
బ్యాటరీల్లో కరెంటు నిల్వ ఉంటుందని అవసరమైనప్పుడు అవసరమైనంత మేరకు ఈ కరెంటును వాడుకోవచ్చునని మనకు తెలుసు. చేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్ మొదలుకొని బోలెడన్ని ఉదాహరణలు ఉన్నాయి దీనికి. ఇప్పుడిదంతా ఎందుకు అంటే యూనివర్శిటీ ఆఫ్ మాసాచూసెట్స్ శాస్త్రవేత్తలు ఇంకో వినూత్నమైన బ్యాటరీని సిద్ధం చేశారు కాబట్టి! ఇది కరెంటుకు బదులుగా ఉష్ణాన్ని నిల్వ చేసుకుంటుంది. అయితే ఏంటి దీంతో ప్రయోజనమని ఆశ్చర్యపోతున్నారా? బోలెడున్నాయి. సూర్యుడి నుంచి వెలువడే వేడిని ఈ బ్యాటరీలో బంధించి రాత్రిళ్లు వంటకు వాడుకోవచ్చు. లేదంటే కార్ల నుంచి వచ్చే వేడిని విద్యుత్తుగానూ మార్చుకొవచ్చు.
అజోబెంజీన్ ఆధారిత పాలీ మెథాక్రలైట్ అనే కొత్త పదార్థంతో ఈ బ్యాటరీ తయారవుతుంది. వేడి సోకితే చాలు ఇందులోని అణువులు తమ స్థితిని మార్చేసుకుని శక్తిని మొత్తం తమలోనే దాచుకుంటాయి. చల్లబరిస్తే వేడి మొత్తం బయటకు వస్తుంది. ఈ కొత్త బ్యాటరీలను భారత్ లాంటి దేశాల్లో పొగరాని పొయ్యిల మాదిరిగా కూడా వాడుకోవచ్చునని తద్వారా ఎందరో మహిళల ఆరోగ్యాన్ని కాపాడవచ్చునని అంటున్నారు ఈ పదార్థాన్ని అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషించిన భారతీయ సంతతి శాస్త్రవేత్త్త వెంకట్రామన్ దండపాణి.
Comments
Please login to add a commentAdd a comment