దేశ రక్షణకు ప్రాణాలను సైతం లెక్క చేయక పోరాడే వీర సైనికులలో వున్నది ఈ మనోబలమే! శత్రువులు మూకుమ్మడిగా చుట్టూముట్టినా, శరీరాన్ని ఛిద్రం చేస్తున్నా ప్రతిఘటించాలన్న కాంక్షవారికుండటానికి కారణం అబ్బురపరిచే వారి మానసిక స్థైర్యమే.
కష్టాలు ఒక్కసారిగా చుట్టిముట్టినప్పుడు మనిషి నిబ్బరంగా ఉండగలగటమే ధీరత్వం అంటే! క్లిష్ట పరిస్థితులలో నిరాశ, నిస్పృహలు ఆవరిస్తాయి. ఆశ సన్నగిల్లుతుంది. మనసు నిలకడను కోల్పోతుంది. ఏదో తెలియని భీతి మనసులో తిష్ఠ వేస్తుంది. దాంతో కుంగిపోతాడు. మానసిక ప్రశాంతతకు దూరమవుతాడు. ఆశాæకిరణం కనుచూపు మేరలో లేదని, తను ఈ గడ్డుకాలం నుంచి బైట పడలేననే భయం ఏర్పడుతుంది. తన జీవితాన్ని అర్ధంతరం గా ముగించే ప్రయత్నం కూడా చేస్తాడు. ఈ కరోనా కష్ట కాలంలో మనలో చాలామంది ఈ స్థితిలోనే ఉన్నాం.
శారీరక వ్యాయామం వల్ల శరీరం మాత్రమే దృఢమవుతుంది. కాని ప్రశాంతతకు దూరమైన మనసు బలహీనమవుతుంది. అది మన లోని శక్తిని నీరుకారుస్తుంది. అసహనంతో అకారణమైన, అసమంజసమైన కోపాన్ని కుటుంబ సభ్యుల మీద చూపి, వారి ప్రేమకు దూరమయేలా చేస్తుంది. వారిది కూడ తనలాంటి మానసిక స్థితేనా? అన్న ఆలోచన, విచక్షణ వివేచనలు కోల్పోయిన మనసుకు తోచదు. అది తన కుటుంబానికే కాక సమాజానికి, దేశానికి చేటు చేస్తుంది. మరెలా దీన్ని అధిగమించాలి? ఓర్పుతో మాత్రమే దీన్ని అలవరుచుకోవాలి. ఓర్పే నేటి గడ్డు కాలంలో గొప్ప రక్షణ కవచం.
‘దుర్దశే మనిషి వ్యక్తిత్వానికి గీటురాయి ‘ అన్నాడు ప్రపంచ విఖ్యాత నాటకకర్త షేక్సి్పయర్. అదే మనిషిలోని ధీ శక్తిని వెలికి తీసే అవసరాన్ని, అవకాశాన్ని కల్పిస్తుంది. మనిషి వ్యక్తిత్వానికి పరీక్ష పెట్టే కష్టాలు, అననుకూలతలు ఏర్పడినప్పుడు మనిషి కి మనోబలం అవసరం. మనోబలమున్న ధీరులలో స్వీయ క్రమశిక్షణ, స్వీయ ఆదేశాలు, ఆచరణ అంతర్వాహినిగా ఉంటాయి. మనోబలం వల్ల ఈ కష్టాల ఊబి నుండి బైట పడగలిగే శక్తి చేకూరుతుంది. సాధారణంగా మనోబలం కలవారు తక్కువ మాట్లాడతారు. ఎక్కువ పని చేస్తారు.
కొందరయితే మౌనంగా, గంభీరంగా వుంటారు. నిరంతరం కార్యనిర్వహణలో నిమగ్నమై వుంటారు. ఎంత మనోబలం వున్నా బాగా శ్రమించి పనిచేస్తేనే ఆశించిన ఫలితం దక్కుతుంది. మనం కూడా మంచి ఆలోచనలతో, పట్టుదలతో కృషి చేయాలి. మానసికంగా బలంగా వున్నప్పుడు, శారీరకంగా శక్తిమంతుడు కాకపోయినా ఏమైనా చేయగలనన్న ధీమా ఉంటుంది. ఎవరినైనా, దేన్నైనా ఎదుర్కొనే సంసిద్ధత వస్తుంది.
ఆ మానసిక సంసిద్ధతే నేడు కావలసింది. దానిని అందరూ అలవరచుకుంటూ, పెంచుకుంటూ మానసికంగా బలోపేతులు కావాలి. ఎవరు కాలం కంటే ముందు పరుగులు తీయగలరో, ఎవరు సంకల్పంతో కాల పరిధుల్ని, అవధుల్ని అధిగమించగలరో వారే విజేతలు. పరిమిత జీవిత కాలంలో అపరిమిత కృషితో అద్భుత ఫలితాలు సొంతం చేసుకున్నవారే కాలాతీతవ్యక్తులు. వారే శాస్త్రజ్ఞులు, సంస్కర్తలు, దేశభక్తులు, త్యాగమూర్తులు, దేశరక్షణలో ప్రాణత్యాగాలు చేసే పరమ యోధులు. మన కృషి తీవ్రతను బట్టి గమ్యం సమీపమో, సుదూరమో నిర్ణయమవుతుంది. సమీప గమ్యమే మన లక్ష్యమైనపుడు సంకల్పబలం దాన్ని తప్పకుండా సుసాధ్యం చేస్తుంది. మనోబలం అందుకు దన్నుగా నిలుస్తుంది.
సమాజాన్ని పట్టి పీడిస్తున్న దురాచారాలను రూపుమాపటానికి, అభ్యుదయ మార్గంలో సమాజాన్ని నడిపించటానికి రాజా రామమోహన రాయ్, కందుకూరి వీరేశలింగం, జ్యోతి రావు ఫూలే వంటి అనేక మంది సంస్కర్తలు తమ జీవితాన్ని సమాజం కోసం ధార పోశారు. సమాజం నుంచి ఎన్నో ప్రతికూలతలు, అవమానాలు, బెదిరింపులు ఎదుర్కొన్నారు. అయినా, మొక్కవోని మనోబలంతో అనుకున్న లక్ష్యాలను సాధించారు.
ఈ తరం న్యూటన్‌గా ప్రపంచం కొనియాడిన స్టీఫెన్ విలియం హాకింగ్స్ నరాలకు సంబంధించిన వ్యాధి పీడితుడై, శరీరం చచ్చుబడినా, తన అమోఘమైన మేధస్సుతో అనేక పరిశోధనలు, ఆవిష్కరణలు చేసాడు. మనోబలానికి ఇంతకన్నా నిలువెత్తు నిదర్శనం ఏముంటుంది?
దేశ రక్షణకు ప్రాణాలను సైతం లెక్క చేయక పోరాడే వీర సైనికులలో వున్నది ఈ మనోబలమే! శత్రువులు మూకుమ్మడిగా చుట్టూముట్టినా, శరీరాన్ని ఛిద్రం చేస్తున్నా ప్రతిఘటించాలన్న కాంక్ష వారికుండటానికి కారణం అబ్బురపరిచే వారి మానసిక స్థైర్యమే.
అనేక ప్రకృతి వెపరీత్యాలకు, మానవ ప్రేరిత విధ్వంసాలకు, ప్రజ అతలాకుతలమైంది. కాని, గుండె దిటవు చేసుకుంటూ తునాతునకలైన ఆశను మనోబలంతో ప్రోది చేసుకుంటూ ఎప్పటికప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తూనే ఉంది. ఇన్ని విపత్తులను దాటటానికి మనోబలమే కారణం. మనోబలమే మనిషికి నిజమైన శక్తి!
ప్రస్తుత కాలంలో జనాన్ని వణికిస్తూ, భయభ్రాంతులను చేస్తున్న కరోనాను సులభంగా జయించటానికి అవసరమైనది ఈ మనోబలమే! కాబట్టి మనోబలాన్ని రక్షణ కవచంగా చేసుకుని ధైర్యంగా ముందుకు వెళదాం. కరోనా మహమ్మారి బారిన పడకుండా కాపాడుకుందాం.
– బొడ్డపాటి చంద్రశేఖర్
Comments
Please login to add a commentAdd a comment