మట్టి ప్రమిద మినుకుమినుకు | the hard life for potter's | Sakshi
Sakshi News home page

మట్టి ప్రమిద మినుకుమినుకు

Published Mon, Oct 28 2013 12:41 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

మట్టి ప్రమిద మినుకుమినుకు - Sakshi

మట్టి ప్రమిద మినుకుమినుకు

వనం దుర్గాప్రసాద్, హైదరాబాద్: యంత్రం స్పీడుకు కుమ్మరి చక్రం కుదేలవుతోంది. తరతరాల కులవృత్తిపై అమాస చీకట్లు అలుముకున్నాయి. యాంత్రీకరణ ప్రపంచంలో కుమ్మరులకు పూటగడవడం కూడా కష్టంగానే మారిపోయింది. వారి చేతుల్లో రూపుదాల్చి దీపావళి వెలుగులు పంచే మట్టి ప్రమిదలు ఇప్పుడు మినుకుమినుకుమంటున్నాయి. యంత్రాలు వచ్చి చేరడంతో మట్టి ప్రమిదల గిరాకీ తగ్గుతోంది. పదేళ్ల క్రితం రాష్ట్రంలో సుమారు రూ.20 కోట్ల ప్రమిదల వ్యాపారం జరిగేది. ఇదంతా కుమ్మరులకే దక్కేది. కానీ మూడేళ్లుగా ఏటా రూ.90 కోట్ల ప్రమిదలు అమ్ముడుపోతున్నా ఇందులో కుమ్మరులకు దక్కుతోంది కేవలం 10 కోట్లు మాత్రమే! మిగతా మొత్తం యంత్రాలే మింగేస్తున్నాయి. 2001లో రాష్ట్రంలో సగటున 30 లక్షల మంది కుమ్మరులు దీపావళి రోజుల్లో ప్రమిదలు తయారు చేసేవారు. యంత్రాలు వచ్చిన తర్వాత వీరి సంఖ్య 5 లక్షలకే పరిమితమైంది. ఇందులోనూ 4 లక్షల మంది గ్రామ ప్రాంతాల్లోనే పొట్టబోసుకుంటున్నారు.
 
 కూలీ కూడా దక్కని పరిస్థితి..
 
 

ప్రమిదలు తయారు చేస్తే కనీసం కూలీ కూడా దక్కడం లేదని కుమ్మరులు వాపోతున్నారు. వీటి తయారీకి ప్రధానంగా మట్టి, నీరు అవసరం. పట్టణాలు, నగరాల్లో ఇదే కరువైంది. గత పదేళ్లలో రాష్ట్రంలో 60 శాతం చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురయ్యాయి. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, విశాఖ ప్రాంతాల్లో మట్టి దొరకడం కష్టంగా మారింది. హైదరాబాద్‌లో పనిచేసే కుమ్మరులు ఇంతకుముందు శంషాబాద్ ప్రాంతం నుంచి మట్టి తెప్పించేవారు. ఇప్పుడు అందుకు వీలులేకుండా పోయింది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని దూర ప్రాంతాల నుంచి మట్టి తెప్పించుకుంటున్నారు. లారీ మట్టి రూ.6 వేల నుంచి రూ.10 వేలు పలుకుతోంది. నీళ్లు ఒక్కో ట్యాంకు వెయ్యి రూపాయలకు కొనాల్సి వస్తోంది. బట్టీ పెట్టేందుకు ఉపయోగించే గడ్డి, కట్టెల ధరలూ మండిపోతున్నాయి.
 
 

10 వేల ప్రమిదల తయారీకి దాదాపు రూ.4 వేల రూపాయల ఖర్చు అవుతోంది. ఆ తర్వాత దళారులు వెయ్యి ప్రమిదలు కేవలం రూ.650లకే అడుగుతున్నారని కుమ్మరులు వాపోతున్నారు. జాగ్రత్తగా చేస్తే 10 వేల ప్రమిదలకు రూ.6500 వస్తాయని, ఖర్చులు పోను కేవలం రూ.2 వేలు మిగులుతాయని చెబుతున్నారు. దళారులు మాత్రం రెట్టింపు లాభం గడిస్తున్నారు. ఐదుగురు కుటుంబ సభ్యులు వారం రోజులు కష్టపడితేగానీ ఈ ఫలితం దక్కదని, దీన్నిబట్టి తమకు కనీసం రోజు కూలీ కూడా దక్కడం లేదని చెబుతున్నారు.
 కనుమరుగవుతున్న వృత్తి..
 
 

కుమ్మర కులానికి చెందిన వారు 40 లక్షల మంది ఉంటే.. వీరిలో సగానికిపైగా పట్టణాలకు వలస వచ్చారు. వీరంతా కుల వృత్తిని మానేసి, తాపీ పనులు, సెంట్రింగ్, కూలీ పనులతో పొట్టపోసుకుంటున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది మాత్రమే ఈ వృత్తిలో ఉన్నారు. వీళ్లు కూడా కుండలు, మట్టి పాత్రలు చేయడం మానేశారు. శుభాలు, అశుభాలప్పుడు సంప్రదాయ పాత్రలకే పరిమితమయ్యారు. కులవృత్తి కుంటుపడడంతో ఐదేళ్లలో వీరి తలసరి ఆదాయం 50 శాతం తగ్గింది.
 
 బతుకులు చిదిమిన బహుళజాతి కంపెనీలు


 కొన్నేళ్ళుగా రాష్ట్రానికి గుజరాత్, రాజస్థాన్, కలకత్తా నుంచి ప్రమిదలు భారీగా దిగుమతి అవుతున్నాయి. అక్కడ మట్టి మనకన్నా మెత్తగా ఉంటుందని, ఉచితంగా అందుబాటులో ఉంటుందని కుమ్మరి సంఘాలు చెబుతున్నాయి. అక్కడి ప్రభుత్వాలు కూడా చెరువులపై ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని పేర్కొంటున్నారు. దీనికి తోడు బహుళజాతి కంపెనీలు రంగ ప్రవేశం చేశాయి. సిరామిక్ పరిశ్రమలు భారీగా ప్రమిదలు తయారు చేస్తున్నాయి. ఒక్కో యంత్రం ఖరీదు రూ.20 లక్షల నుంచి రూ.కోటి దాకా ఉంటుంది. వీటితో గంటకు కనీసం 15 వేల ప్రమిదలు తయారు చేసే వీలుంది. కొన్ని కంపెనీలు నేరుగా ఔట్‌లెట్లు పెట్టి అమ్ముతున్నారు. కొన్ని ప్రాంతాల్లో భారీగా కమీషన్లు ఇస్తున్నారు. రకరకాల డిజైన్లలో ఇంపుగా ఉండటం, తక్కువ ధరకు లభించడంతో వీటినే కొంటున్నారు.
 
 ఆదుకున్న వైఎస్... ఆ తర్వాత నిర్లక్ష్యం


 కుమ్మరి వృత్తికి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి చేయూతనిచ్చారు. బీసీ కార్పొరేషన్ కింద నిధులు వెచ్చించి, యాంత్రీకరణకు దీటుగా ఈ వృత్తిని అభివృద్ధిపరచాలని భావించారు. ఇందుకు సారె నడిపేందుకు విద్యుత్‌తో నడిచే యంత్రాలు వచ్చాయి. కానీ వైఎస్ మరణం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అనూహ్యంగా విద్యుత్ చార్జీలు పెంచడంతో వీటి వాడటం తలకు మించిన భారమైంది. వేలల్లో వస్తున్న బిల్లులతో ఈ యంత్రాలు మూతపడ్డాయి. అలాగే మట్టిపాత్రలు, ప్రమిదల తయారీకి చెరువులు, కుంటల నుంచి మట్టి తీసుకోవచ్చని వైఎస్ హయాంలో ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇచ్చారు. కానీ మట్టి తవ్వకాల వల్ల చెరువులు దెబ్బతింటాయని అధికారులు ఆటంకం కలిగించారు.
 
 మమ్మల్ని ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు
 
 మా సామాజిక వర్గం నుంచి ఒక్క ప్రజాప్రతినిధి కూడా లేకపోవడం దారుణం. ప్రభుత్వాలు మమ్మల్ని ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నాయి. వైఎస్ హయాంలో బీసీ ప్రత్యేక నిధుల ప్రతిపాదన కార్యరూపం దాల్చింది. కానీ ఆయన తర్వాత అటకెక్కింది. ఇలాగైతే కుమ్మరులు పూర్తిగా వృత్తికి దూరమవ్వడం ఖాయం.
 - బండారి భిక్షపతి, ఆంధ్రప్రదేశ్ కుమ్మర సంఘం గౌరవాధ్యక్షుడు
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement