కొచ్చి/త్రిసూర్: కేంద్రంలో ఎవరు అధికారంలో ఉండాలో నిర్దేశించే శక్తి కేరళకు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాష్ట్రంలో ఓటర్ల మనసులు గెల్చుకోవాలని బీజేపీ నేతలు, కార్యకర్తలకు సూచించారు. కేరళ అసెంబ్లీలో పాగా వేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన మంగళవారం సాయంత్రం కేరళకు చేరుకున్నారు.
రెండు రోజు బుధవారం కొచ్చీ నగరంలో బీజేపీ ‘శక్తి కేంద్రాల’ ఇన్‌చార్జీలతో మోదీ సమావేశమయ్యారు. రెండు నుంచి మూడు పోలింగ్ బూత్‌లను కలిసి ఒక్కో శక్తి కేంద్రంగా పరిగణిస్తారు. మోదీతో భేటీకి దాదాపు 6,000 మంది ఇన్‌చార్జీలు హాజరయ్యారు. బూత్ స్థాయిలో విజయం సాధిస్తే కేరళలో గెలుపు మనదేనని నిర్దేశించారు. ఎవరి బూత్‌ల్లో వారు గెలుపు కోసం కష్టపడి పనిచేయాలని చెప్పారు.
ఇళ్లలో ‘రామజ్యోతి’ వెలిగించండి
దేశంలో వేగవంతమైన అభివృద్ధి, భవిష్యత్తు పట్ల స్పష్టమైన విజన్ ఉన్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఈ విషయం ఇప్పటికే నిరూపితమైందని అన్నారు. బీజేపీ వైపు యువతను ఆకర్శించాలని, ఇందుకోసం ‘మై భారత్’ కార్యక్రమం, నమో యాప్‌తోపాటు సోషల్ మీడియా వేదికలను ఉపయోగించుకోవాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రచారం కల్పించాలన్నారు.
పార్టీ పట్ల సానుకూలతను వ్యాప్తి చేయాలన్నారు. ఈ నెల 22న అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా అన్ని చోట్లా ఆలయాలను శుభ్రం చేయాలని బీజేపీ శ్రేణులను నరేంద్ర మోదీ కోరారు. 22న సాయంత్రం ఇళ్లల్లో ‘రామజ్యోతి’ వెలిగించాలని, ఈ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములయ్యేలా చర్యలు తీసుకోవాలని వివరించారు.
గురువాయూర్ ఆలయంలో మోదీ పూజలు
కేరళలో ప్రసిద్ధి చెందిన గురువాయూర్ శ్రీకృష్ణ మందిరంలో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. సంప్రదాయ ముండు(ధోతీ), తెల్లరంగు శాలువా ధరించి, స్వామివారిని దర్శించుకున్నారు. ప్రతి భారతీయుడు సంతోషంగా ఉండాలని, సౌభాగ్యంతో విలసిల్లాలని గురువాయుర్ శ్రీకృష్ణుడిని ప్రారి్థంచానని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆలయ సందర్శన ఫొటోను ‘ఎక్స్’లో పోస్టుచేశారు.
అనంతరం గురువాయూర్ ఆలయంలో ప్రముఖ మలయాళ సినీ నటుడు, బీజేపీ నేత సురేశ్ గోపీ కుమార్తె వివాహానికి మోదీ హాజరయ్యారు. నూతన దంపతులకు మోదీ స్వయంగా పూల మాలలు అందించారు. వారిద్దరి చేతులను కలిపి ఆశీర్వదించారు. కొత్త దంపతులు మోదీకి పాదాభివందనం చేశారు.
ఈ పెళ్లి వేడుకకు హాజరైన సినీ నటులు మమ్ముట్టీ, మోహన్‌లాల్, జయరాం, దిలీప్, ఖుష్బూతో మోదీ విడివిడిగా మాట్లాడారు. ఇదే ఆలయంలో వివాహం చేసుకున్న జంటలను సైతం మోదీ అక్షింతలు వేసి ఆశీర్వదించారు. వారికి మిఠాయిలు బహూకరించారు. ఆ తర్వాత త్రిసూర్ జిల్లాలోని త్రిప్రయార్‌లో శ్రీరామస్వామి ఆలయంలో ప్రధానమంత్రి పూజలు చేశారు. అనంతరం కొచ్చికి బయలుదేరి వెళ్లారు. కొచ్చీ సిటీలో భారీ రోడ్ షోలో పాల్గొన్నారు.
రూ.4,000 కోట్ల ప్రాజెక్టులు అంకితం
అంతర్జాతీయ వాణిజ్యంలో భారతదేశ శక్తిసామర్థ్యాలను, స్థానాన్ని ప్రపంచ దేశాలు గుర్తించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తక్కువ సమయంలో నౌకల రాకపోకల విషయంలో పలు అభివృద్ధి చెందిన దేశాలను సైతం మనం అధిగమించామని చెప్పా రు. బుధవారం కేరళలోని కొచ్చీ సిటీలో రూ.4,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను మోదీ జాతికి అంకితం చేశారు. వీటిలో ప్రతిష్టాత్మకమైన కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ కూడా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment