సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాల్లో మహిళా బీఎల్‌వో (బూత్ లెవల్ ఆఫీసర్లు)లు కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గురువారం లోక్‌సభ ఎన్నికల పోలింగ్ విధుల్లో బీఎల్‌వోలకు సరైన సౌకర్యాలు లేక, మండుటెండలో విలవిలలాడాల్సిన పరిస్థితి ఎదురైంది. పలు చోట్ల కూర్చోవడానికి సరిపడా కుర్చీలు, తాగడానికి నీరు కూడా లేక ఇబ్బందులు పడ్డారు. కొన్ని జిల్లాల్లో చెట్ల నీడలు, గోడల పక్కన కూర్చుని విధులు నిర్వర్తించుకోవాల్సిన దుస్థితి ఎదురైంది. వీరికి కనీస సదుపాయాలు కల్పించాల్సిన జిల్లా ఎన్నికల యంత్రాంగం అవేమీ పట్టనట్లు వ్యవహరించిందని పలువురు బీఎల్‌వోలు ఆవేదన చెందారు.
హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, భూపాలపల్లి, జనగాం జిల్లాల్లో సరైన వసతుల్లేక బీఎల్‌వోలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వీటికి తోడు ఏజెంట్ల బెదిరింపులు, ఓటరు స్లిప్పుల పంపిణీలో తప్పిదాలతో నానా చీవాట్లు పడాల్సిన పరిస్థితి తలెత్తింది. హైదరాబాద్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో కమలమ్మ అనే అటెండర్ స్పృహ తప్పి పడిపోయింది. ఇలాంటి ఘటనలు పోలింగ్ సమయంలో తరచూ జరుగుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని వాపోతున్నారు.
అంగన్‌వాడీలే అధికం..
బీఎల్‌వో డ్యూటీ చేసే వాళ్లలో 80 శాతం అంగన్‌వాడీ కార్యకర్తలే ఉండగా మిగిలిన 20 శాతం ఆశ కార్యకర్తలు, సాక్షరభారత్, రెవెన్యూ అధికారులు ఉన్నారు. చాలీ చాలని జీతాలతో పగలనక రాత్రనక కష్టపడి పనిచేసినా అధికారుల నుంచి, ఓటర్ల నుంచి చీవాట్లు తప్పడం లేదని వాపోతున్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు డోర్ టు డోర్ సర్వే చేసే సమయంలో రాజకీయ నాయకులు పార్టీలకు ప్రచారం చేస్తున్నారా అంటూ వేధింపులకు పాల్పడుతున్నారని, అలాగే ప్రతి సంవత్సరం బీఎల్‌వోలకు రావాల్సిన రెమ్యునరేషన్ ఏడు వేల రూపాయలను కూడా ఆర్డీవో స్థాయి అధికారులు చెల్లించకుండా వేధిస్తున్నారని, ప్రశ్నించిన వారిని సస్పెండ్ చేస్తామని అధికారులు బెదిరిస్తున్నారని ఇలా పలు సమస్యలతో సతమతమవుతున్నట్లు పలువురు ఆవేదన చెందుతున్నారు. గతేడాది బీఎల్‌వో రెమ్యునరేషన్ విషయమై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లడంతో 2017 సంవత్సరం రెమ్యునరేషన్ మాత్రమే చెల్లించారని, అది కూడా పూర్తి స్థాయిలో అన్ని జిల్లాల బీఎల్‌లోలకు అందడం లేదని వాపోతున్నారు.
నో వాటర్, నో టిఫిన్..
మండుటెండలో విధులు నిర్వర్తిస్తున్న బీఎల్‌వోలలో కొంతమంది దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాగునీరు కూడా లేక ఉదయం 7 గంటల నుంచి విధుల్లో ఉన్న బీఎల్‌వోలకు కనీసం టిఫిన్ కూడా ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డట్లు పలువురు బీఎల్‌వోలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఎల్‌వోల విధులు..
►ఓటరు స్లిప్పులు అందించడం
►కొత్త ఓటర్లను నమోదు చేయడం
►డోర్ టు డోర్ సర్వే చేయడం
►ఓటరు కార్డులో ఏవైనా తప్పులుంటే 8సీ ఫామ్ సంబంధిత తహసీల్దార్‌కి అందించడం
పట్టించుకునేవారు లేరు..
బీఎల్‌వో డ్యూటీ చేసే అంగన్‌వాడీ కార్యకర్తల్లో వయసు పైబడిన వారు పోలింగ్ కేంద్రాల్లో వసతుల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహిళలనే కనీస గౌరవం కూడా లేకుండా ఏజెంట్ల బెదిరింపులు, రాజకీయనాయకులు ఒత్తిళ్లకు గురిచేస్తున్నారు. ఏటా ఇవ్వాల్సిన రూ.7 వేలు కూడా చెల్లించకుండా అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయంపై ఎన్నికల అధికారులు దృష్టి సారించి మా సమస్యలు పరిష్కరించాలి.
భిక్షపమ్మ, అంగన్‌వాడీ టీచర్స్ అండ్
హెల్పర్స్ స్టేట్ ప్రెసిడెంట్
Comments
Please login to add a commentAdd a comment