కొనుగోలుదారులతో కళకళలాడుతున్న నగల దుకాణం
హైదరాబాద్: దీపావళి పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో బంగారు ఆభరణాల అమ్మకాలు భారీగా పెరిగాయి. జ్యూయలరీ షాపులు కళకళలాడుతున్నాయి. పండుగను దృష్టిలో పెట్టుకొని జ్యూయలరీ షాపుల వారు మహిళల కోసం రకరకాల డిజైన్లలో ఆభరణాలను అందుబాటులోకి తెచ్చారు. హైదరాబాద్‌లో మహిళలు జోరుగా బంగారం కొనుగోళ్లు చేస్తున్నారు. బంగారంపై పెట్టుబడి పెట్టడం మంచిదన్న భావన చాలామందిలో నెలకొంది.
నిన్న ధన త్రయోదశి పర్వ దినం సందర్భంగా కూడా భారీగా కొనుగోళ్లు జరిగాయి. దాదాపు మూడేళ్లుగా బంగారం ధర నిలకడగా ఉండటం వల్ల కూడా కొనుగోలుదారులు కొనుగోలుకు ముందుకు వచ్చారు. దీపావళి తర్వాత పసిడి ధర పెరిగే అవకాశం ఉంది. పండుగ తర్వాత పసిడి దిగుమతులపై మళ్లీ ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు.
పసిడి దిగుమతులు విపరీతంగా పెరిగిన కారణంగా దిగుమతి సుంకాన్ని 10 శాతానికి పెంచారు. ఇంకా ఇతరత్రా పలు ఆంక్షలు విధించారు. ఈ కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గినప్పటికీ మన దేశంలో మాత్రం తగ్గలేదు. ఇప్పుడు మరోసారి ఆంక్షలు విధిస్తే బంగారం ధర ఓ మాదిరిగా పెరిగే అవకాశం ఉంది. ఈ అంశాన్ని దృష్టిలోపెట్టుకొని కూడా కొంతమంది బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు.
**