మూగవైన ఏమిలే.....
రైలంటే కూ ఛుక్ ఛుక్ అనాలి. ధడబడమని సౌండ్లు చేయాలి. ట్రాక్ పక్కన నిలుచున్నవారి చెవులు చిల్లులు పడేలా మోత చేయాలి. కాని ఈ రైలు కుయ్ అనదు. కయ్ అనదు. నిశ్శబ్దంగా వస్తుంది. నిశ్శబ్దంగా పోతుంది. బ్యాటరీ కారులా ఏ శబ్దమూ చేయని ఈ హైడ్రోజన్ రైలు ప్రస్తుతం జర్మనీలో పట్టాలెక్కింది.
జర్మనీలో ఈ రైలును అందరూ కుతూహలంగా చూస్తున్నారు. ఎందుకంటే ఇది రేపటి తరం రైలు. ఫ్రెంచ్ కంపెనీ అల్‌స్టామ్ ఆవిష్కరించింది. పేరు ‘కొరాడియా ఐలింట్’. మామూలుగా రైలు వస్తూంటే కిలోమీటరు దూరంలోనే దాని చప్పుడు మనం వింటాం. ఇంజిన్ భుగభుగలు చూస్తాం కదా. కొరాడియా వస్తూంటే మాత్రం ఈ రెండూ అస్సలు ఉండవు. నిశ్శబ్దంగా దూసుకెళుతుంది. అక్కడక్కడ వేడి నీటిని మాత్రం వెదజల్లుతుంది! ఎలాగంటారా? ఇందులో డీజిల్‌కు బదులుగా హైడ్రోజన్‌ను వాడతారు మరి.
ప్రపంచంలో అత్యంత సమర్థవంతమైన ఇంధనంగా హైడ్రోజన్‌కు పేరుంది. కొరాడియా రైల్లో ఓ ఫ్యుయెల్‌సెల్ ఉంటుంది. ట్యాంకుల్లో ఉన్న హైడ్రోజన్‌ను వాతావరణం నుంచి సేకరించిన ఆక్సిజన్‌లను జోడించి విద్యుత్తు ఉత్పత్తి చేస్తుంది. రైలు బోగీల అడుగు భాగాల్లో అక్కడక్కడా ఏర్పాటు చేసిన లిథియం ఐయాన్ బ్యాటరీల్లో ఈ విద్యుత్తు స్టోర్ అవుతుంది. ఇంజిన్‌ను ముందుకు నడిపిస్తుంది. అంతేకాదు. సాధారణ రైళ్ల మాదిరిగా దీంట్లో బ్రేకులు వేసినప్పుడల్లా శక్తి వృథా కాదు.
అందులో ఎక్కువ శాతం తిరిగి బ్యాటరీల్లోకి విద్యుత్తుగా చేరిపోతుంది. కొరాడియా ఐలింట్ రైలు చాంతాడంత కూడా ఉండదు. కేవలం రెండు మూడు బోగీలు మాత్రమే ఉంటాయి. మొత్తమ్మీద 300 మంది ప్యాసింజర్లను మోసుకెళుతుంది. ట్యాంకు నిండా హైడ్రోజన్ ఉంటే కొరాడియా రైల్లో గంటకు 140 కిలోమీటర్ల వేగంతో 600 నుంచి 800 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఇటీవల మన దేశంలో నడిపిన స్పెయిన్ దేశపు టాల్గో రైలు మాదిరిగా అన్నమాట. ధరవరల గురించి ప్రస్తుతానికి తెలియకపోయినా మరో రెండేళ్లలో ఇది అందరికీ అందుబాటులోకి వస్తుందని అంచనా.