మనం కారులో రోడ్డుపై వెళ్తున్నప్పుడు భారీగా ట్రాఫిక్‌జామ్ అయితే... కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోతే ఏమనిపిస్తుంది? గాలిలో ఎగిరే కారు ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. అలా గాలిలో ఎగిరే కారు నిజంగానే రాబోతోంది. ఇప్పటిదాకా పలు కంపెనీలు ప్రోటోటైప్ ఫ్లయింగ్ ట్యాక్సీని తెచ్చినప్పటికీ వాస్తవరూపంలోకి రాలేదు. కొత్తగా ఆవిష్కరించిన ఎగిరే కారును ఎవరు, ఎక్కడ రూపొందించారు, అది ఎలా ఉంటుందనే విశేషాలు చూద్దాం..! –సాక్షి, సెంట్రల్ డెస్క్
2027 నాటికల్లా వినియోగంలోకి..
యూరప్ దేశమైన స్లొవేకియాలో ఏరోమొబిల్ కంపెనీ ప్రపంచంలోనే మొదటి ఫోర్‌సీటర్ ఫ్లయింగ్ ట్యాక్సీని ఆవిష్కరించింది. దీని పేరు ఏఎం నెక్ట్స్. మరో ఐదేళ్లలో ఇది వినియోగంలోకి రానుంది. 2027నాటికల్లా 500 మైళ్ల దూరానికి ప్రయాణికులను తీసుకెళ్తుంది. ఈ కంపెనీ రూపొందించిన రెండో ఫ్లయింగ్ కారు ఇది. సూపర్‌కార్, తేలికపాటి విమానాల లక్షణాలుండే ఈ కారు మూడు నిమిషాల వ్యవధిలో తన ‘మోడ్’ను (అంటే రోడ్డుపై నుంచి గాల్లోకి ఎగరడం.. గాల్లో నుంచి రోడ్డు మీదికి దిగడం) మార్చుకోగలదు.
హాయిగా వెళ్లొచ్చు...
ఈ కారు అందుబాటులోకి వస్తే ప్రయాణికుల విలువైన సమయం చాలా ఆదా అవుతుందని కంపెనీ చెబుతోంది. ముఖ్యమైన నగరాల మధ్య 100 నుంచి 500 మైళ్ల దూరం వెళ్లే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని అంటోంది. ఇందులో వెళ్తే ప్రయాణ బడలిక అస్సలుండదని, ఆడుతూపాడుతూ వెళ్లొచ్చని, అదీగాక భూమ్మీద ఉండే అందాలను వీక్షిస్తూ వెళ్లొచ్చని చెబుతోంది. అయితే ఫ్లయింగ్ ట్యాక్సీ ధర ఎంత అనే విషయాన్ని మాత్రం కంపెనీ ప్రకటించలేదు. అలాగే ప్రయాణికులకు టికెట్ ఎంత ఉంటుందన్నది కూడా వెల్లడించలేదు.
తొలుత ఏఎం 4.0
ఈ కంపెనీ మొదట రూపొందించిన టూసీటర్ ఫ్లయింగ్ కారు ఏఎం 4.0 మోడల్‌ను 2017 జూన్‌లో ప్యారిస్‌లో జరిగిన అంతర్జాతీయ ఎయిర్ షోలో ప్రదర్శించారు. గాలిలో గంటకు 360 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఎగిరేలా దీన్ని రూపొందించారు. రోడ్డుపై దీని గరిష్టవేగం గంటకు 160 కి.మీ. దీని ఖరీదు రూ.9.8 కోట్లు – 12 కోట్ల వరకు ఉంది. ఈ ఫ్లయింగ్ కారును గాలిలో నడపాలంటే మాత్రం పైలట్ లైసెన్స్ తీసుకోవడం తప్పనిసరి. ఈ కారును వచ్చే ఏడాదికి మార్కెట్‌లోకి తీసుకురావాలని కంపెనీ తొలుత భావించినప్పటికీ.. ఇప్పుడు 2024కు గానీ అందుబాటులోకి రాదని చెబుతోంది.
అసలు సిసలు ఫ్లయింగ్ కారు
‘ఇది ఏరోమొబిల్ అసలు సిసలు ఫ్లయింగ్ కారు. ఇది రెండో విప్లవాత్మకమైన మోడల్’ అని కంపెనీ సీఈఓ పాట్రిక్ హెస్సెల్ చెప్పారు. ఒక్క ఉత్తర అమెరికా మార్కెట్‌లోనే ఏడాదికి 4 లక్షల కోట్ల మేర బిజినెస్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఎగిరే కార్ల వల్ల వ్యక్తిగత రవాణాను మరింత సులభతరం చేయడమే తమ లక్ష్యమని కంపెనీ చెబుతోంది. రోడ్డుపైగానీ, గాలిలో గానీ చాలా సౌకర్యవంతంగా ప్రయాణం చేయడానికి దోహదం చేస్తుందని అంటోంది. ముఖ్యంగా ట్రాఫిక్ జామ్‌లకు దీంతో చెక్ పెట్టవచ్చంటోంది. ఈ ఎగిరే కారు కోసం ప్రస్తుతం అమెరికాలో ఉన్న 10 వేల ల్యాండింగ్ స్ట్రిప్‌లను వినియోగించుకోవాలని కంపెనీ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment