మినీ ఎయిర్‌పోర్టు నమూనా చిత్రం
The Flying Taxi Market Is Ready To Change Worldwide Travel: కారులో ఆఫీసుకు వెళ్లాలంటే ఎన్నో ట్రాఫిక్ పద్మవ్యూహాలను ఛేదించుకుంటూ వెళ్లాలి. అందుకు చాలా సమయం పడుతుంది. ట్రాఫిక్ జామ్ అయితే కదిలే వరకు టెన్షనే. చాలా ముందుగా ఇంటి నుంచి బయల్దేరాలి. అయినా టైముకు ఆఫీసుకు వెళ్తామో లేదో అన్న బెంగ. పైగా.. కాలుష్యం చంపేస్తూ ఉంటుంది. దీనికి పరిష్కారమే ఫ్లయింగ్ టాక్సీ. అంటే.. టాక్సీలాంటి చిన్న విమానం ఇది. దీన్లో ఆకాశమార్గంలో సమయానికి మనం కోరుకున్న చోటుకు వెళ్లొచ్చు. ట్రాఫిక్ జంజాటం, కాలుష్యం బాధలు ఉండవు. చాలా తక్కువ సమయంలో వందల కిలోమీటర్లు ఎగిరెళ్లిపోవచ్చు. చాలా త్వరలోనే ఈ కల సాకారమవుతుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో కొన్ని సంస్థలు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాయి. వీటికి అవసరమైన చిన్న విమానాలు, చిన్న ఎయిర్‌పోర్టులు, ఇతర సౌకర్యాల ఏర్పాట్లలో తలమునకలయ్యాయి.
ఏమిటీ ఫ్లయింగ్ టాక్సీలు
నలుగురు లేదా ఐదుగురు కూర్చొని వెళ్లే చిన్న విమానాలివి. సాధారణ విమానాల్లా రన్‌వేల అవసరం ఉండదు. హెలికాప్టర్ల తరహాలో నిలువుగా పైకి లేస్తాయి. అదే విధంగా కిందకి దిగుతాయి. వీటిని ఎలక్ట్రిక్ వెరి్టకల్ టేకాఫ్ అండ్ లాండింగ్ (ఈవీటీవోఎల్) వెహికిల్స్‌గా పిలుస్తారు. డ్రోన్ల తరహాలో ఉండే వీటికి నాలుగు ప్రొఫెల్లర్లు ఉంటాయి. 2040వ సంవత్సరానికి దాదాపు 4,30,000 ఎయిర్ టాక్సీలు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు.
ఇలా వెళ్లిపోవడమే..
వీటికి పెద్దగా స్థలం అవసరం లేదు. స్కైపోర్టులని పిలిచే చిన్న ఎయిర్‌పోర్టులు నిరి్మస్తారు. నగరాల్లో పరిశ్రమలు, కార్యాలయాలు, పెద్ద పెద్ద మార్కెట్లు, నివాస ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. ఒక చోట ఎక్కి మరో చోట దిగిపోవచ్చు. టాక్సీ ఏరియాకి వచ్చే సమయానికి విమానం సిద్ధంగా ఉంటుంది. కొద్ది నిమిషాల్లోనే కోరుకున్న చోట దిగిపోవచ్చు. ఇందుకు కొంత చార్జి చేస్తారు.
కాలిఫోర్నియాకు చెందిన జాబీ ఏవియేషన్ అనే సంస్థ ఇప్పటికే ప్రయోగాత్మకంగా వెయ్యి రౌండ్లు నడిపి చూసింది. ఈ సంస్థ నడిపిన విమానంలో నలుగురు ప్రయాణించొచ్చు. గంటకు 322 కిలోమీటర్ల వేగంతో 241 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 2024 నుంచి వాణిజ్యపరంగా టాక్సీలు నడపాలని భావిస్తోంది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అనుమతుల కోసం వేచి చూస్తోంది. జాబీ ఇప్పటికే అమెరికాలోని పార్కింగ్ సంస్థ అయిన రీఫ్ టెక్నాలజీతో ఒప్పందానికి వచి్చంది. ఆ సంస్థ నిర్వహించే కార్ పార్కింగుల భవనాల పైన స్కై పోర్టుల ఏర్పాటుకు ఈ ఒప్పందం చేసుకుంది. అదేవిధంగా న్యూయార్క్‌కు చెందిన భూస్వాములు, పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలతోనూ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు సంస్థ ప్రతినిధి వాకర్ జోన్స్ చెప్పారు. సాధ్యమైనన్ని నగరాల్లో స్కైపోర్టులు ఏర్పాటు చేస్తామని అంటున్నారు.
ఇంగ్లండ్‌లోనూ..
ఇంగ్లండ్‌లో కూడా స్కైపోర్టులకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొవెంట్రీలోని రగ్బీ, ఫుట్‌బాల్ స్టేడియం వద్ద తొలి స్కైపోర్టు ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. హ్యుందయ్ సంస్థ భాగస్వామి అయిన అర్బన్ ఎయిర్‌పోర్ట్ అనే సంస్థ దీనిని ప్రధాన డ్రోన్, ఫ్లయింగ్ టాక్సీల కేంద్రంగా రూపుదిద్దే ప్రయత్నాల్లో ఉంది. ‘ఈ చిన్ని విమానాశ్రయం ద్వారా కాలుష్యం అనేదే ఉండదు. కార్లు, లారీల వంటి వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బందులూ ఉండవు’ అని సంస్థ ఫౌండర్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రికీ సంధూ చెప్పారు. కొవెంట్రీలో తొలి విమానాశ్రయాన్ని 2022లో ప్రారంభిస్తామని ఆయన అంటున్నారు.
సమస్యలూ ఉన్నాయి
స్కైపోర్టులు, ఫ్లయింగ్ టాక్సీలతో సమస్యలు లేవా అంటే.. అవీ చాలానే ఉన్నాయంటున్నారు నిపుణులు. వీటికి ముందుగా ప్రజల మద్దతు కావాలి. పెద్ద ఎత్తున పెట్టుబడులు కావాలి. మౌలిక సదుపాయాలు, విద్యుత్తు, డిజిటల్ వ్యవస్థ వంటివి చాలా అవసరం. ప్రమాదాలు జరగకుండా విమానాలు వెళ్లే మార్గాలు, వాటి నిర్వహణ అత్యంత కీలకం. ఇందుకోసం అత్యంత సమర్ధవంతమైన ఆటోమేటిక్ ఎయిర్‌ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ ఏర్పాటు కావాలి.
ఏదైనా ప్రమాదం జరిగితే దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని ఏరోకాన్‌కు చెందిన ఇంజనీరింగ్ నిపుణుడు ఆరాన్ బెల్బసిస్ చెప్పారు. ఆకాశంలో విమానాల నియంత్రణే అత్యంత కీలకమని అమెరికాకు చెందిన బిజినెస్ రిసెర్చి గ్రూప్ జేడీ పవర్ నిపుణులు మైకేల్ టేలర్ చెప్పారు. స్కైపోర్టులు, టాక్సీల నిర్వహణకు ప్రభుత్వాల అనుమతులూ పెద్ద సమస్యేనని నిపుణులు చెబుతున్నారు. సవాళ్లు ఎన్ని ఉన్నప్పటికీ, ఫ్లయింగ్ టాక్సీలకు అమెరికా, బ్రిటన్, ఆసియా దేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుందని సంధూ చెబుతున్నారు.
– సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment