potters life
-
టెర్రకోట కళకు ఆధునికత అండ.. అరగంటలో మట్టి సిద్ధం!
కురబలకోట: ఆశావాదికి ఒక దారి మూసుకుపోతే మరో దారి వెల్ కమ్ చెబుతుందంటారు. అన్నమయ్య జిల్లా కుమ్మరుల జీవితాల్లో అదే జరిగింది. 40 ఏళ్ల క్రితం ఆనాటి పెద్దలు మట్టితో కుండలు, కడవలు, బానలు, వంట పాత్రలు తయారు చేసి ఎడ్లబండిపై ఊరూరా తిరిగి అమ్మేవారు. వచ్చిన దాంతో కాలం వెళ్లదీసేవారు. అల్యూమినియం, ఇతర వంట పాత్రలు మార్కెట్లోకి రావడంతో కుమ్మరుల నుంచి మట్టి కుండలు, పాత్రలు కొనేవారు కరువయ్యారు. ఇలాంటి పరిస్థితిలో ఆనాటి రిషివ్యాలీ స్కూల్ క్రాఫ్ట్ టీచర్ విక్రమ్ పర్చూరే వీరి పాలిట ఆశాజ్యోతిగా మారారు. ఆయనే రాష్ట్రంలో టెర్రకోట ప్రక్రియకు ఆద్యుడని చెప్పకతప్పదు. తొలుత కురబలకోట మండలంలోని దుర్గం పెద్ద వెంకట్రమణ, అసనాపురం రామయ్యలకు ఈయన టెర్రకోట ప్రక్రియలో కుండలు, బొమ్మలు చేయడం నేర్పించాడు. వారి ద్వారా ఇవి వారసత్వంగా ఇప్పుడు బహుళ ప్రాచుర్యంలోకి వచ్చాయి. అంగళ్లు, కంటేవారిపల్లె, పలమనేరు, సీటీఎం, ఈడిగపల్లె, సదుం, కాండ్లమడుగు, కుమ్మరిపల్లె తదితర ప్రాంతాల్లో ఎందరికో కొత్త జీవితాన్ని ఇస్తున్నాయి. ఒకప్పుడు వంట ఇంటకే పరిమితమైన ఇవి నేడు నట్టింట ఇంటీరియర్ డెకరేటివ్గా మారాయి. పల్లెలు, సంతల్లో అమ్ముడయ్యే ఇవి ఇప్పుడు ఎంచక్కా హైవేపక్కన కొలువు దీరాయి. నగరవాసులను ఆకట్టుకుంటున్నాయి. మట్టితో ఎన్నో కుండలు, బొమ్మలు చేస్తూ కొత్త కళ తెప్పిస్తున్నారు. రాష్ట్రపతి, గవర్నర్ల బంగ్లాలలో తిష్ట వేశాయి. పార్లమెంటు, అసెంబ్లీలలో కూడా ఇవి చోటు సంపాదించుకున్నాయి. ఎగ్జిబిషన్లలో ఆకట్టుకుంటున్నాయి. అదే మట్టి అదే కుమ్మరులు.. కానీ మారిందల్లా పనితనమే. రూపం మార్చారు. దీంతో విలువ పెరిగింది. ఇందుకు ఆధునిక మిషన్లు ఆయుధంగా మారాయి. ఇదే వారికి సరి కొత్తదారిని చూపింది. తక్కువ సమయంలో ఎక్కువ తయారు చేసుకోగలుగుతున్నారు. కుటుంబాలను చక్కదిద్దుకుంటున్నారు. కురబలకోట, సీటీఎంకు చెందిన ముగ్గురికి టెర్రకోట కళలో రాష్ట్ర స్థాయి అవార్డులు కూడా వరించాయి. అన్నమయ్య జిల్లాకే మకుటాయమానంగానే కాకుండా సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా కూడా ఇవి నిలుస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 652 కుటుంబాల దాకా ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. పేదరికం జయించి జీవన ప్రమాణాలు పెంచుకున్నాయి. జీవన శైలి కూడా మారింది. ఆధునిక మిషన్లతో తగ్గిన శ్రమ పెద్దల కాలం నుంచి మట్టి పిసికి కాళ్లతో తొక్కి సిద్ధం చేసేవారు. దీని వల్ల శారీరక శ్రమ ఎదురయ్యేది. ఒక రోజంతా మట్టి సిద్ధం చేసుకుని మరుసటి రోజున పని మొదలుపెట్టేవారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం డీఆర్డీఏ ద్వారా వివిధ రకాల మిషన్లను వీరికి ఉచితంగా అందజేసింది. దీంతో సునాయాసంగా కుండలు, బొమ్మలకు కావాల్సిన మట్టిని సిద్ధం చేసుకోగలుతున్నారు. దశాబ్దాలుగా సారెపై వీటిని చేసేవారు. దీని స్థానంలో పాటరీ వీల్‌ను ఇచ్చారు. ఇది రూ.16 వేలు. కరెంటుతో నడుస్తుంది. కూర్చునే పనిచేయవచ్చు. చక్రం తిప్పే పనిలేదు. ఆన్/ఆఫ్ బటన్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది. ప్లగ్ వీల్ అనే మరో మిషన్ కూడా ఇచ్చారు. ఇందులో మట్టి వేస్తే అది కుండలు, బొమ్మలు చేయడానికి అనువుగా మట్టి ముద్ద తయారై వస్తుంది. ఇది రూ.33 వేలు. వీటికి తోడు కొత్తగా క్లే మిక్సర్ రోలర్ మిషన్ వచ్చింది. ఇది రూ.75 వేలు. మట్టి ఇందులో వేస్తే ఇసుక, రాళ్లు లాంటివి కూడా పిండిగా మారి బొమ్మలు, కుండలకు అనువుగా మట్టి తయారవుతుంది. ఇదివరలో మట్టిని సిద్ధం చేసుకోడానికి రోజంతా పట్టేది. ఈ మిషన్‌తో ఇప్పుడు అరగంటలో మట్టి సిద్ధం అవుతోందని టెర్రకోట కళాకారులు సంతోషంగా వెల్లడిస్తున్నారు. ఈ మిషన్లను డీఆర్డీఏ కళాకారులకు ఉచితంగా అందజేసింది. సీఎఫ్‌సీ సెంటర్లు కూడా కట్టించి ఇచ్చారు. టెర్రకోటతో కొత్త బాట టెర్రకోట అంటే కాల్చిన మట్టి అని అర్థం. కుండలు, బొమ్మలు తయారు చేసి వాటిని కాల్చే ప్రక్రియనే టెర్రకోటగా వ్యవహరిస్తున్నారు. పెద్దల కాలంలో సాధారణ మట్టి కుండలు చేసే మాకు టెర్రకోట కొత్త బతుకు బాట చూపింది. వీటిలో ప్రావీణ్యం సాధించిన మేము దేశ విదేశాల్లో శిక్షణ కూడా ఇస్తున్నాం. మాకు ఆస్తిపాస్తులు కూడా లేవు. ఈ వృత్తే ఆధారం. కొత్త జీవనం, కొత్త జీవితాన్ని ఇచ్చింది. – దుర్గం మల్లికార్జున, టెర్రకోట కళాకారుల సంఘం నాయకులు, అంగళ్లు 70 శాతం కష్టం తగ్గింది ఈ మిషన్ల ద్వారా 70 శాతం శారీరక కష్టం తగ్గింది. ఇదివరలో మట్టిని.. శుభ్రం చేయడం, నీళ్లు చల్లి కాళ్లతో తొక్కి సిద్ధం చేయాల్సి వచ్చేది. ఇప్పుడా సమస్యే లేదు. మిషన్లతో మట్టిని ముద్ద చేయడం, కుండలు, బొమ్మలకు అనువుగా మట్టిని మార్చుకోవడం ఇప్పుడు గంటలో పని. అధునాతన మిషన్లు మా వృత్తిని సులభతరం చేశాయి. నాణ్యత, నవ్యత పెరిగింది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు. తక్కువ సమయంలో ఎక్కువ కుండలు, బొమ్మలు తయారు చేసుకోగలుగుతున్నాం. నెలకు రూ. 30 వేల నుంచి రూ. 40 వేల దాకా సంపాదించుకోగలుగుతున్నాం. – రాజగోపాల్, రాష్ట్ర అవార్డు గ్రహీత, అంగళ్లు వీటికే ఎక్కువ డిమాండ్ టెర్రకోట కళ గురించి తెలియని వారు అరుదు. 250 రకాలు కుండలు, బొమ్మలు చేస్తున్నాం. వీటిలో మట్టి వంట పాత్రలకు అధిక డిమాండు ఉంది. ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరిగింది. మట్టి పాత్రల్లో వంట శ్రేష్టమని భావిస్తున్నారు. దీంతో వీటికి గిరాకీ పుంజుకుంటోంది. వివిధ నగరాల హోటళ్లకు కూడా బిర్యానీ కుండలు వెళుతున్నాయి. వీటి తర్వాత ఇంటిరియర్ డెకరేటివ్ పార్ట్స్‌కు, ఆ తర్వాత గార్డెన్ ఐటెమ్స్‌కు ఆదరణ ఉంటోంది. 80 శాతం వీటినే ఆదరిస్తున్నారు. కొనుగోలుదారుల అభిరుచులకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు కొత్తదనంతో కుండలు, బొమ్మలు చేస్తున్నాం. బతుకుతెరువుకు ఏ మాత్రం ఢోకా లేదు. – డి.కళావతి, టెర్రకోట హస్తకళాకారిణి, అంగళ్లు -
కుమ్మరి వృత్తి.. దక్కని తృప్తి.. సాంప్రదాయాన్ని వదులుకోలేక..
తాళ్లపూడి(తూర్పుగోదావరి): దీపావళి వస్తుందంటే చాలు కుమ్మర్లకు చేతి నిండా పని, వీధులన్నీ మట్టి ప్రమిదలతో కళకళలాడుతూ ఉంటాయి. ప్రమిదలు, చిచ్చు బుడ్లు తదితర తయారీలో వారంతా నిమగ్నమై ఉంటారు. అయితే ప్రస్తుతం ఈ కుమ్మర్లకు ఆదరణ తగ్గింది. సీజన్లో తప్ప మిగతా రోజుల్లో పని లేక ఇబ్బంది పడుతున్నారు. సమాజంలో వస్తున్న మార్పులు, ప్రజల అభిరుచులు మారడంతో మట్టి పాత్రల వినియోగం తగ్గడంతో కుమ్మర్లకు పని లేకుండాపోతోంది. ఆర్థికంగా అవస్థలు తప్పడంలేదు. దీంతో వారు వలసపోతున్నారు. తాతల కాలం నుంచి వస్తున్న కులవృత్తిని, సాంప్రదాయాన్ని వదులుకోలేక పలువురు ఈ పనులే చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చదవండి: వినూత్నం: ఆ గుప్పెళ్లు.. దయగల గుండెల చప్పుళ్లు ఈ వృత్తినే నమ్ముకొని.. ఆధునిక కాలంలో మట్టి పాత్రలకు బదులు స్టీల్, రాగి, కంచు, సీవండి, ప్లాస్టిక్ తదితర వాటిని వినియోగిస్తున్నారు. దీంతో కుమ్మరులు ఉపాధిని కోల్పోతున్నారు. కొవ్వూరు నియోజక వర్గంలో సుమారు 4 వేల మంది వరకూ కుమ్మర్లు ఉండేవారు. ప్రస్తుతం 400 మంది ఉన్నారు. తాళ్లపూడి మండలంలో సుమారు 150 నుంచి 200 కుటుంబాలు వరకూ ఉండేవి. ప్రస్తుతం కేవలం 25 కుటంబాలు వారు మాత్రమే కుమ్మర వృత్తిని కొనసాగిస్తున్నారు. వేగేశ్వరపురంలో 13 కుంటుబాలు, తాళ్లపూడిలో నాలుగు కుటుంబాలు ఈ వృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి తగిన ప్రొత్సాహం మాత్రం లభించడం లేదు. పెద్దేవం, అన్నదేవరపేట, తిరుగుడుమెట్ట, రాగోలపల్లి తదితర గ్రామాల్లో కుమ్మర్లు ఉన్నారు. వారు పురాతన శాలలపై ఆధారపడకుండా ఇటీవల కరెంట్ శాలలు రూ.20 వేలు పెట్టి సొంతంగా కొనుక్కున్నారు. వాటిపై కేవలం ప్రమిదలు, చిచ్చుబుడ్లు మాత్రమే తయారు చేయడం జరుగుతుంది. పెరిగిన ముడిసరుకుల ధరలు మట్టి వస్తువులు తయారీలో ఉపయోగించే ముడి సరుకుల ధరలు పెరిగాయి. ఆవ శాలలో కాల్చడానికి మట్టి, ఊక, వంట చెరకు ధరలు గతంలో కంటే రెట్టింపయ్యాయి. ఖర్చులు పోగా వచ్చే లాభం సరిపోవడంలేదని కుమ్మర్లు వాపోతున్నారు. వేసవిలో కుండలు చేయడం ద్వారా ఇతల మట్టి పాత్రలు కుడా తయారు చేస్తున్నారు. ఈ దీపావళికి వివిధ ఆకృత్తుల్లో ఆకర్షణీయంగా ప్రమిదలు తయారు చేస్తున్నారు. 1000 ప్రమితలు రూ.850 నుంచి రూ.1000 వరకు విక్రయిస్తున్నారు. 100 చిచ్చుబుడ్లు రూ.500 నుంచి రూ.600 వరకూ కొనుగోలు చేస్తున్నారు. అది కూడా కొందరు వ్యక్తులు ముందుగా కాంట్రాక్ట్ కుదుర్చుకుని చేయించుకుంటున్నారు. ఏటా దీపావళి సీజన్ నుంచి కార్తిక మాసం సీజన్లో మాత్రమే కొంత ఉపాధి దొరుకుందని కుమ్మర్లు వాపోతున్నారు. కుమ్మరిని ప్రోత్సహించాలి ఇటీవల కురిసిన వర్షాలకు దీపావళి సీజన్లో పని చేయడానికి అవకాశం లేదు. కుమ్మరి వృత్తిని ప్రోత్సాహించాలి. నేను రూ.20 వేలు పెట్టి కరెంట్ శాల కొన్నాను. మార్కెట్లో ముడిసరుకుల ధరలు పెరిగిపోయాయి. దీనివల్ల లాభాలు రావడంలేదు. కుటుంబం అంతా దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నాం. ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వం రుణాలు ఇవ్వలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సాయం చేయండి. – శ్రీకాకోళపు పద్మ, వేగేశ్వరపురం దీపావళి సీజన్లోనే పని మారుతున్న రోజుల్లో కుమ్మరి వృత్తికి ఆదరణ కరువైంది. దీపావళి సీజన్లో మాత్రమే పని ఉంటోంది. మిగతా రోజుల్లో ఉండదు. ఆర్థికంగా నిలదొక్కుకోలేక కుమ్మర వృత్తిని చేయడానికి ముందుకు రావడంలేదు. దీంతో ఇతర పనులకు వెళ్లక తప్పడం లేదు. ప్రభుత్వం కరెంట్ శాలలు, ఇతర పనిముట్లపై సబ్సిడీ ఇవ్వాలి. మమ్మల్ని ఆదుకోవాలి. – శ్రీకాకొళపు వెంకటేశ్వరరావు, వేగేశ్వరపురం -
మట్టి ప్రమిద మినుకుమినుకు
వనం దుర్గాప్రసాద్, హైదరాబాద్: యంత్రం స్పీడుకు కుమ్మరి చక్రం కుదేలవుతోంది. తరతరాల కులవృత్తిపై అమాస చీకట్లు అలుముకున్నాయి. యాంత్రీకరణ ప్రపంచంలో కుమ్మరులకు పూటగడవడం కూడా కష్టంగానే మారిపోయింది. వారి చేతుల్లో రూపుదాల్చి దీపావళి వెలుగులు పంచే మట్టి ప్రమిదలు ఇప్పుడు మినుకుమినుకుమంటున్నాయి. యంత్రాలు వచ్చి చేరడంతో మట్టి ప్రమిదల గిరాకీ తగ్గుతోంది. పదేళ్ల క్రితం రాష్ట్రంలో సుమారు రూ.20 కోట్ల ప్రమిదల వ్యాపారం జరిగేది. ఇదంతా కుమ్మరులకే దక్కేది. కానీ మూడేళ్లుగా ఏటా రూ.90 కోట్ల ప్రమిదలు అమ్ముడుపోతున్నా ఇందులో కుమ్మరులకు దక్కుతోంది కేవలం 10 కోట్లు మాత్రమే! మిగతా మొత్తం యంత్రాలే మింగేస్తున్నాయి. 2001లో రాష్ట్రంలో సగటున 30 లక్షల మంది కుమ్మరులు దీపావళి రోజుల్లో ప్రమిదలు తయారు చేసేవారు. యంత్రాలు వచ్చిన తర్వాత వీరి సంఖ్య 5 లక్షలకే పరిమితమైంది. ఇందులోనూ 4 లక్షల మంది గ్రామ ప్రాంతాల్లోనే పొట్టబోసుకుంటున్నారు. కూలీ కూడా దక్కని పరిస్థితి.. ప్రమిదలు తయారు చేస్తే కనీసం కూలీ కూడా దక్కడం లేదని కుమ్మరులు వాపోతున్నారు. వీటి తయారీకి ప్రధానంగా మట్టి, నీరు అవసరం. పట్టణాలు, నగరాల్లో ఇదే కరువైంది. గత పదేళ్లలో రాష్ట్రంలో 60 శాతం చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురయ్యాయి. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, విశాఖ ప్రాంతాల్లో మట్టి దొరకడం కష్టంగా మారింది. హైదరాబాద్‌లో పనిచేసే కుమ్మరులు ఇంతకుముందు శంషాబాద్ ప్రాంతం నుంచి మట్టి తెప్పించేవారు. ఇప్పుడు అందుకు వీలులేకుండా పోయింది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని దూర ప్రాంతాల నుంచి మట్టి తెప్పించుకుంటున్నారు. లారీ మట్టి రూ.6 వేల నుంచి రూ.10 వేలు పలుకుతోంది. నీళ్లు ఒక్కో ట్యాంకు వెయ్యి రూపాయలకు కొనాల్సి వస్తోంది. బట్టీ పెట్టేందుకు ఉపయోగించే గడ్డి, కట్టెల ధరలూ మండిపోతున్నాయి. 10 వేల ప్రమిదల తయారీకి దాదాపు రూ.4 వేల రూపాయల ఖర్చు అవుతోంది. ఆ తర్వాత దళారులు వెయ్యి ప్రమిదలు కేవలం రూ.650లకే అడుగుతున్నారని కుమ్మరులు వాపోతున్నారు. జాగ్రత్తగా చేస్తే 10 వేల ప్రమిదలకు రూ.6500 వస్తాయని, ఖర్చులు పోను కేవలం రూ.2 వేలు మిగులుతాయని చెబుతున్నారు. దళారులు మాత్రం రెట్టింపు లాభం గడిస్తున్నారు. ఐదుగురు కుటుంబ సభ్యులు వారం రోజులు కష్టపడితేగానీ ఈ ఫలితం దక్కదని, దీన్నిబట్టి తమకు కనీసం రోజు కూలీ కూడా దక్కడం లేదని చెబుతున్నారు. కనుమరుగవుతున్న వృత్తి.. కుమ్మర కులానికి చెందిన వారు 40 లక్షల మంది ఉంటే.. వీరిలో సగానికిపైగా పట్టణాలకు వలస వచ్చారు. వీరంతా కుల వృత్తిని మానేసి, తాపీ పనులు, సెంట్రింగ్, కూలీ పనులతో పొట్టపోసుకుంటున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది మాత్రమే ఈ వృత్తిలో ఉన్నారు. వీళ్లు కూడా కుండలు, మట్టి పాత్రలు చేయడం మానేశారు. శుభాలు, అశుభాలప్పుడు సంప్రదాయ పాత్రలకే పరిమితమయ్యారు. కులవృత్తి కుంటుపడడంతో ఐదేళ్లలో వీరి తలసరి ఆదాయం 50 శాతం తగ్గింది. బతుకులు చిదిమిన బహుళజాతి కంపెనీలు కొన్నేళ్ళుగా రాష్ట్రానికి గుజరాత్, రాజస్థాన్, కలకత్తా నుంచి ప్రమిదలు భారీగా దిగుమతి అవుతున్నాయి. అక్కడ మట్టి మనకన్నా మెత్తగా ఉంటుందని, ఉచితంగా అందుబాటులో ఉంటుందని కుమ్మరి సంఘాలు చెబుతున్నాయి. అక్కడి ప్రభుత్వాలు కూడా చెరువులపై ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని పేర్కొంటున్నారు. దీనికి తోడు బహుళజాతి కంపెనీలు రంగ ప్రవేశం చేశాయి. సిరామిక్ పరిశ్రమలు భారీగా ప్రమిదలు తయారు చేస్తున్నాయి. ఒక్కో యంత్రం ఖరీదు రూ.20 లక్షల నుంచి రూ.కోటి దాకా ఉంటుంది. వీటితో గంటకు కనీసం 15 వేల ప్రమిదలు తయారు చేసే వీలుంది. కొన్ని కంపెనీలు నేరుగా ఔట్లెట్లు పెట్టి అమ్ముతున్నారు. కొన్ని ప్రాంతాల్లో భారీగా కమీషన్లు ఇస్తున్నారు. రకరకాల డిజైన్లలో ఇంపుగా ఉండటం, తక్కువ ధరకు లభించడంతో వీటినే కొంటున్నారు. ఆదుకున్న వైఎస్... ఆ తర్వాత నిర్లక్ష్యం కుమ్మరి వృత్తికి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి చేయూతనిచ్చారు. బీసీ కార్పొరేషన్ కింద నిధులు వెచ్చించి, యాంత్రీకరణకు దీటుగా ఈ వృత్తిని అభివృద్ధిపరచాలని భావించారు. ఇందుకు సారె నడిపేందుకు విద్యుత్‌తో నడిచే యంత్రాలు వచ్చాయి. కానీ వైఎస్ మరణం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అనూహ్యంగా విద్యుత్ చార్జీలు పెంచడంతో వీటి వాడటం తలకు మించిన భారమైంది. వేలల్లో వస్తున్న బిల్లులతో ఈ యంత్రాలు మూతపడ్డాయి. అలాగే మట్టిపాత్రలు, ప్రమిదల తయారీకి చెరువులు, కుంటల నుంచి మట్టి తీసుకోవచ్చని వైఎస్ హయాంలో ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇచ్చారు. కానీ మట్టి తవ్వకాల వల్ల చెరువులు దెబ్బతింటాయని అధికారులు ఆటంకం కలిగించారు. మమ్మల్ని ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు మా సామాజిక వర్గం నుంచి ఒక్క ప్రజాప్రతినిధి కూడా లేకపోవడం దారుణం. ప్రభుత్వాలు మమ్మల్ని ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నాయి. వైఎస్ హయాంలో బీసీ ప్రత్యేక నిధుల ప్రతిపాదన కార్యరూపం దాల్చింది. కానీ ఆయన తర్వాత అటకెక్కింది. ఇలాగైతే కుమ్మరులు పూర్తిగా వృత్తికి దూరమవ్వడం ఖాయం. - బండారి భిక్షపతి, ఆంధ్రప్రదేశ్ కుమ్మర సంఘం గౌరవాధ్యక్షుడు