
స్మరణీయం.. రమణీయం
రమణానందం
భగవంతుణ్ణి నీ అంతర్నేత్రంలో దర్శించడానికి నిన్ను నీవు తెలుసుకునే ఎరుకకు సరళమైన ఆధ్యాత్మికమార్గం మౌనమే అని తనజీవితం ద్వారా మనకు చూపించిన ఆధ్యాత్మిక సంపన్నులు భగవాన్ రమణ మహర్షి. మార్గశిర బహుళ విదియ పునర్వసు నక్షత్రంలో అంటే 1879 డిసెంబరు 29 అర్ధరాత్రి తమిళనాడు రాష్ర్టంలోని మధురై సమీపాన గల తిరుచ్చుళిలో అలఘమ్మ, సుందరయ్యర్ పుణ్యదంపతులకు పుట్టిన వెంకట రామన్ మౌనస్వామిగా, శ్రీ రమణ మహర్షిగా ప్రసిద్ధులయ్యారు.
లోకంలో దుఃఖం, కష్టం ఎందుకని ఒక భక్తుడు అడిగిన దానికి సమాధానంగా కష్టాలు రాకపోతే సుఖం కావాలనే కోరిక పుట్టదు. సుఖం కావాలన్న కోరిక లేకపోతే ఆత్మాన్వేషణ విజయవంతం కాదు అని చెప్పారు. అయితే కష్టాలు, దుఃఖం ఉండటం మంచిదంటారా అని మరొకరు అడిగారు. అప్పుడాయన అసలు దుఃఖమనేది నేను దేహాన్ని అనే మిధ్యాభావన వల్లే కలుగుతోంది. దానిని వదిలించుకోవడమే జ్ఞానం అని సమాధానమిచ్చారు.
నాపై అనుగ్రహం చూపండని ఒక భక్తుడు వేడుకున్నాడు. ఆత్మయే అనుగ్రహ స్వరూపం. ఆత్మ ఎల్లప్పుడూ తన అనుగ్రహం చూపుతూనే ఉంటుంది. దానిని మనం గ్రహించుకోవాలి. ఆత్మప్రేరణ వల్లే నీవడిగావు, నేను చెప్పావు’ అని చెప్పారు.
అరుణాచలంలో అడుగిడినప్పటినుండి 1950 ఏప్రిల్ 14న సిద్ధిని పొందేవరకు మౌనం అనే విలువైన సాధన ద్వారా అపారమైన ఆధ్యాత్మిక జ్ఞానసంపదను మనకందించిన భగవాన్ రమణ మహర్షి నిత్యస్మరణీయులు, ఆయన బోధలు చిరస్మరణీయాలు. రమణీయాలు.
- బ్రహ్మానంద రెడ్డి