భద్రతకే మా ఓటు! | Momspresso Survey Over Women Voters Priorities In India | Sakshi
Sakshi News home page

భద్రతకే మా ఓటు!

Published Wed, May 8 2019 1:22 AM | Last Updated on Wed, May 8 2019 5:03 AM

Momspresso Survey Over Women Voters Priorities In India - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఒక ఇంట్లో ఉన్న భార్యాభర్తలిద్దరి ఓట్లు ఒకే పార్టీకి పడతాయా? పురుషాధిక్య భారతీయ సమాజంలో భర్త చెప్పిన వ్యక్తి లేదా పార్టీకి భార్య ఓటేస్తుందా? లేదంటే స్నేహితులు, కుటుంబ సభ్యుల ప్రభావానికి లోనై ఆమె ఓటేసే విషయంలో నిర్ణయం తీసుకుంటుందా? అంటే కాదని చెపుతోంది ఓ సర్వే. దేశంలోని 70%మంది మాతృమూర్తులు ఓటేసే విషయంలో ఇతరుల ప్రభావానికి లోనుకాకుండానే నిర్ణయం తీసుకుంటారని.. వారి మనసులో ఉన్న అంశాల ఆధారంగా స్వతంత్రంగా ఆలోచిస్తారని తేలింది. అది కూడా తమతో పాటు తమ చిన్నారుల రక్షణకే వారు ప్రాధాన్యత ఇస్తారని, ఈ రెండు అంశాల్లో ప్రాధాన్యత ఇచ్చి పనిచేసిన వ్యక్తులు లేదా పార్టీలకే ఓట్లు వేస్తారని తేలింది.

2019 సాధారణ ఎన్నికల సందర్భంగా ‘మామ్స్‌ ప్రెస్సో’అనే ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. సర్వేలో భాగంగా కనీసం ఓ చిన్నారికి జన్మనిచ్చిన 1,317 మంది తల్లుల (దేశవ్యాప్తంగా) అభిప్రాయాలను ఇటీవల ఆ సంస్థ సేకరించింది. ఇందులో 33.7% మంది పనిచేసే మహిళలు కాగా, 66.3% గృహిణులున్నారని తన నివేదికలో వెల్లడించింది. హైదరాబాద్‌తో పాటు అహ్మదాబాద్, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, ఢిల్లీ, జైపూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, పాట్నా, పుణే లాంటి నగరాల్లో ఈ సర్వే నిర్వహించామని తెలిపింది. ఈ సర్వేలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మహిళల భద్రతతో పాటు పిల్లల చదువులు, పరిసరాల పరిశుభ్రతను మాతృమూర్తులు పరిగణనలోకి తీసుకుంటారని తన నివేదికలో ఆ సంస్థ వెల్లడించింది.


మగువ మాట ఇది... 

ఓటువేయడంతోపాటు, మిగిలిన విషయాల్లోనూ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడంలో తూర్పు భారత మహిళలు 91%తో ముందున్నారు. 
ఖరీదవుతున్న ప్రాథమిక విద్య విషయాన్నీ మహిళలు ప్రధానంగా ప్రస్తావించారు. 
బహిరంగ ప్రదేశాల్లో పిల్లలకు పాలిచ్చే సౌకర్యాలు కల్పించాలని నేటి మహిళలు కోరుతున్నారు. 
హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, పుణే, పట్నా, అహ్మదాబాద్, భువనేశ్వర్‌ నగరాల్లో సర్వే జరిగింది.

సర్వే నివేదికలోని ముఖ్యాంశాలివి

  • 2019 సాధారణ ఎన్నికల్లో తాము ఓటేయాలనుకుంటున్నామని 96% మంది తల్లులు చెప్పారు.  
  • దేశంలోని 70% శాతం మంది మహిళలు తాము ఎవరికి ఓటేయాలనేదానిపై స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మేమెవరినీ అడగమని 71%మంది చెప్పగా, స్నేహితులు, బంధుమిత్రుల సలహాలు తీసుకుంటామని 20%, న్యూస్‌చానెళ్లు, సోషల్‌మీడియా ద్వారా నిర్ణయం తీసుకుంటామని 15% మంది, రాజకీయ నాయకులు చెప్పే మాటల ద్వారా ఓటేయాలని నిర్ణయించు కుంటామని 7% మంది చెప్పారు. 
  • ఈశాన్యభారతంలోని ప్రతి 10 మంది తల్లుల్లో 9 మంది ఎవరికి ఓటేయాలనేదానిపై స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటారు. అదే జైపూర్‌ నగరంలోని మహిళల్లో ప్రతి 10 మందిలో 8 మంది సన్నిహితులు, కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. 
  • 40% మంది బెంగళూరు, ముంబై మహిళలు మీడియా ద్వారా ప్రభావితం అవుతామని చెప్పగా, 30% మంది చెన్నై తల్లులు కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.  
  • మెట్రో నగరాల్లో నివసిస్తున్న తల్లుల్లో 22% మంది మీడియా ప్రభావానికి గురవుతున్నారు. 28% మంది నాన్‌మెట్రో మహిళలు వారి స్నేహితులు, బంధుమిత్రులతో చర్చించడం ద్వారా ఓటు ఎవరికి వేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటున్నారు. 
  • 47% మంది ఢిల్లీ, 40% మంది ముంబై తల్లులు కాలుష్యం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. 60% మంది కోల్‌కతా, 37% మంది చెన్నై తల్లులు పరిసరాల పరిశుభ్రతపై తీసుకుంటున్న చర్యలు బాగాలేవంటున్నారు. 
  • మెట్రో నగరాల్లో నివసిస్తున్న తల్లుల్లో 32% మంది కాలుష్యం గురించి ఆందోళన వ్యక్తం చేయగా, నాన్‌మెట్రో నగరాల్లోని మహిళల్లో 42% మంది విద్య గురించి ఆలోచిస్తున్నారు. 
  • 85% మంది మహిళలు ప్రాథమిక విద్య విషయంలో ఖర్చు బాగా పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 


హైదరాబాద్‌ తల్లుల అభిప్రాయాలివీ 

  • 40% మంది హైదరాబాద్‌ తల్లులు అవినీతిని కూడా పరిగణనలోకి తీసుకుంటారు 
  • వీరి ముఖ్య ప్రాధాన్యతాంశాల్లో పరిసరాల పరిశుభ్రత (91%), వారి చిన్నారుల భద్రత (91%), ప్రాథమిక విద్య (90%) ఉన్నాయి  
  • వాయు, ఆహార కాలుష్యాలు తమ చిన్నారుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయనే ఆందోళన ప్రతి హైదరాబాదీ మహిళలో వ్యక్తమవుతోంది 
  • నవజాత శిశువుల తల్లుల విషయానికి వస్తే బహిరంగ ప్రదేశాల్లో చిన్నారులకు పాలిచ్చే అనుకూలతలను కల్పించాలని, పెద్ద కంపెనీల్లో శిశువులకు డే కేర్‌ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు 

ఓటేసే విషయంలో దేశంలోని నాలుగు ప్రాంతాల మహిళల అభిప్రాయాలు ఇలా..



 

చిన్నారుల భవిష్యత్తు కోసం తల్లులు కోరుకుంటున్నది 
ఎక్కువ ఆసుపత్రులు కావాలి- 82%
ఎక్కువ పాఠశాలలు కావాలి- 81%
క్రీడా సౌకర్యాలు కల్పించాలి-  79%
మరిన్ని క్రీడా మైదానాలు కావాలి- 78%

మామ్స్‌ మేనిఫెస్టో దేశం ముందుంచాలనే.. 
‘దేశంలో మహిళల జీవనంపై ప్రభావితం చూపే అంశాలు పార్టీల మేనిఫెస్టోల్లో.. మన చుట్టూ జరుగుతున్న చర్చల్లో కనిపించడం లేదని మేం బలంగా విశ్వసించాం. మాతృమూర్తులకు సంబంధించిన విశాల వేదికగా వారి వాయిస్‌ను వినిపించడం కోసం ‘మామ్స్‌ మేనిఫెస్టో’ను దేశం ముందు ఉంచాలనుకున్నాం. దేశ ప్రగతికి ఈ అంశం కీలకమే. ఈ సర్వే ద్వారా తల్లుల అభిప్రాయాలను తెరమీదకు తీసుకువచ్చాం. ఇప్పుడైనా దేశంలోని తల్లుల మనోభావాలు, వారి నిజమైన ఆకాంక్షలు అధికార పీఠం ఎక్కేవారికి చేరుతాయనుకుంటున్నాం’ – విశాల్‌గుప్తా, మామ్స్‌ప్రెస్సో సహ వ్యవస్థాపకుడు, సీఈవో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement