ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు రకరకాల రోబోలను రకరకాల పనుల కోసం రూపొందించారు. అవన్నీ మనుషుల ఆదేశాలకు అనుగుణంగా యాంత్రికంగా పనిచేసుకుపోయేవే తప్ప వాటికంటూ ప్రత్యేకంగా భావోద్వేగాలేవీ ఉండవు. అవి ఉత్త మరమనుషులు, అంతే! అయితే, చైనా శాస్త్రవేత్తలు ఇటీవల ప్రపంచంలోనే తొలిసారిగా మనసున్న మరమనిషిని రూపొందించారు. ఈ రోబో పేరు ‘పెప్పర్’. మనుషుల మాది1రిగానే ఈ రోబో కూడా ప్రేమ, సంతోషం, బాధ, కోపం వంటి భావోద్వేగాలను వ్యక్తం చేయగలదు.
ఎదుటనున్న మనుషుల భావోద్వేగాలను గ్రహించి, అందుకు అనుగుణంగా నడుచుకోగలదు. షాంఘైలోని ఫుడాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ రోబోను రూపొందించారు. పూర్తిగా మనిషంత పరిమాణంలో 5.4 అడుగుల ఎత్తు, 62 కిలోల బరువుతో వారు తయారు చేసిన ఈ రోబో తన భావోద్వేగాలను ముఖంలో పలికించగలదు. షాంఘైలో జూలై 4 నుంచి 6 వరకు జరిగిన ‘వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్–2024’లో ఈ రోబో పనితీరును ప్రదర్శించారు. పెద్దలను స్నేహపూర్వకంగా పలకరించడం, చిన్నపిల్లలను ప్రేమగా దగ్గరకు తీసుకోవడం వంటి చేష్టలతో ఈ మనసున్న మరమనిషి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇళ్లల్లో ఒంటరిగా ఉండే వృద్ధుల బాగోగులను చూసుకునేలా, వారి ఆరోగ్య అవసరాలను కనిపెట్టుకుని, వేళకు మందులు అందించడం వంటి సేవలు చేసేలా దీనిని రూపొందించారు.
తొలి హైడ్రోజన్ ఫ్లైయింగ్ ట్యాక్సీ..
హైడ్రోజన్ ఇంధనంగా ఉపయోగించుకుని ప్రయాణించే తొలి ఫ్లైయింగ్ ట్యాక్సీ ఇది. విమానాలను తయారు చేసే అమెరికన్ కంపెనీ ‘జోబీ ఏవియేషన్స్’ ఇటీవల దీనికి రూపకల్పన చేసింది. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఎగిరే కార్లను రూపొందించాయి. ‘జోబీ ఏవియేషన్స్’ ఆరు ప్రొపెల్లర్లతో రూపొందించిన ఈ ఫ్లైయింగ్ ట్యాక్సీ ఎటువంటి ఉపరితలం పైనుంచి అయినా, ఉన్న చోటు నుంచి నిట్టనిలువుగా పైకి ఎగరగలదు. ఇటీవల కాలిఫోర్నియాలో పరీక్షాత్మకంగా దీని ప్రయాణాన్ని నిర్వహించినప్పుడు, హైడ్రోజన్ ఇంధనంతో ఇది ఏకధాటిగా 902 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, ఇదివరకటి ఫ్లైయింగ్ కార్ల రికార్డులను బద్దలు కొట్టింది.
దీని గరిష్ఠ వేగం గంటకు 322 కిలోమీటర్లు. ఈ ఫ్లైయింగ్ ట్యాక్సీ రూపకల్పన కోసం అమెరికన్ సైన్యం కొంతవరకు నిధులు సమకూర్చినట్లు ‘జోబీ ఏవియేషన్స్’ వ్యవస్థాపకుడు, సీఈవో జోబెన్ బెవిర్ట్ వెల్లడించారు. రద్దీగా ఉండే పట్టణ ప్రాంతాల్లో ప్రయాణికులను ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకుపోయేందుకు ఇది బాగా ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. పట్టణ ప్రాంతాల్లోని స్థానిక అవసరాలకు మాత్రమే కాకుండా, దేశాల మధ్య కూడా ఇది ప్రయాణించగలదని, దాదాపు 900 కిలోమీటర్ల వరకు దీనికి ఇంధనం నింపాల్సిన అసరం ఉండదని బెవిర్ట్ చెప్పారు. ప్రస్తుతం ఈ ఫ్లైయింగ్ ట్యాక్సీ ఉత్పత్తిని 2050 నాటికి వాణిజ్యపరంగా ప్రారంభించనున్నామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment