మొలకెత్తిన గింజలు తినడం పాత అలవాటే అయినా, వాటికి లేలేత ఆకులు పుట్టుకొచ్చేంత వరకు పెంచి, వాటిని ‘మైక్రోగ్రీన్స్’ పేరిట తినే అలవాటు ఇటీవలి కాలంలో పెరుగుతోంది. మట్టి కుండీల్లో గింజలు చల్లి ‘మైక్రో గ్రీన్స్’ పెంచుతుంటారు. ఇలా పెంచడం వల్ల కొన్ని గింజలు కుళ్లిపోయి, వృథా కావడం జరుగుతూ ఉంటుంది. ఈ ‘ఆటోస్ప్రౌట్’ పరికరం గింజలను ఏమాత్రం వృథా పోనివ్వకుండా, తక్కువ వ్యవధిలోనే ‘మైక్రోగ్రీన్’ మొలకలు ఎదిగేలా చేస్తుంది.
దీనిని ఉపయోగించుకోవడం చాలా తేలిక. దీనిలో అరకిలో గింజలను వేస్తే, రెండు నుంచి ఆరు రోజుల్లోగా ఆకుపచ్చని మొలకలు పెరుగుతాయి. స్టెయిన్‌లెస్ స్టీల్, టెంపర్డ్ గ్లాస్, కొద్ది కలప తప్ప ప్లాస్టిక్ లేకుండా తయారు చేసిన ఈ పరికరం అధునాతన మిస్టింగ్ టెక్నాలజీతో త్వరగా ఆరోగ్యకరమైన మొలకలు ఎదిగేందుకు దోహదపడుతుంది. ఇందులో మూడు అంతస్తుల ట్రేలలో గింజలను చల్లుకుని పెట్టుకోవచ్చు. దీనిని ఆన్ చేసుకుంటే, దీని లోపల ఎల్‌ఈడీ బల్బుల నుంచి వెలువడే కాంతి, మిస్టింగ్ టెక్నాలజీ సౌకర్యంతో వెలువడే తేమ వల్ల మొలకలు త్వరగా పెరుగుతాయి. ‘ఆటోస్ప్రౌట్’ స్వీడిష్ కంపెనీ ఈ ఆటోమేటిక్ స్ప్రౌటింగ్ మెషిన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర 5,192 స్వీడిష్ క్రోనాలు (రూ.41,369)
దుస్తులను త్వరగా ఆరబెడుతుంది..
దుస్తులను ఉతుక్కోవడం ఒక ఎత్తు అయితే, వాటిని ఆరబెట్టుకోవడం మరో ఎత్తు. ఎండ కాసే సమయంలో ఆరుబయట దండేలకు ఆరవేస్తే దుస్తులు ఏదోలా ఆరిపోతాయి. మబ్బు పట్టినప్పుడు, ఎడతెగని ముసురు కురిసేటప్పుడు దుస్తులను ఆరబెట్టుకోవడం ఎవరికైనా సవాలే! ఇంటి లోపల దండేలు కట్టుకుని, దుస్తులను ఆరబెట్టుకుందామనుకుంటే, అవి ఒక పట్టాన ఆరవు. గంటలు గడిచే కొద్ది ముక్క వాసన కూడా వేస్తాయి.
అలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు డచ్ కంపెనీ ‘స్పీడ్‌డ్రైయర్’ తాజాగా ఈ రోటరీ క్లాత్స్ ర్యాక్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీనిని ఆరుబయటనే కాదు, ఇంటి లోపల కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది విద్యుత్తుతో పనిచేస్తుంది. దీనికి దుస్తులను తగిలించి, ఆరబెడితే, ఇది వేగంగా తిరుగుతూ దుస్తులు త్వరగా ఆరిపోయేలా చేస్తుంది. ఒకసారి దుస్తులను ఆరబెట్టడానికి ఇది వినియోగించుకునే విద్యుత్తు కేవలం 10 వాట్లు మాత్రమే! దీని ధర 219 యూరోలు (రూ.20,519) మాత్రమే!
Comments
Please login to add a commentAdd a comment