అతితక్కువ స్థలంలో ఎక్కువ విద్యుత్తును నిల్వ చేసుకోగల బ్యాటరీలు అందుబాటులోకి వస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న లిథియం అయాన్ బ్యాటరీల సామర్థ్యం తక్కువైనా, ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల వీటినే వాడుతున్నారు. అయితే ఇకపై ఈ పరిస్థితి మారిపోనుంది. ఆస్ట్రేలియాలోని ఆర్‌ఎంఐటీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ప్రోటాన్లతో పనిచేసే సరికొత్త బ్యాటరీని అభివృద్ధి చేయడం దీనికి కారణం. సోలార్ ప్యానెల్స్ ఉత్పత్తి చేసే విద్యుత్తును అక్కడికక్కడే సమర్థంగా నిల్వ చేసుకుని వాడుకోవడంతోపాటు విద్యుత్తు వాహనాలు మరింత ఎక్కువ దూరం ప్రయాణించేందుకూ ఈ కొత్త బ్యాటరీలు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అన్నిటికీ మించి ప్రోటాన్ బ్యాటరీలు చాలా చౌకగా తయారుచేయవచ్చు.
పర్యావరణానికి జరిగే నష్టం కూడా చాలా తక్కువ. బ్యాటరీలోకి విద్యుత్తు ప్రవహించినప్పుడు నీరు కాస్తా హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విడిపోతుంది. కొన్ని ప్రోటాన్లూ విడుదలవుతాయి. ఇవి కాస్తా కార్బన్‌తో తయారైన ఎలక్ట్రోడ్‌కు అతుక్కుంటాయి. అవసరమైనప్పుడు ఇవే ప్రోటాన్లు విడిపోయి గాల్లోంచి ఆక్సిజన్‌ను తీసుకుని నీటిని తీసుకోవడం ద్వారా మళ్లీ ఎలక్ట్రాన్లను ( విద్యుత్తు) విడుదల చేస్తాయి. ప్రస్తుతం తాము తయారు చేసిన నమూనా ప్రోటాన్ బ్యాటరీ లిథియం అయాన్ బ్యాటరీ స్థాయిలో విద్యుత్తును నిల్వ చేసుకోగలదని.. కొన్ని మార్పులు, చేర్పులతో సామర్థ్యాన్ని పెంచవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ప్రొఫెసర్ జాన్ ఆండ్రూస్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment