ప్రపంచంలో తొలి ఫ్లయింగ్ ట్యాక్సీలు (flying taxi) అతి త్వరలోనే ప్రారంభం కానున్నాయి. 2025 చివరి నాటికి ఈ ఫ్యూచరిస్టిక్ సర్వీస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబి (Abu Dhabi) వేదికగా ప్రపంచానికి పరిచయం కానుంది.
అంతేకాకుండా అమెరికాకు చెందిన ఆర్చర్ ఏవియేషన్ కంపెనీ భాగస్వామ్యంతో ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (eVTOL) ఎయిర్ క్రాఫ్ట్‌ల ఉత్పత్తి కూడా ఇక్కడే ప్రారంభం కానుందది. ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చినట్లయితే, అబుదాబి నగర వ్యాప్తంగా వెర్టిపోర్ట్‌లు ఏర్పాటవుతాయి. వీటిని కలుపుతూ వినూత్నమైన మిడ్‌నైట్ ఈవీటోల్‌లు (eVTOL) ఒక్కో ట్రిప్‌కు నలుగురు ప్రయాణికులను తీసుకువెళతాయి. ప్రయాణ సమయాన్ని 80 శాతం వరకు తగ్గిస్తాయి.
ఈవీటోల్ వాహనాలను విస్తృత ప్రయాణ సాధనాలుగా ఉపయోగించాలన్న ఆలోచన 2016లో ఉబెర్ తన ఎలివేట్ కాన్ఫరెన్స్‌లో ఈ కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టినప్పుడు విస్తృత దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు కార్ రైడ్‌లను బుక్‌చేసుకుంటున్నంత సులభంగా భవిష్యత్తులో ఫ్లయింగ్ ట్యాక్సీలను కూడా బుక్ చేసుకునే వెసులుబాటు తీసుకురావాలని ఈ భావనకు కంపెనీ రూపకల్పన చేసింది.
అప్పటి నుండి ఈవీటోల్ పరిశ్రమ ఆసక్తిని పెంచుతూ వస్తోంది. దీనికి సంబంధించి 300 కంటే ఎక్కువ స్టార్టప్‌లు ఉద్భవించాయి. ఇవి సమిష్టిగా దాదాపు 10 బిలియన్ డాలర్ల నిధులను పొందుతున్నాయి. అయితే పరిశోధనా సంస్థ ఐడీటెక్‌ఎక్స్ (IDTechEx) మాత్రం ఇటీవలి తన అధ్యయనంలో 5% కంటే తక్కువ కంపెనీలు మాత్రమే దీర్ఘకాలికంగా మనుగడ సాగిస్తాయని అంచనా వేసింది. కాగా వీటిలో ఆర్చర్ ఏవియేషన్ మొదటి మూడు అత్యంత విలువైన కంపెనీలలో ఒకటిగా నిలిచింది.
ఆర్చర్ అబుదాబిలో తన ప్రారంభ వాణిజ్య సేవను ప్రారంభించడం ద్వారా ముందస్తు ప్రయోజనాన్ని పొందాలని భావిస్తోంది. మిడ్‌నైట్ ఈవీటోల్ గరిష్టంగా గంటకు 240 కి.మీ. వేగాన్ని చేరుకోగలదు. ఆర్చర్ అమెరికా, భారత్, దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశాలలో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నప్పటికీ, దాని యూఏఈ కార్యకలాపాలు అత్యంత ముందస్తు దశలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment