దేశంలోని మహిళలు ఓటు వేసేందుకు అమితమైన ఉత్సాహం చూపిస్తున్నారు. గత ఐదేళ్లలోని గణాంకాలు దీనిని స్పష్టం చేస్తున్నాయి. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్ల సంఖ్య పెరిగిందని పలు నివేదికలు చెబుతున్నాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) పరిశోధనా నివేదికలోని వివరాల ప్రకారం గత ఐదేళ్లలో ఎన్నికలు జరిగిన 23 రాష్ట్రాల్లోని 18 రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారని తేలింది. ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం కూడా ఉంది. ఈ 18 రాష్ట్రాల్లోని 10 రాష్ట్రాల్లో తిరిగి అదే ప్రభుత్వం ఏర్పడటం విశేషం. దేశ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్‌గా మారుతున్న మహిళా ఓటర్లు 2029 ఎన్నికల్లో పురుషుల కంటే అధికంగా ఉండనున్నారు.
17వ లోక్‌సభలో మొత్తం ఎంపీల్లో 15 శాతం మంది మహిళలు ఉన్నారు. మొదటి లోక్‌సభలో ఈ సంఖ్య ఐదు శాతంగా ఉంది. నివేదిక ప్రకారం రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 96.8 కోట్లు. వీరిలో 68 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారనే అంచనాలున్నాయి. వీరిలో 33 కోట్ల మంది అంటే 49 శాతం మంది మహిళా ఓటర్లు ఉండనున్నారు. 85.3 లక్షల మంది మహిళలు తొలిసారిగా ఓటు వేయనున్నారు. 2047 నాటికి (2049లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది) మహిళా ఓటర్ల సంఖ్య 55 శాతానికి (50.6 కోట్లు) పెరుగుతుందని, పురుషుల సంఖ్య 45 శాతానికి (41.4 కోట్లు) తగ్గనుందని నివేదిక పేర్కొంది. 2047 నాటికి 115 కోట్ల మంది ఓటర్లు ఉంటారని, వీరిలో 80 శాతం మంది అంటే 92 కోట్ల మంది ఓటు వేస్తారని నివేదిక అంచనా వేసింది.
ప్రభుత్వ పథకాలు అందుకోవడంలో మహిళా లబ్ధిదారులు ముందంజలో ఉన్నారు. స్టాండప్ ఇండియాలో వారి వాటా 81 శాతం. ముద్రా లోన్‌లో మహిళలకు 68 శాతం, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనలో 37 శాతం, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో 27 శాతం వాటా ఉంది. గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, తెలంగాణలలో మహిళా ఓటర్ల సంఖ్య వేగంగా పెరుగుతోందని నివేదిక చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment