అదిగో ఫ్లయింగ్ ట్యాక్సీ.. ఇదిగో ఫ్లయింగ్ ట్యాక్సీ అనడమే తప్ప.. అవి వాస్తవ రూపంలోకి ఎప్పుడు వస్తాయన్నది మాత్రం ఇప్పటి వరకూ తేలలేదు. అయితే.. దుబాయ్‌లో వచ్చే ఏడాది నుంచి తాము ఈ సర్వీసులు నడపనున్నట్లు కాలిఫోర్నియాకు చెందిన జాబీ ఏవియేషన్ కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు దుబాయ్ రోడ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీతో ఆ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. దుబాయ్ ఎయిర్‌పోర్ట్, రైల్వే స్టేషన్ వద్ద ఇవి అందుబాటులో ఉంటాయి. ఎలక్ట్రిక్ మోటార్లతో నడిచే ఈ ట్యాక్సీల్లో పైలట్, మరో నలుగురు ప్రయాణించవచ్చు. దీనికి రన్‌వే అవసరం ఉండదు.
హెలికాప్టర్ తరహాలో గాల్లోకి లేస్తుంది. ఒకసారి చార్జ్ చేస్తే.. 160 కిలోమీటర్ల దూరం వరకూ ప్రయాణించవచ్చు. గంటకు 320 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఈ లెక్కన దుబాయ్ ఎయిర్‌పోర్ట్ నుంచి అక్కడి ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం పామ్ జుమేరా(కృత్రిమ దీవులు)కు కేవలం 10 నిమిషాల్లో వెళ్లవచ్చు. రెగ్యులర్ ట్యాక్సీల్లో అయితే.. ఇందుకు 45 నిమిషాల సమయం పడుతుంది. టికెట్లను యాప్‌లో బుక్ చేసుకోవచ్చు. ధర విషయాన్ని ఇంకా ప్రకటించనప్పటికీ.. హెలికాప్టర్ ట్రిప్‌కు అయ్యే ఖర్చు కన్నా.. తక్కువే ఉంటుందని కంపెనీ తెలిపింది. విమానంలా కాకుండా.. ఒక ఎస్‌యూవీలో ప్రయాణిస్తున్న అనుభూతిని ఇది కలిగిస్తుందని జాబీ ఏవియేషన్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment