
50 స్టేషన్లలో 50 స్టాళ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన రైల్వేస్టేషన్లలో తెలంగాణ మహిళా స్వయం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌జీ) స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన చేతివృత్తులు, ఉత్పత్తులు, ఇతర తినుబండారాలు వంటి వాటిని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఎస్‌హెచ్‌జీ గ్రూపుల్లోని మహిళలకు ఉపాధి కల్పన, తెలంగాణ బ్రాండ్‌కు ప్రచారంతో పాటు స్వయంసహాయక సంఘాలు తయారుచేసే ఉత్పత్తులకు గిరాకీ కల్పనకు ఇవి ఉపయోగపడతాయని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో మొత్తం 50 రైల్వే స్టేషన్‌లో (ఒక్కో దాంట్లో ఒక్కోటి) 50 స్టాళ్ల ఏర్పాటుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను మంత్రి సీతక్క చొరవతో తయారుచేయగా, వీటి ఏర్పాటుకు రైల్వే శాఖను గ్రామీణ దారిద్య్రనిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో దివ్య దేవరాజన్. ఇతర అధికారులు ఒప్పించారు.
దీంతో మొదటి విడత విడతలో 14 స్టేషన్లలో స్టాళ్ల ఏర్పాటుకు రైల్వే శాఖ అనుమతులిచ్చింది. వీటిలో ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఏడు స్టాళ్లను మహిళా సంఘాలు ప్రారంభించాయి. సికింద్రాబాద్ స్టేషన్‌లో పిండి వంటలు, ఘన్‌పూర్ స్టేషన్లో చేతి ఉత్పత్తులు, శంకర్‌పల్లిలో జూట్ బ్యాగులు, క్లాత్ బ్యాగులు, వికారాబాద్‌లో గాజులు, పూసలు, హారాలు... ఇలా ఒక్కో స్టేషన్లో భిన్నఉత్పత్తులు అందుబాటులోకి తెచ్చారు. ఇదిలా ఉంటే.. 28న ఖమ్మం స్టేషన్‌లో జూట్ బ్యాగులు, క్లాత్ బ్యాగులు, ఆసిఫాబాద్ స్టేషన్‌లో సకినాలు, లడ్డూలు, కారంపూస, ఇతర తినుబండారాల స్టాళ్లు అందుబాటులోకి రానున్నాయి. త్వరలోనే మిగతా చోట్ల కూడా ఈ స్టాళ్ల ఏర్పాటుకు పీఆర్‌ఆర్‌డీ శాఖ పరంగా ప్రయత్నాలు సాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment