నల్గొండ: ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్లు కీలకంగా మారనున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళల ఓట్లే అధికంగా ఉన్నాయి. నాలుగునియోజకవర్గాల్లో మాత్రం పురుషుల ఓట్ల సంఖ్య కొద్దిగా ఎక్కువ ఉంది. ఎన్నికల్లో గెలుపోటములను, పార్టీల భవిష్యత్తును ప్రభావితం చేసే శక్తి మహిళలకే ఉండటంతో అన్ని రాజకీయ పార్టీలు వారి ఓట్లను రాబట్టుకునే ప్రయత్నాల్లో పడ్డాయి.
ఉమ్మడి జిల్లాలో మహిళల ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. 12 నియోజకవర్గాల్లో మొత్తం 28,29,357 మంది ఓటర్లలో పురుషులు 14,04,111 మంది, మహిళా ఓటర్లు 14,25,071 మంది ఉన్నారు. ఇక ట్రాన్స్‌జెండర్లు 195 మంది ఉన్నారు.
ఇంట్లో ఓట్లను కూడా మహిళలు ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో వారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో అన్ని రాజకీయ పార్టీలు నిమగ్నమయ్యాయి. మహిళా ఓటర్లలో సైలెంట్ ఓటింగ్ ఎక్కువగా ఉండనుండటంతో వారిని ఆకట్టుకునేలా ప్రసంగాలు, ప్రచార ఏర్పాట్లతో అభ్యర్థులు సిద్ధమయ్యారు.
అత్యధికంగా 5,366 మంది
పురుషుల కంటే మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్న 8 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలో 421 నుంచి మొదలుకొని 5,366 మంది ఉన్నారు. మొత్తంగా చూస్తే ఆ నియోజకవర్గాల్లో 26,477 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ప్రత్యేకించి ఆ ఎనిమిది సెగ్మెంట్లలో మొత్తం ఓటర్లు 18,63,122 ఉంటే అందులో 9,18,253 మంది పురుషులు, 9,44,730 మంది మహిళలు ఉన్నారు.
అత్యధికంగా హుజూర్‌నగర్ నియోజకవర్గంలో మహిళా ఓటర్లు 5366 మంది ఎక్కువ ఉన్నారు. నల్లగొండలో 4,839 మంది, నకిరేకల్‌లో 421 మంది, నాగార్జునసాగర్‌లో 3,334 మంది, మిర్యాలగూడలో 3,265, సూర్యాపేటలో 3,938, కోదాడలో 4,760, భువనగిరిలో 554 మంది మహిళా ఓటర్లు పురుషులకంటే ఎక్కువగా ఉన్నారు.
సభలకు వచ్చేలా ప్రణాళికలు..
ఇప్పటికే ప్రచారంలోకి దిగిన నేతలు తమ వెంట ఎక్కువగా మహిళలు ఉండేలా చూసుకుంటున్నారు. సభలు, సమావేశాలకు ఎక్కువ మంది మహిళలు వచ్చేలా ప్రణాళికలు రూపొందించకుంటున్నారు. ముఖ్యంగా మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులను రంగంలోకి దింపుతున్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై వారితో చెప్పించడం ద్వారా మహిళా ఓటర్లను ఆకర్షించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.
మహిళలూ.. మీకు వందనం
అధికార బీఆర్‌ఎస్ పార్టీ, కాంగ్రెస్, బీజేపీలు మహిళల ఓట్లను రాబట్టుకునే విషయంలో లెక్కలు వేసుకుంటున్నాయి. బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్రంలో ఇప్పటికే మహిళల కోసం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్, ఒంటరి మహిళలకు పెన్షన్, గృహలక్ష్మి వంటి పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల వివరాలతో మండలాలు, గ్రామాల వారీగా కరపత్రాలను ముద్రించి ప్రచారంలోకి దిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఆ దిశగా తమ ఆరు గ్యారంటీలతో ప్రచారం మొదలుపెట్టింది.
అతివలే లక్ష్యంగా మేనిఫెస్టోలు
ఈ ఎన్నికల్లో అతివలే లక్ష్యంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు మేనిఫెస్టోలు ప్రకటించాయి. వారిని ఆకట్టుకునేలా మేనిఫెస్టోలలో హామీలను పొందుపరిచాయి. తాము మళ్లీ అధికారంలోకి వస్తే అర్హులైన మహిళలకు ప్రతి నెలా రూ.3 వేల జీవనభృతి, రూ.400కే గ్యాస్ సిలిండర్, మహిళా సంఘాల సమాఖ్యలన్నింటికి సొంత భవనాల నిర్మాణం వంటి హామీలను బీఆర్‌ఎస్ ప్రకటించింది.
ఇక కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో మొదటగా మహాలక్ష్మిని పేర్కొంది. ఈ పథకం కింద ప్రతి నెలా రూ. 2,500 ఇస్తామని ప్రకటించింది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటివి ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment