Flying Taxi
-
మరమనిషి, తొలి హైడ్రోజన్ ఫ్లైయింగ్ ట్యాక్సీ గురించి మీరెప్పుడైనా విన్నారా?
ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు రకరకాల రోబోలను రకరకాల పనుల కోసం రూపొందించారు. అవన్నీ మనుషుల ఆదేశాలకు అనుగుణంగా యాంత్రికంగా పనిచేసుకుపోయేవే తప్ప వాటికంటూ ప్రత్యేకంగా భావోద్వేగాలేవీ ఉండవు. అవి ఉత్త మరమనుషులు, అంతే! అయితే, చైనా శాస్త్రవేత్తలు ఇటీవల ప్రపంచంలోనే తొలిసారిగా మనసున్న మరమనిషిని రూపొందించారు. ఈ రోబో పేరు ‘పెప్పర్’. మనుషుల మాది1రిగానే ఈ రోబో కూడా ప్రేమ, సంతోషం, బాధ, కోపం వంటి భావోద్వేగాలను వ్యక్తం చేయగలదు.ఎదుటనున్న మనుషుల భావోద్వేగాలను గ్రహించి, అందుకు అనుగుణంగా నడుచుకోగలదు. షాంఘైలోని ఫుడాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ రోబోను రూపొందించారు. పూర్తిగా మనిషంత పరిమాణంలో 5.4 అడుగుల ఎత్తు, 62 కిలోల బరువుతో వారు తయారు చేసిన ఈ రోబో తన భావోద్వేగాలను ముఖంలో పలికించగలదు. షాంఘైలో జూలై 4 నుంచి 6 వరకు జరిగిన ‘వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్–2024’లో ఈ రోబో పనితీరును ప్రదర్శించారు. పెద్దలను స్నేహపూర్వకంగా పలకరించడం, చిన్నపిల్లలను ప్రేమగా దగ్గరకు తీసుకోవడం వంటి చేష్టలతో ఈ మనసున్న మరమనిషి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇళ్లల్లో ఒంటరిగా ఉండే వృద్ధుల బాగోగులను చూసుకునేలా, వారి ఆరోగ్య అవసరాలను కనిపెట్టుకుని, వేళకు మందులు అందించడం వంటి సేవలు చేసేలా దీనిని రూపొందించారు.తొలి హైడ్రోజన్ ఫ్లైయింగ్ ట్యాక్సీ..హైడ్రోజన్ ఇంధనంగా ఉపయోగించుకుని ప్రయాణించే తొలి ఫ్లైయింగ్ ట్యాక్సీ ఇది. విమానాలను తయారు చేసే అమెరికన్ కంపెనీ ‘జోబీ ఏవియేషన్స్’ ఇటీవల దీనికి రూపకల్పన చేసింది. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఎగిరే కార్లను రూపొందించాయి. ‘జోబీ ఏవియేషన్స్’ ఆరు ప్రొపెల్లర్లతో రూపొందించిన ఈ ఫ్లైయింగ్ ట్యాక్సీ ఎటువంటి ఉపరితలం పైనుంచి అయినా, ఉన్న చోటు నుంచి నిట్టనిలువుగా పైకి ఎగరగలదు. ఇటీవల కాలిఫోర్నియాలో పరీక్షాత్మకంగా దీని ప్రయాణాన్ని నిర్వహించినప్పుడు, హైడ్రోజన్ ఇంధనంతో ఇది ఏకధాటిగా 902 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, ఇదివరకటి ఫ్లైయింగ్ కార్ల రికార్డులను బద్దలు కొట్టింది.దీని గరిష్ఠ వేగం గంటకు 322 కిలోమీటర్లు. ఈ ఫ్లైయింగ్ ట్యాక్సీ రూపకల్పన కోసం అమెరికన్ సైన్యం కొంతవరకు నిధులు సమకూర్చినట్లు ‘జోబీ ఏవియేషన్స్’ వ్యవస్థాపకుడు, సీఈవో జోబెన్ బెవిర్ట్ వెల్లడించారు. రద్దీగా ఉండే పట్టణ ప్రాంతాల్లో ప్రయాణికులను ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకుపోయేందుకు ఇది బాగా ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. పట్టణ ప్రాంతాల్లోని స్థానిక అవసరాలకు మాత్రమే కాకుండా, దేశాల మధ్య కూడా ఇది ప్రయాణించగలదని, దాదాపు 900 కిలోమీటర్ల వరకు దీనికి ఇంధనం నింపాల్సిన అసరం ఉండదని బెవిర్ట్ చెప్పారు. ప్రస్తుతం ఈ ఫ్లైయింగ్ ట్యాక్సీ ఉత్పత్తిని 2050 నాటికి వాణిజ్యపరంగా ప్రారంభించనున్నామని వెల్లడించారు. -
2025..దుబాయ్‌లో వచ్చేస్తోంది..
అదిగో ఫ్లయింగ్ ట్యాక్సీ.. ఇదిగో ఫ్లయింగ్ ట్యాక్సీ అనడమే తప్ప.. అవి వాస్తవ రూపంలోకి ఎప్పుడు వస్తాయన్నది మాత్రం ఇప్పటి వరకూ తేలలేదు. అయితే.. దుబాయ్‌లో వచ్చే ఏడాది నుంచి తాము ఈ సర్వీసులు నడపనున్నట్లు కాలిఫోర్నియాకు చెందిన జాబీ ఏవియేషన్ కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు దుబాయ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీతో ఆ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. దుబాయ్ ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ వద్ద ఇవి అందుబాటులో ఉంటాయి. ఎలక్ట్రిక్ మోటార్లతో నడిచే ఈ ట్యాక్సీల్లో పైలట్, మరో నలుగురు ప్రయాణించవచ్చు. దీనికి రన్‌వే అవసరం ఉండదు. హెలికాప్టర్ తరహాలో గాల్లోకి లేస్తుంది. ఒకసారి చార్జ్ చేస్తే.. 160 కిలోమీటర్ల దూరం వరకూ ప్రయాణించవచ్చు. గంటకు 320 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఈ లెక్కన దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి అక్కడి ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం పామ్ జుమేరా(కృత్రిమ దీవులు)కు కేవలం 10 నిమిషాల్లో వెళ్లవచ్చు. రెగ్యులర్ ట్యాక్సీల్లో అయితే.. ఇందుకు 45 నిమిషాల సమయం పడుతుంది. టికెట్లను యాప్‌లో బుక్ చేసుకోవచ్చు. ధర విషయాన్ని ఇంకా ప్రకటించనప్పటికీ.. హెలికాప్టర్ ట్రిప్‌కు అయ్యే ఖర్చు కన్నా.. తక్కువే ఉంటుందని కంపెనీ తెలిపింది. విమానంలా కాకుండా.. ఒక ఎస్‌యూవీలో ప్రయాణిస్తున్న అనుభూతిని ఇది కలిగిస్తుందని జాబీ ఏవియేషన్ పేర్కొంది. -
చైనాలో ఇకపై ఎగిరే ట్యాక్సీలు...
-
గాలిలో ఎగిరే కారు ఉంటే ఎంత బాగుంటుందో.. నిజంగానే రాబోతుందండోయ్
మనం కారులో రోడ్డుపై వెళ్తున్నప్పుడు భారీగా ట్రాఫిక్‌జామ్ అయితే... కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోతే ఏమనిపిస్తుంది? గాలిలో ఎగిరే కారు ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. అలా గాలిలో ఎగిరే కారు నిజంగానే రాబోతోంది. ఇప్పటిదాకా పలు కంపెనీలు ప్రోటోటైప్ ఫ్లయింగ్ ట్యాక్సీని తెచ్చినప్పటికీ వాస్తవరూపంలోకి రాలేదు. కొత్తగా ఆవిష్కరించిన ఎగిరే కారును ఎవరు, ఎక్కడ రూపొందించారు, అది ఎలా ఉంటుందనే విశేషాలు చూద్దాం..! –సాక్షి, సెంట్రల్ డెస్క్ 2027 నాటికల్లా వినియోగంలోకి.. యూరప్ దేశమైన స్లొవేకియాలో ఏరోమొబిల్ కంపెనీ ప్రపంచంలోనే మొదటి ఫోర్‌సీటర్ ఫ్లయింగ్ ట్యాక్సీని ఆవిష్కరించింది. దీని పేరు ఏఎం నెక్ట్స్. మరో ఐదేళ్లలో ఇది వినియోగంలోకి రానుంది. 2027నాటికల్లా 500 మైళ్ల దూరానికి ప్రయాణికులను తీసుకెళ్తుంది. ఈ కంపెనీ రూపొందించిన రెండో ఫ్లయింగ్ కారు ఇది. సూపర్‌కార్, తేలికపాటి విమానాల లక్షణాలుండే ఈ కారు మూడు నిమిషాల వ్యవధిలో తన ‘మోడ్’ను (అంటే రోడ్డుపై నుంచి గాల్లోకి ఎగరడం.. గాల్లో నుంచి రోడ్డు మీదికి దిగడం) మార్చుకోగలదు. హాయిగా వెళ్లొచ్చు... ఈ కారు అందుబాటులోకి వస్తే ప్రయాణికుల విలువైన సమయం చాలా ఆదా అవుతుందని కంపెనీ చెబుతోంది. ముఖ్యమైన నగరాల మధ్య 100 నుంచి 500 మైళ్ల దూరం వెళ్లే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని అంటోంది. ఇందులో వెళ్తే ప్రయాణ బడలిక అస్సలుండదని, ఆడుతూపాడుతూ వెళ్లొచ్చని, అదీగాక భూమ్మీద ఉండే అందాలను వీక్షిస్తూ వెళ్లొచ్చని చెబుతోంది. అయితే ఫ్లయింగ్ ట్యాక్సీ ధర ఎంత అనే విషయాన్ని మాత్రం కంపెనీ ప్రకటించలేదు. అలాగే ప్రయాణికులకు టికెట్ ఎంత ఉంటుందన్నది కూడా వెల్లడించలేదు. తొలుత ఏఎం 4.0 ఈ కంపెనీ మొదట రూపొందించిన టూసీటర్ ఫ్లయింగ్ కారు ఏఎం 4.0 మోడల్‌ను 2017 జూన్‌లో ప్యారిస్‌లో జరిగిన అంతర్జాతీయ ఎయిర్ షోలో ప్రదర్శించారు. గాలిలో గంటకు 360 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఎగిరేలా దీన్ని రూపొందించారు. రోడ్డుపై దీని గరిష్టవేగం గంటకు 160 కి.మీ. దీని ఖరీదు రూ.9.8 కోట్లు – 12 కోట్ల వరకు ఉంది. ఈ ఫ్లయింగ్ కారును గాలిలో నడపాలంటే మాత్రం పైలట్ లైసెన్స్ తీసుకోవడం తప్పనిసరి. ఈ కారును వచ్చే ఏడాదికి మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ తొలుత భావించినప్పటికీ.. ఇప్పుడు 2024కు గానీ అందుబాటులోకి రాదని చెబుతోంది. అసలు సిసలు ఫ్లయింగ్ కారు ‘ఇది ఏరోమొబిల్ అసలు సిసలు ఫ్లయింగ్ కారు. ఇది రెండో విప్లవాత్మకమైన మోడల్’ అని కంపెనీ సీఈఓ పాట్రిక్ హెస్సెల్ చెప్పారు. ఒక్క ఉత్తర అమెరికా మార్కెట్లోనే ఏడాదికి 4 లక్షల కోట్ల మేర బిజినెస్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఎగిరే కార్ల వల్ల వ్యక్తిగత రవాణాను మరింత సులభతరం చేయడమే తమ లక్ష్యమని కంపెనీ చెబుతోంది. రోడ్డుపైగానీ, గాలిలో గానీ చాలా సౌకర్యవంతంగా ప్రయాణం చేయడానికి దోహదం చేస్తుందని అంటోంది. ముఖ్యంగా ట్రాఫిక్ జామ్‌లకు దీంతో చెక్ పెట్టవచ్చంటోంది. ఈ ఎగిరే కారు కోసం ప్రస్తుతం అమెరికాలో ఉన్న 10 వేల ల్యాండింగ్ స్ట్రిప్‌లను వినియోగించుకోవాలని కంపెనీ భావిస్తోంది. -
Flying Taxis: ఎగిరే టాక్సీలో ఆఫీసుకు వెళ్దామా..!!
The Flying Taxi Market Is Ready To Change Worldwide Travel: కారులో ఆఫీసుకు వెళ్లాలంటే ఎన్నో ట్రాఫిక్ పద్మవ్యూహాలను ఛేదించుకుంటూ వెళ్లాలి. అందుకు చాలా సమయం పడుతుంది. ట్రాఫిక్ జామ్ అయితే కదిలే వరకు టెన్షనే. చాలా ముందుగా ఇంటి నుంచి బయల్దేరాలి. అయినా టైముకు ఆఫీసుకు వెళ్తామో లేదో అన్న బెంగ. పైగా.. కాలుష్యం చంపేస్తూ ఉంటుంది. దీనికి పరిష్కారమే ఫ్లయింగ్ టాక్సీ. అంటే.. టాక్సీలాంటి చిన్న విమానం ఇది. దీన్లో ఆకాశమార్గంలో సమయానికి మనం కోరుకున్న చోటుకు వెళ్లొచ్చు. ట్రాఫిక్ జంజాటం, కాలుష్యం బాధలు ఉండవు. చాలా తక్కువ సమయంలో వందల కిలోమీటర్లు ఎగిరెళ్లిపోవచ్చు. చాలా త్వరలోనే ఈ కల సాకారమవుతుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో కొన్ని సంస్థలు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాయి. వీటికి అవసరమైన చిన్న విమానాలు, చిన్న ఎయిర్‌పోర్టులు, ఇతర సౌకర్యాల ఏర్పాట్లలో తలమునకలయ్యాయి. ఏమిటీ ఫ్లయింగ్ టాక్సీలు నలుగురు లేదా ఐదుగురు కూర్చొని వెళ్లే చిన్న విమానాలివి. సాధారణ విమానాల్లా రన్‌వేల అవసరం ఉండదు. హెలికాప్టర్ల తరహాలో నిలువుగా పైకి లేస్తాయి. అదే విధంగా కిందకి దిగుతాయి. వీటిని ఎలక్ట్రిక్ వెరి్టకల్ టేకాఫ్ అండ్ లాండింగ్ (ఈవీటీవోఎల్) వెహికిల్స్‌గా పిలుస్తారు. డ్రోన్ల తరహాలో ఉండే వీటికి నాలుగు ప్రొఫెల్లర్లు ఉంటాయి. 2040వ సంవత్సరానికి దాదాపు 4,30,000 ఎయిర్ టాక్సీలు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. ఇలా వెళ్లిపోవడమే.. వీటికి పెద్దగా స్థలం అవసరం లేదు. స్కైపోర్టులని పిలిచే చిన్న ఎయిర్‌పోర్టులు నిరి్మస్తారు. నగరాల్లో పరిశ్రమలు, కార్యాలయాలు, పెద్ద పెద్ద మార్కెట్లు, నివాస ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. ఒక చోట ఎక్కి మరో చోట దిగిపోవచ్చు. టాక్సీ ఏరియాకి వచ్చే సమయానికి విమానం సిద్ధంగా ఉంటుంది. కొద్ది నిమిషాల్లోనే కోరుకున్న చోట దిగిపోవచ్చు. ఇందుకు కొంత చార్జి చేస్తారు. కాలిఫోర్నియాకు చెందిన జాబీ ఏవియేషన్ అనే సంస్థ ఇప్పటికే ప్రయోగాత్మకంగా వెయ్యి రౌండ్లు నడిపి చూసింది. ఈ సంస్థ నడిపిన విమానంలో నలుగురు ప్రయాణించొచ్చు. గంటకు 322 కిలోమీటర్ల వేగంతో 241 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 2024 నుంచి వాణిజ్యపరంగా టాక్సీలు నడపాలని భావిస్తోంది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అనుమతుల కోసం వేచి చూస్తోంది. జాబీ ఇప్పటికే అమెరికాలోని పార్కింగ్ సంస్థ అయిన రీఫ్ టెక్నాలజీతో ఒప్పందానికి వచి్చంది. ఆ సంస్థ నిర్వహించే కార్ పార్కింగుల భవనాల పైన స్కై పోర్టుల ఏర్పాటుకు ఈ ఒప్పందం చేసుకుంది. అదేవిధంగా న్యూయార్క్‌కు చెందిన భూస్వాములు, పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలతోనూ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు సంస్థ ప్రతినిధి వాకర్ జోన్స్ చెప్పారు. సాధ్యమైనన్ని నగరాల్లో స్కైపోర్టులు ఏర్పాటు చేస్తామని అంటున్నారు. ఇంగ్లండ్‌లోనూ.. ఇంగ్లండ్‌లో కూడా స్కైపోర్టులకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొవెంట్రీలోని రగ్బీ, ఫుట్‌బాల్ స్టేడియం వద్ద తొలి స్కైపోర్టు ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. హ్యుందయ్ సంస్థ భాగస్వామి అయిన అర్బన్ ఎయిర్పోర్ట్ అనే సంస్థ దీనిని ప్రధాన డ్రోన్, ఫ్లయింగ్ టాక్సీల కేంద్రంగా రూపుదిద్దే ప్రయత్నాల్లో ఉంది. ‘ఈ చిన్ని విమానాశ్రయం ద్వారా కాలుష్యం అనేదే ఉండదు. కార్లు, లారీల వంటి వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బందులూ ఉండవు’ అని సంస్థ ఫౌండర్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రికీ సంధూ చెప్పారు. కొవెంట్రీలో తొలి విమానాశ్రయాన్ని 2022లో ప్రారంభిస్తామని ఆయన అంటున్నారు. సమస్యలూ ఉన్నాయి స్కైపోర్టులు, ఫ్లయింగ్ టాక్సీలతో సమస్యలు లేవా అంటే.. అవీ చాలానే ఉన్నాయంటున్నారు నిపుణులు. వీటికి ముందుగా ప్రజల మద్దతు కావాలి. పెద్ద ఎత్తున పెట్టుబడులు కావాలి. మౌలిక సదుపాయాలు, విద్యుత్తు, డిజిటల్ వ్యవస్థ వంటివి చాలా అవసరం. ప్రమాదాలు జరగకుండా విమానాలు వెళ్లే మార్గాలు, వాటి నిర్వహణ అత్యంత కీలకం. ఇందుకోసం అత్యంత సమర్ధవంతమైన ఆటోమేటిక్ ఎయిర్‌ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థ ఏర్పాటు కావాలి. ఏదైనా ప్రమాదం జరిగితే దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని ఏరోకాన్కు చెందిన ఇంజనీరింగ్ నిపుణుడు ఆరాన్ బెల్బసిస్ చెప్పారు. ఆకాశంలో విమానాల నియంత్రణే అత్యంత కీలకమని అమెరికాకు చెందిన బిజినెస్ రిసెర్చి గ్రూప్ జేడీ పవర్ నిపుణులు మైకేల్ టేలర్ చెప్పారు. స్కైపోర్టులు, టాక్సీల నిర్వహణకు ప్రభుత్వాల అనుమతులూ పెద్ద సమస్యేనని నిపుణులు చెబుతున్నారు. సవాళ్లు ఎన్ని ఉన్నప్పటికీ, ఫ్లయింగ్ టాక్సీలకు అమెరికా, బ్రిటన్, ఆసియా దేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుందని సంధూ చెబుతున్నారు. – సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్క్ -
గాల్లో ఎగిరే కార్లు!
ఇక ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకోవాల్సిన పని లేదు. దిల్షుక్నగర్ నుంచి హైటెక్ సిటీకి కేవలం పది నిముషాల్లోనే చేరుకోవచ్చు. ఎంచక్కా గాల్లోనే హాయిగా ఎగురుకుంటూ వెళ్లిపోవచ్చు. అవును ఇకపై ఉబర్ క్యాబ్‌లలో ఉబర్ పూల్, ఉబర్ గో మాత్రమే కాదు ఉబర్ ఎయిర్ ఆప్షన్ కూడా రాబోతోంది. అమెరికాలోని దల్లాస్, లాస్ ఏంజెల్స్‌లో ఎగిరే కార్లను నడుపుతామని గత ఏడాది ప్రకటించిన ఉబర్ సంస్థ ఇప్పుడు మరో నగరంలోనూ ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి అయిదు దేశాలతో షార్ట్ లిస్ట్‌ను విడుదల చేసింది. అందులో భారత్‌కు కూడా చోటు దక్కింది. జపాన్‌లోని టోక్యోలో జరిగిన ఉబర్ ఎలివేట్ ఆసియా ఫసిఫిక్ సదస్సులో ఉబర్ ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. భారత్‌తో పాటు జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, బ్రెజిల్ దేశాలను ఎంపిక చేసింది. ఈ దేశాల్లోని వివిధ నగరాల్లో మార్కెట్, కొత్త తరహా రవాణా విధానాన్ని వాడడానికి ప్రజలు కనబరిచే ఉత్సాహం, ఇతర పరిస్థితుల్ని అంచనా వేశాక ఎగిరే కార్లను నడిపే మూడో నగరాన్ని ఎంపిక చేస్తుంది. 10 లక్షల జనాభాకు మించి ఉన్న మెట్రోపాలిటన్ నగరంలోనే ఈ సేవలను తీసుకురావాలని భావిస్తోంది. ఆయా నగరాల్లో స్థానిక అధికారులు, రాజకీయ నేతలు, ప్రజలతో మమేకమయ్యే సంస్థలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపి మరో ఆరు నెలల్లో మూడో నగరాన్ని ప్రకటిస్తామని ఉబర్ వెల్లడించింది. 2020 నాటికల్లా ప్రయోగాత్మకంగా ఈ కార్లను నడిపి చూసి, 2023 నాటికి పూర్తి స్థాయిలో ఎగిరే కార్ల సర్వీసుని అందుబాటులోకి తీసుకురానుంది. ‘భారత్‌లో ముంబై, ఢిల్లీ, బెంగుళూరు ఏ సమయంలో చూసినా ట్రాఫిక్‌తో కిటకిటలాడిపోతూ ఉంటాయి. ఒకట్రెండు కిలో మీటర్ల దూరానికి గంట పట్టేస్తుంది. ఇకపై ఆ బాదరాబందీ ఉండదు. ఎగిరే కార్లను తీసుకువస్తే ప్రయాణికుల సమయం ఆదా అవుతుంది‘ అని ఉబర్ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఉబర్ ఎలివేట్ ప్రత్యేకతలు గాల్లో ఎగిరే కార్ల తయారీకి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం కోసం ఉబర్ సంస్థ ఇప్పటికే ఎన్నో సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసాతో కలిసి ఉబర్ ఎలివేట్ అనే ప్రాజెక్టుని ప్రారంభించింది. బోయింగ్, బెల్ హెలికాప్టర్ వంటి డజనుకు పైగా సంస్థలు పెద్ద సంఖ్యలో ఎగిరే కార్లను తయారు చేయడానికి ముందుకు వచ్చాయి. వేలకోట్ల డాలర్ల పెట్టుబడిని పెడుతున్నాయి. ఈ ఎగిరే కార్లకు చాలా ప్రత్యేకతలున్నాయి. ఈ కార్లు పూర్తిగా విద్యుత్ మీదే నడుస్తాయి పెద్ద పెద్ద భవంతులపై కూడా సులభంగా వాలిపోగలవు టేకాఫ్, ల్యాండింగ్ నిలువుగా చేస్తాయి (వెర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ ఠ్టిౌ∙ఎయిర్‌క్రాఫ్ట్) వెయ్యి నుంచి 2 వేల అడుగుల ఎత్తులో ఎగురుతాయి. 15 నుంచి 100 కి.మీ. దూరం ప్రయాణించేలా కార్ల తయారీ గంటకి గరిష్ట వేగం 300 కి.మీ 20 కి.మీ దూరాన్ని కేవలం 10 నిముషాల్లోనే చేరుకోగలవు ఒకేసారి వంద కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం పైలెట్ కాకుండా నలుగురు ప్రయాణికులు కూర్చొనేలా కార్ల డిజైన్ ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి నగరాల్లో ఈ కార్లు అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు సగటున రోజుకి రెండు గంటల సమయం ఆదా అవుతుందనే అంచనాలున్నాయి.