దుబాయ్‌కు పయనమైన టీమిండియా.. రోహిత్‌, కోహ్లి, గంభీర్‌లతో పాటు.. | Rohit Kohli Team India Leaves For Dubai For ICC CT 2025 Video Viral | Sakshi
Sakshi News home page

దుబాయ్‌కు పయనమైన టీమిండియా.. రోహిత్‌, కోహ్లి, గంభీర్‌లతో పాటు..

Published Sat, Feb 15 2025 3:51 PM | Last Updated on Sat, Feb 15 2025 4:16 PM

Rohit Kohli Team India Leaves For Dubai For ICC CT 2025 Video Viral

చాంపియన్స్‌ ట్రోఫీ-2025(ICC Champions Trophy) ఫీవర్‌ మొదలైపోయింది. ఈ మెగా టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు టీమిండియా దుబాయ్‌కు పయనమైంది. హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌(Gautam Gambhir)తో పాటు రోహిత్‌ సేన శనివారం ముంబై నుంచి బయల్దేరింది. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో టీమిండియా సభ్యులు కనిపించడంతో అభిమానులు వారి ఫొటోలు తీసుకుంటూ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.

ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా 2017లో చివరిసారిగా ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ జరిగింది. నాడు ఫైనల్‌ చేరుకున్న భారత జట్టు అనూహ్య రీతిలో దాయాది పాకిస్తాన్‌ చేతి(India vs Pakistan)లో ఓటమిపాలై.. టైటిల్‌ను చేజార్చుకుంది. అందుకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఇప్పుడు సమయం వచ్చింది.

తటస్థ వేదికపై
పాకిస్తాన్‌ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఈ ఐసీసీ ఈవెంట్‌ మొదలుకానుండగా.. భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా అక్కడికి వెళ్లడం లేదు. అయితే, పాక్‌ క్రికెట్‌ బోర్డు మాత్రం భారత జట్టు తమ దేశానికి తప్పక రావాలని పట్టుబట్టగా...బీసీసీఐ అందుకు నిరాకరించింది. ఆఖరికి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) జోక్యంతో తటస్థ వేదికపై టీమిండియా మ్యాచ్‌లు ఆడేందుకు మార్గం సుగమమైంది.

ఈ నేపథ్యంలో ఐసీసీ నిర్ణయం మేరకు రోహిత్‌ సేన తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడనుంది. ఇందుకోసం జనవరి 18న ప్రాథమిక జట్టును ప్రకటించిన బీసీసీఐ.. ఇటీవలే రెండు మార్పులతో తమ జట్టును ఖరారు చేసింది. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో చాంపియన్స్‌ ట్రోఫీ ఆడబోయే పదిహేను మంది సభ్యుల వివరాలు మంగళవారం వెల్లడించింది.

రెండు మార్పులు
యువ బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌ను తప్పించి అతడి స్థానంలో మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తికి చోటిచ్చిన యాజమాన్యం.. జస్‌ప్రీత్‌ బుమ్రా గాయం కారణంగా హర్షిత్‌ రాణాకు పిలుపునిచ్చింది. ఇక ఈ టోర్నీలో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ సందర్భంగా టీమిండియా తమ ప్రయాణం మొదలుపెట్టనుంది.

అనంతరం దాయాది పాకిస్తాన్‌తో ఫిబ్రవరి 23న తలపడనున్న రోహిత్‌ సేన.. లీగ్‌ దశలో ఆఖరిగా న్యూజిలాండ్‌ను మార్చి 2న ఢీకొట్టనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో స్వదేశంలో సిరీస్‌ ద్వారా ఈ వన్డే టోర్నీకి టీమిండియాకు కావాల్సినంత ప్రాక్టీస్‌ లభించింది.

మరో సానుకూలాంశం
సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్‌కు.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(సెంచరీ), స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి(అర్ధ శతకం) ఫామ్‌లోకి రావడం మరో సానుకూలాంశం. ఇక ఈ మెగా ఈవెంట్లో పాల్గొనే క్రమంలో రోహిత్‌ సేన శనివారమే దుబాయ్‌కు పయనమైంది. 

రోహిత్‌-కోహ్లిలతో పాటు హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌, వరుణ్‌ చక్రవర్తి, కుల్దీప్‌ యాదవ్‌, హర్షిత్‌ రాణా, అక్షర్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ తదితరులు ఎయిర్‌పోర్టులో తళుక్కుమన్నారు.

వీరితో పాటు బౌలింగ్‌ కోచ్‌ మోర్నీ మోర్కెల్‌, అసిస్టెంట్‌ కోచ్‌ ర్యాన్‌ టెన్‌ డష్కాటే, ఫీల్డింగ్‌ కోచ్‌ టి.దిలీప్‌ సహా సహాయక సిబ్బంది యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు బయల్దేరారు.

చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో పాల్గొనే భారత జట్టు
రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్‌(వైస్‌ కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌(వికెట్‌ కీపర్‌), రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్యా, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, కుల్దీప్‌ యాదవ్‌, హర్షిత్‌ రాణా, మహ్మద్‌ షమీ, అర్ష్‌దీప్‌ సింగ్‌, రవీంద్ర జడేజా, వరుణ్‌ చక్రవర్తి.

చదవండి: రోహిత్‌, కోహ్లితో పాటు అతడికి ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ: భారత మాజీ క్రికెటర్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement