జనాదేశం శిరోధార్యం | Editorial On Overview Of Elections 2019 And Counting | Sakshi
Sakshi News home page

జనాదేశం శిరోధార్యం

Published Thu, May 23 2019 2:32 AM | Last Updated on Thu, Jul 11 2019 8:26 PM

Editorial On Overview Of Elections 2019 And Counting - Sakshi

ఈసారి సార్వత్రిక ఎన్నికలలో ప్రచారం జరిగినంత భీకరంగా, అనాగరికంగా, అరాచకంగా, అడ్డ గోలుగా మునుపెన్నడూ జరగలేదు. ప్రజల సమస్యలపైన చర్చించకుండా, ఐదేళ్ళలో ప్రభుత్వ సాఫల్యవైఫల్యాలను సమీక్షించకుండా మతంపైనా, కులంపైనా, పాకిస్తాన్‌పైనా, సరిహద్దు యుద్ధం పైనా, రఫేల్‌ యుద్ధవిమానాలపైనా ఆరోపణలూ, ప్రత్యారోపణలతో ప్రచారపర్వం ప్రచండ మారుతం వలె సాగింది. రాజకీయ ఉష్ణోగ్రతలు తారస్థాయికి చేరుకున్నాయి. నైతిక విలువలు పాతాళానికి దిగజారాయి.  ప్రధాన పక్షాలైన బీజేపీ, కాంగ్రెస్‌లు సర్వశక్తులూ ఒడ్డి చావోరేవో అన్న విధంగా ప్రచారం చేశాయి. ఈ ఎన్నికలను అధ్యక్ష తరహా ఎన్నికలుగా మార్చడంలో బీజేపీ విజయం సాధించింది. ప్రధాని నరేంద్రమోదీకి అనుకూలమా, వ్యతిరేకమా అన్నట్టు ఒక రెఫ రెండం మాదిరి జరిగిన ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెల్లడి కానున్నాయి. మొదటి దశ పోలింగ్‌ ఏప్రిల్‌ 11న జరిగితే ఏడవ, తుది దశ పోలింగ్‌ మే 19న నిర్వహించారు. ఫలితాల కోసం 42 రోజుల నిరీక్షణ నేటితో ముగుస్తున్నది. ఎగ్జిట్‌పోల్స్‌ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో వెల్లడించినప్పటికీ ఓట్లు లెక్కపెట్టేవరకూ ఓటమిని అంగీకరించేందుకు ఎవ్వరూ సిద్ధంగా లేరు. 

యుద్ధంలో, ప్రేమలో ఏదైనా చెల్లుబాటు అవుతుందంటారు. ఎన్నికల పోరాటంలోనూ మాటల ఈటెలు ప్రత్యర్థులను వేధించడం సహజం. ఒక వైపు ఎన్నికల సంఘం, మరో వైపు సర్వో న్నత న్యాయస్థానం హద్దులు చూపుతున్నప్పటికీ ఎన్నికల పూనకంలో నాయకులు సకల మర్యాద లనూ మంటగలిపారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఈవీఎం)పైన 22 ప్రతిపక్షాలు దాడి చేయడం, సుప్రీంకోర్టు హితవు చెప్పినా వినకుండా ఎన్నికల సంఘానికి పదేపదే వినతిపత్రాలను సమర్పించడం ప్రహసనసదృశంగా సాగింది. ఓడినవారూ, ఓడిపోతామని భయపడేవారు మాత్రమే ఈవీఎంలను తప్పుపడతారనీ, విజేతలు ఈవీఎంల గురించి ఫిర్యాదు చేయరని అనడానికీ ఢిల్లీలో మొన్నటి వరకూ జరిగిన రభసే కారణం. ఈవీఎంలతో పాటు వీవీప్యాట్స్‌ (స్లిప్పుల)ను కూడా లెక్కించాలంటూ ప్రతిపక్షాలు చేసిన వాదనను సుప్రీంకోర్టు, ఈసీ తిరస్కరించాయి. 2014లో ఇదే ఈవీఎంల పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. 

నిరుడు రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలలో గెలుపొంది ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ ఈవీఎంలపైన ఫిర్యాదు చేయలేదు. ఈసారి ఓటమి అనివార్యమని ముందే తెలుసుకున్న చంద్రబాబు అదే పనిగా జాతీయ స్థాయి ప్రతిపక్ష నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేసి ఈవీఎంలను ఒక భయంకర సమ స్యగా భూతద్దంలో చూపించి హడావుడి చేశారు. ఓడిపోతామని ముందే తెలుసుకున్నవారు ఈవీ ఎంలతోపాటు ఎగ్జిట్‌పోల్స్‌ని కూడా విశ్వసించరు. గెలిచినప్పుడు ఈవీఎంలను ఒప్పుకుంటూ, ఓడినప్పుడు వాటిని తప్పుపడుతూ మాట్లాడే రాజకీయ నాయకుల అభిప్రాయాలకు విలువ ఇవ్వ నక్కరలేదు. 50 శాతం వీవీప్యాట్స్‌ను లెక్కించాలంటూ అర్థం లేని డిమాండ్లు పెట్టిన ప్రతిపక్షాల ప్రతిపాదనలను ఎన్నికల సంఘం తిరస్కరించడం ముమ్మాటికీ సమంజసమే. 

ఎన్నికల సంఘంలో ముగ్గురు సభ్యులు ఉంటారనీ, ముగ్గురికీ సమానాధికారాలు ఉంటాయనీ, మెజారిటీ ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలనీ రాజ్యాంగంలోని 324 అధికరణలోని రెండో క్లాజ్‌ స్పష్టం చేస్తున్నది. ఈ ఎన్నికలలో ఎన్నికల సంఘం సభ్యులకు కొన్ని అంశాలపైన ఏకాభిప్రాయం లేదని వెల్లడైంది. ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో మోదీ నియమావళికి విరుద్ధంగా మాట్లాడా రంటూ కాంగ్రెస్‌పార్టీ చేసిన ఫిర్యాదును కొట్టివేస్తూ ప్రధానికి ‘క్లీన్‌చిట్‌’ ఇవ్వడాన్ని ఎన్నికల కమిష నర్‌ అశోక్‌ లావాసా వ్యతిరేకించారు. తన అభ్యంతరాలను నమోదు చేయాలనీ, బహిర్గతం చేయా లని లావాసా పట్టుపడుతున్నారు. బహిర్గతం చేయనవసరం లేదని చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ సునీల్‌ అరోరా అనడం వివాదాస్పదమైంది. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించవలసిన ఎన్నికల సంఘం దాపరికం పాటించడంలో అర్థం లేదు. నియమావళిని ఉల్లంఘించిన రాజకీయ నేతలు ఒకటి, రెండు, మూడు రోజులపాటు ప్రచారంలో పాల్గొనరాదంటూ ఎన్నికల సంఘం శిక్షాత్మక చర్యలు తీసుకోవడం ఇదే ప్రథమం. ఇందుకు సుప్రీంకోర్టు దన్ను ఉంది. ఎన్నికల సంఘం క్రమంగా రూపుదిద్దుకుంటున్న సంస్థ. 

నిష్పక్షపాతంగా, న్యాయంగా, ధర్మంగా ఎన్నికలు నిర్వహించడమే కాకుండా సూత్రబద్ధంగా నిర్వహిస్తున్నట్టు ప్రజలకు విశ్వాసం కలిగించడమే ఈ  సంఘం కర్తవ్యం. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ అత్యంత ప్రధానమైనది. ఈ వ్యవస్థపైన ప్రజలు విశ్వాసం కోల్పోతే భారత ప్రజాస్వామ్య దుర్గం బీటలువారుతుంది. ఎన్నికల ప్రచారంలో పెడ ధోరణులు ప్రబలి మతసామరస్యానికీ, సౌభ్రాతృత్వానికీ, సంస్కారానికీ భంగం కలిగే విధంగా రాజకీయ నాయకుల ప్రసంగాలు సాగాయి. ఎన్నికలలో ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా గెలుపోటములను సమభావంతో స్వీకరించాలనీ, ఆటలో అరటి పండుగా పరిగణించాలనీ, ఎన్నికలలో పాల్గొనడమే ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడమనే స్ఫూర్తితో వ్యవహరించాలనీ అందరూ గ్రహిం చాలి. 

రాజీవ్‌గాంధీ అత్యంత అవినీతిపరుడుగా తనువు చాలించాడు అని ఎన్నికల ప్రచారంలో ధ్వజమెత్తిన మోదీ రాజీవ్‌ 27వ వర్ధంతి సందర్భంగా మాజీ ప్రధానికి నివాళులు చెప్పడం సంస్కారం అనిపించుకుంటుంది. కానీ, కాస్త కృతకంగా కూడా కనిపిస్తుంది. అందుకే ఉన్నత పదవులలో ఉన్నవారు ఆచితూచి మాట్లాడాలి. దివంగత నాయకులపైన ఆరోపణలు చేయడం సరికాదు. ఎన్నికల ప్రక్రియ ఆఖరి ఘట్టంలో ప్రవేశించిన కారణంగా ఎన్నికల ప్రచారంలో సృష్టిం చిన విభేదాలను తొలగించడానికీ, అగాధాలను పూడ్చడానికీ రాజకీయ పార్టీలన్నీ శక్తివంచన లేకుండా ప్రయత్నించాలి. భారతదేశ సమైక్యతకూ, సమగ్రతకూ భంగం కలిగించే ధోరణులను విడ నాడాలి. వైషమ్యాలకు స్వస్తి చెప్పాలి. ప్రజలతీర్పును అన్ని పార్టీలూ శిరసావహించాలి. ప్రజలు నిర్దేశించిన పాత్రను రాజకీయ నాయకులు వినమ్రంగా పోషించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement