పుష్కర దోపిడీ!
సాక్షి, సిటీబ్యూరో: కృష్ణా పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు తరలి వెళ్తున్న నగరవాసుల జేబులను ప్రైవేట్ వాహనాల ఆపరేటర్లు గుల్ల చేస్తున్నారు. సాధారణ చార్జీలపైన రెట్టింపు వసూళ్లకు పాల్పడుతూ నిలువునా దోచుకుంటున్నారు. విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాలతో పాటు నాగార్జునసాగర్, శ్రీశైలం, బీచుపల్లి, వాడపల్లి, సోమశిల తదితర ప్రాంతాల్లోని పుష్కరఘాట్‌లకు పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున నగర వాసులకు పుష్కర ప్రయాణం చేదు అనుభవాన్నే మిగులుస్తోంది. రైళ్లలో వెళ్లేందుకు అవకాశం లేక, ఆర్టీసీ బస్సులకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాల్లో వెళ్లవలసి వస్తోంది.
దీంతో ప్రజల అవసరాన్ని ఆసరా చేసుకొని ప్రైవేట్ ఆపరేట్లు, ట్రావెల్స్ సంస్థలు తమ దోపిడీని కొనసాగిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు సూపర్‌లగ్జరీ బస్సుల్లో సాధారణ చార్జీ రూ.350 అయితే ఇప్పుడే ఏకంగా రూ.600 లకు చేరుకుంది. అలాగే శ్రీశైలం, నాగార్జునసాగర్ వైపు వెళ్లే ప్రైవేట్ బస్సుల్లోనూ సాధారణ చార్జీలపైన రెట్టింపు వసూళ్లకు పాల్పడుతున్నాయి. శ్రీశైలంకు ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో సాధారణంగా అయితే రూ.210 లు ఉంటుంది. ఇప్పుడు ఏకంగా రూ.400లకు పెంచేశారు. అలాగే నాగార్జునసాగర్ వైపు వెళ్లే ప్రైవేట్ బస్సులు సైతం రూ.250 నుంచి రూ.500లకు పెంచేశాయి. ఇక 7 సీట్లు, 12 సీట్లు ఉన్న వాహనాలను సొంతంగా బుక్ చేసుకొనే వెళ్లే ప్రయాణికులకు సైతం ట్రావెల్స్ సంస్థలు చుక్కలు చూపిస్తున్నాయి.
కిలోమీటర్ చొప్పున లెక్కగట్టి తీసుకొనే చార్జీలతో నిమిత్తం లేకుండా గంపగుత్తగా పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నాయి. సాధారణంగా అయితే రూ.5000 ఖర్చయ్యే దూరానికి ఇప్పుడు రూ.7000 వరకు వసూలు చేస్తున్నారు. విజయవాడ వైపు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అటు వైపు వెళ్లే అన్ని ప్రైవేట్ వాహనాలు సగటు పుష్కర భక్తుడిని నిండా ముంచడమే లక్ష్యంగా పెట్టుకొని వసూళ్ల పర్వాన్ని కొనసాగిస్తున్నాయి.
ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లే వాళ్లకు చార్జీల రూపంలోనే రూ.వేల సంఖ్యలో ఖర్చు చేయవలసి వస్తోంది. మరోవైపు ఆర్టీసీ బస్సుల్లోనూ 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు. విజయవాడకు గరుడ బస్సుల్లో రూ.550 వరకు చార్జీ ఉంటే ఇప్పుడు అది ఏకంగా రూ.820కి చేరుకొంది. బీచుపల్లికి డీలక్స్ చార్జీ రూ.200 ఉండగా ప్రస్తుతం రూ.350 వసూలు చేస్తున్నారు. అన్ని రూట్లలోనూ అదనపు చార్జీల పర్వం కొనసాగుతుంది.
రైళ్లు, బస్సుల్లో రద్దీ....
మరోవైపు కృష్ణా పుష్కర ప్రభం‘జనం’ కొనసాగుతోంది. నగర వాసులు పెద్ద సంఖ్యలో పుష్కరాలకు తరలి వెళ్తున్నారు. గురువారం రాఖీ పౌర్ణమి, సెలవు దినం కావడంతో బుధవారం సాయంత్రమే పెద్ద సంఖ్యలో నగర వాసులు వివిధ ప్రాంతాల్లో పుష్కర స్నానాల కోసం బయలుదేరారు. విజయవాడ, గుంటూరు, కాకినాడ, గద్వాల తదితర ప్రాంతాలకు ప్రతి రోజు రాకపోకలు సాగించే 40 రెగ్యులర్ రైళ్లతో పాటు 15 ప్రత్యేక రైళ్లు బుధవారం వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేçÙన్‌ల నుంచి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు తరలారు.
సాధారణ రోజుల్లో 2.5 లక్షల మంది రాకపోకలు సాగిస్తుండగా బుధవారం ఆ సంఖ్య 3 లక్షలకు చేరుకుంది. గుంటూరు, విజయవాడల మీదుగా వెళ్లే రైళ్లన్నీ కిక్కిరిసాయి. రిజర్వుడ్, అన్‌రిజర్వుడ్ బోగీలన్నీ ప్రయాణికులతో కిటకిటలాడాయి. కాచిగూడ–గద్వాల మధ్య నడిచే రైళ్లలోనూ భారీ రద్దీ నెలకొంది. రిజర్వుడ్ బోగీల్లో బెర్తులు లభించని వాళ్లు జనరల్ బోగీల్లో బయలుదేరారు. దీంతో సాధారణ బోగీలు సైతం పరిమితికి మించిన ప్రయాణికులతో నిండిపోయాయి.
పలు ప్రాంతాలకు 100 ప్రత్యేక బస్సులు
ఆర్టీసీ బస్సుల్లోనూ రద్దీ కనిపించింది. బుధవారం వివిధ ప్రాంతాలకు 100 బస్సులు అదనంగా నడిపారు. వివిధ ప్రాంతాలకు రెగ్యులర్‌గా రాకపోకలు సాగించే 1500 ఎక్స్‌ప్రెస్, సూపర్‌లగ్జరీ, ఏసీ బస్సులకు ఇవి అదనం. నాగార్జునసాగర్, బీచుపల్లి, శ్రీశైలం ఘాట్‌లకు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. విజయవాడ వైపు వెళ్లే 93 రెగ్యులర్ బస్సులు ప్రయాణికులతో నిండిపోయాయి.