కుమ్మరి వృత్తి.. దక్కని తృప్తి.. సాంప్రదాయాన్ని వదులుకోలేక.. | Declining Popularity Of Potters | Sakshi
Sakshi News home page

కుమ్మరి వృత్తి.. దక్కని తృప్తి.. సాంప్రదాయాన్ని వదులుకోలేక..

Published Tue, Oct 25 2022 10:30 AM | Last Updated on Tue, Oct 25 2022 10:34 AM

Declining Popularity Of Potters - Sakshi

తాళ్లపూడి(తూర్పుగోదావరి): దీపావళి వస్తుందంటే చాలు కుమ్మర్లకు చేతి నిండా పని, వీధులన్నీ మట్టి ప్రమిదలతో కళకళలాడుతూ ఉంటాయి. ప్రమిదలు, చిచ్చు బుడ్లు తదితర తయారీలో వారంతా నిమగ్నమై ఉంటారు. అయితే ప్రస్తుతం ఈ కుమ్మర్లకు ఆదరణ తగ్గింది. సీజన్‌లో తప్ప మిగతా రోజుల్లో పని లేక ఇబ్బంది పడుతున్నారు. సమాజంలో వస్తున్న మార్పులు, ప్రజల అభిరుచులు మారడంతో మట్టి పాత్రల వినియోగం తగ్గడంతో కుమ్మర్లకు పని లేకుండాపోతోంది. ఆర్థికంగా అవస్థలు తప్పడంలేదు. దీంతో వారు వలసపోతున్నారు. తాతల కాలం నుంచి వస్తున్న కులవృత్తిని, సాంప్రదాయాన్ని వదులుకోలేక పలువురు ఈ పనులే చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
చదవండి: వినూత్నం: ఆ గుప్పెళ్లు.. దయగల గుండెల చప్పుళ్లు   

ఈ వృత్తినే నమ్ముకొని.. 
ఆధునిక కాలంలో మట్టి పాత్రలకు బదులు స్టీల్, రాగి, కంచు, సీవండి, ప్లాస్టిక్‌ తదితర వాటిని వినియోగిస్తున్నారు. దీంతో కుమ్మరులు  ఉపాధిని కోల్పోతున్నారు. కొవ్వూరు నియోజక వర్గంలో సుమారు 4 వేల మంది వరకూ కుమ్మర్లు ఉండేవారు. ప్రస్తుతం 400 మంది ఉన్నారు. తాళ్లపూడి మండలంలో సుమారు 150 నుంచి 200 కుటుంబాలు వరకూ ఉండేవి. ప్రస్తుతం కేవలం 25 కుటంబాలు వారు మాత్రమే కుమ్మర వృత్తిని కొనసాగిస్తున్నారు. వేగేశ్వరపురంలో 13 కుంటుబాలు, తాళ్లపూడిలో నాలుగు కుటుంబాలు ఈ వృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి తగిన ప్రొత్సాహం మాత్రం లభించడం లేదు.   పెద్దేవం, అన్నదేవరపేట, తిరుగుడుమెట్ట, రాగోలపల్లి తదితర గ్రామాల్లో కుమ్మర్లు ఉన్నారు. వారు పురాతన శాలలపై ఆధారపడకుండా ఇటీవల కరెంట్‌ శాలలు రూ.20 వేలు పెట్టి సొంతంగా కొనుక్కున్నారు. వాటిపై కేవలం ప్రమిదలు, చిచ్చుబుడ్లు మాత్రమే తయారు చేయడం జరుగుతుంది.

పెరిగిన ముడిసరుకుల ధరలు  
మట్టి వస్తువులు తయారీలో ఉపయోగించే ముడి సరుకుల ధరలు పెరిగాయి. ఆవ శాలలో  కాల్చడానికి మట్టి, ఊక, వంట చెరకు ధరలు గతంలో కంటే రెట్టింపయ్యాయి. ఖర్చులు పోగా వచ్చే లాభం సరిపోవడంలేదని కుమ్మర్లు వాపోతున్నారు. వేసవిలో కుండలు చేయడం ద్వారా ఇతల మట్టి పాత్రలు కుడా తయారు చేస్తున్నారు. ఈ దీపావళికి వివిధ ఆకృత్తుల్లో ఆకర్షణీయంగా ప్రమిదలు తయారు చేస్తున్నారు. 1000 ప్రమితలు రూ.850 నుంచి రూ.1000 వరకు విక్రయిస్తున్నారు. 100 చిచ్చుబుడ్లు రూ.500 నుంచి రూ.600 వరకూ కొనుగోలు చేస్తున్నారు. అది కూడా కొందరు వ్యక్తులు ముందుగా కాంట్రాక్ట్‌ కుదుర్చుకుని చేయించుకుంటున్నారు. ఏటా దీపావళి సీజన్‌ నుంచి కార్తిక మాసం సీజన్‌లో మాత్రమే కొంత ఉపాధి దొరుకుందని కుమ్మర్లు వాపోతున్నారు.

కుమ్మరిని ప్రోత్సహించాలి 
ఇటీవల కురిసిన వర్షాలకు దీపావళి సీజన్‌లో పని చేయడానికి అవకాశం లేదు. కుమ్మరి వృత్తిని ప్రోత్సాహించాలి. నేను రూ.20 వేలు పెట్టి కరెంట్‌ శాల కొన్నాను. మార్కెట్లో ముడిసరుకుల ధరలు పెరిగిపోయాయి. దీనివల్ల లాభాలు రావడంలేదు. కుటుంబం అంతా దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నాం. ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వం రుణాలు ఇవ్వలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సాయం చేయండి. 
– శ్రీకాకోళపు పద్మ, వేగేశ్వరపురం

దీపావళి సీజన్‌లోనే పని    
మారుతున్న రోజుల్లో కుమ్మరి వృత్తికి ఆదరణ కరువైంది. దీపావళి సీజన్‌లో మాత్రమే పని ఉంటోంది. మిగతా రోజుల్లో ఉండదు. ఆర్థికంగా నిలదొక్కుకోలేక కుమ్మర వృత్తిని చేయడానికి ముందుకు రావడంలేదు. దీంతో ఇతర పనులకు వెళ్లక తప్పడం లేదు. ప్రభుత్వం కరెంట్‌ శాలలు, ఇతర పనిముట్లపై సబ్సిడీ ఇవ్వాలి. మమ్మల్ని ఆదుకోవాలి. 
– శ్రీకాకొళపు వెంకటేశ్వరరావు, వేగేశ్వరపురం 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement