనిన... స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ సున్నాకు దగ్గరైనప్పుడు హడావుడిగా ఛార్జ్ చేసుకోవడం. ఓ పది శాతం ఛార్జ్ చేసుకోగానే.. ఇకచాల్లే అని తీసేయడం మనలో చాలామంది సాధారణంగా చేసేపని. అయితే దీనివల్ల స్మార్ట్‌ఫోన్ బ్యాటరీపై ఎలాంటి ప్రభావం పడుతుందో అసలు ఆలోచించము. పైగా అప్పుడప్పుడూ కొంత కొంత ఛార్జ్ చేసుకుంటూ ఉంటే బ్యాటరీ ఎక్కువ కాలం మన్నుతుందని అనుకుంటూ ఉండటమూ కద్దు. ఈ నేపథ్యంలో బ్యాటరీ యూనివర్సిటీ అనే కంపెనీ ఒకటి అసలు స్మార్ట్‌ఫోన్ బ్యాటరీలను ఎలా ఛార్జ్ చేసుకోవాలి? అందుకు గల కారణాలేమిటి అని వివరించింది. దీని ప్రకారం.. పూర్తిగా ఛార్జ్ అయిన తరువాత ఛార్జర్ నుంచి ఫోన్‌ను కచ్చితంగా వేరు చేయాలి. వందశాతం ఛార్జింగ్ తరువాత సమయం గడుస్తున్న కొద్దీ కొంచెం కొంచెం ఛార్జ్ అవుతూండటం వల్ల బ్యాటరీకి నష్టం జరుగుతుంది. ఆ మాటకొస్తే బ్యాటరీని వందశాతం ఛార్జ్ చేయడమూ సరికాదని తెలిపింది. పదిశాతం ఛార్జ్ తగ్గిపోగానే మళ్లీ ప్లగ్ చేయడం మేలని, దీనివల్ల బ్యాటరీ ఎక్కువ కాలం మన్నడమే కాకుండా.. ఛార్జ్ అయిపోతోందన్న బెంగ కూడా ఉండదని వివరించింది. వీలైనంత వరకూ బ్యాటరీలను వేడి ప్రదేశాల్లో ఉంచకపోవడం మేలని సూచిస్తోంది. -
ప్రోటాన్ బ్యాటరీలు వస్తున్నాయి...
అతితక్కువ స్థలంలో ఎక్కువ విద్యుత్తును నిల్వ చేసుకోగల బ్యాటరీలు అందుబాటులోకి వస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న లిథియం అయాన్ బ్యాటరీల సామర్థ్యం తక్కువైనా, ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల వీటినే వాడుతున్నారు. అయితే ఇకపై ఈ పరిస్థితి మారిపోనుంది. ఆస్ట్రేలియాలోని ఆర్ఎంఐటీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ప్రోటాన్లతో పనిచేసే సరికొత్త బ్యాటరీని అభివృద్ధి చేయడం దీనికి కారణం. సోలార్ ప్యానెల్స్ ఉత్పత్తి చేసే విద్యుత్తును అక్కడికక్కడే సమర్థంగా నిల్వ చేసుకుని వాడుకోవడంతోపాటు విద్యుత్తు వాహనాలు మరింత ఎక్కువ దూరం ప్రయాణించేందుకూ ఈ కొత్త బ్యాటరీలు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అన్నిటికీ మించి ప్రోటాన్ బ్యాటరీలు చాలా చౌకగా తయారుచేయవచ్చు. పర్యావరణానికి జరిగే నష్టం కూడా చాలా తక్కువ. బ్యాటరీలోకి విద్యుత్తు ప్రవహించినప్పుడు నీరు కాస్తా హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విడిపోతుంది. కొన్ని ప్రోటాన్లూ విడుదలవుతాయి. ఇవి కాస్తా కార్బన్‌తో తయారైన ఎలక్ట్రోడ్‌కు అతుక్కుంటాయి. అవసరమైనప్పుడు ఇవే ప్రోటాన్లు విడిపోయి గాల్లోంచి ఆక్సిజన్‌ను తీసుకుని నీటిని తీసుకోవడం ద్వారా మళ్లీ ఎలక్ట్రాన్లను ( విద్యుత్తు) విడుదల చేస్తాయి. ప్రస్తుతం తాము తయారు చేసిన నమూనా ప్రోటాన్ బ్యాటరీ లిథియం అయాన్ బ్యాటరీ స్థాయిలో విద్యుత్తును నిల్వ చేసుకోగలదని.. కొన్ని మార్పులు, చేర్పులతో సామర్థ్యాన్ని పెంచవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ప్రొఫెసర్ జాన్ ఆండ్రూస్ తెలిపారు. -
కరెంటు బ్యాటరీ కాదు... వేడి కోసం బ్యాటరీ!
బ్యాటరీల్లో కరెంటు నిల్వ ఉంటుందని అవసరమైనప్పుడు అవసరమైనంత మేరకు ఈ కరెంటును వాడుకోవచ్చునని మనకు తెలుసు. చేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్ మొదలుకొని బోలెడన్ని ఉదాహరణలు ఉన్నాయి దీనికి. ఇప్పుడిదంతా ఎందుకు అంటే యూనివర్శిటీ ఆఫ్ మాసాచూసెట్స్ శాస్త్రవేత్తలు ఇంకో వినూత్నమైన బ్యాటరీని సిద్ధం చేశారు కాబట్టి! ఇది కరెంటుకు బదులుగా ఉష్ణాన్ని నిల్వ చేసుకుంటుంది. అయితే ఏంటి దీంతో ప్రయోజనమని ఆశ్చర్యపోతున్నారా? బోలెడున్నాయి. సూర్యుడి నుంచి వెలువడే వేడిని ఈ బ్యాటరీలో బంధించి రాత్రిళ్లు వంటకు వాడుకోవచ్చు. లేదంటే కార్ల నుంచి వచ్చే వేడిని విద్యుత్తుగానూ మార్చుకొవచ్చు. అజోబెంజీన్ ఆధారిత పాలీ మెథాక్రలైట్ అనే కొత్త పదార్థంతో ఈ బ్యాటరీ తయారవుతుంది. వేడి సోకితే చాలు ఇందులోని అణువులు తమ స్థితిని మార్చేసుకుని శక్తిని మొత్తం తమలోనే దాచుకుంటాయి. చల్లబరిస్తే వేడి మొత్తం బయటకు వస్తుంది. ఈ కొత్త బ్యాటరీలను భారత్ లాంటి దేశాల్లో పొగరాని పొయ్యిల మాదిరిగా కూడా వాడుకోవచ్చునని తద్వారా ఎందరో మహిళల ఆరోగ్యాన్ని కాపాడవచ్చునని అంటున్నారు ఈ పదార్థాన్ని అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషించిన భారతీయ సంతతి శాస్త్రవేత్త్త వెంకట్రామన్ దండపాణి. -
ఈ బ్యాటరీ స్పెషల్ గురూ..
రోజూ వేసుకునే దుస్తులతోనే మన ఫోన్లు, ఇతర సూక్ష్మ ఎలక్ట్రానిక్ పరికరాలను చార్జ్ చేసుకోగలిగితే ఎలా ఉంటుంది. అబ్బో! సూపర్! అంటున్నారా? నిజంగానే ఆ రోజులు దగ్గరపడ్డాయి. బర్మింగ్ హామ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త సోకేయిన్ ఛోయి అచ్చం ఇలాంటి వస్త్రాలనే అభివృద్ధి చేశారు. ఫొటోలో కనిపిస్తున్న ఈ వస్త్రంపై నల్లటి డిజైన్ లాంటివి కనిపిస్తున్నాయి కదా... అవన్నీ ప్రత్యేకమైన మైక్రోబియల్ ఫ్యుయల్‌సెల్స్. మరోలా చెప్పాలంటే బ్యాటరీలు. శరీరంపై ఉండే బ్యాక్టీరియా సూడోమోనాస్ ఎరుగినోసాను వాడుకుంటూ ఈ బ్యాటరీ విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. మైక్రోబియల్ ఫ్యుయల్సెల్లను సులభంగా తయారు చేయడంతోపాటు వాటితోనే నూలు పోగుల్లాంటివి సృష్టించడం ద్వారా ఛోయి విద్యుత్తు ఉత్పత్తి చేసే వస్త్రాలను తయారు చేయగలిగారు. ఒక చదరపు సెంటీమీటర్ విస్తీర్ణం ఉన్న ఫ్యుయల్ సెల్‌తో గరిష్టంగా 6.4 వాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చునని ఛోయి అంటున్నారు. ఈ బ్యాటరీలతో కూడిన దుస్తులు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. ఛోయి గతంలో కాగితాలపై ఇలాంటి బ్యాటరీలను తయారుచేశారు. అంతేకాకుండా మడిచేసే కాగితం, పలుచటి అగ్గిపెట్టె, నక్షత్రాల ఆకారాల్లో కూడా ఈ ఫ్యుయల్సెల్స్ను తయారు చేసినా... వస్త్రంలోకి అమరిపోయేలా చేయడం మాత్రం ఇదే తొలిసారి. -
ఆరు నిమిషాల్లో బ్యాటరీ ఫుల్
లండన్: మీరు అర్జెంట్‌గా ఫోన్ మాట్లాడుతున్నారు. అదే సమయంలో బ్యాటరీ చార్జ్ అయిపోయి ఫోన్ ఆఫ్ అయిపోతే ఎలా అనిపిస్తుంది? చేతిలో ఉన్న ఫోన్‌ను తీసి విసిరి కొట్టాలనిపిస్తోంది కదా! అయితే మీలాంటి వారి కోసమే కేవలం ఆరే ఆరు నిమిషాల్లో ఫుల్ చార్జ్ అయ్యే బ్యాటరీ ఉందండి. అల్యూమినియంతో నిండిన క్యాప్సుల్స్ మీ సెల్‌ఫోన్‌ను ఆరు నిమిషాల్లో చార్జ్ చేస్తుంది. ప్రస్తుతమున్న లిథియం అయాన్ బ్యాటరీ కంటే దీనికి 4 రెట్లు సామర్థ్యం అధికంగా ఉండడమే కాదు, చార్జింగ్ తర్వాత ఎక్కువ సమయం వాడుకునే వీలుంటుంది. లిథియం బ్యాటరీలో అల్యూమినియం వాడకం విషయంలో తలెత్తిన సమస్యలను అధిగమిస్తూ బీజింగ్‌లోని మాసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సింగ్వా యూనివర్సిటీ పరిశోధకులు దీన్ని రూపొందించారు. ఇందులో అల్యూమినియం చుట్టూ టైటానియం డై ఆక్సైడ్ కవచం ఉంటుంది. ఈ కవచం బ్యాటరీ రుణాత్మక ఎలక్ట్రోడ్‌గా పనిచేస్తుంది.