పసిడికి ‘పెళ్లి సందడి’! తగ్గనున్న ధర ?
ముంబై: కరోనా వైరస్ ధాటి నుంచి ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికన్నా వేగంగానే కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత దీపావళి సీజన్‌పై ఆభరణాల విక్రేతలు ఆశావహంగా ఉన్నారు. కోవిడ్ పూర్వ స్థాయి కన్నా 30 శాతం అధికంగా అమ్మకాలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. బంగారం ధరలు దిగి రావడం, వాయిదా వేస్తున్న వారు కొనుగోళ్లకు ముందుకు వచ్చి డిమాండ్ మెరుగుపడుతుండటం తదితర అంశాలు ఇందుకు దోహదపడగలవని వారు అంటున్నారు.
ఈసారి బాగున్నాయి
‘సాధారణంగా ఏటా మూడో త్రైమా సికంలో అంతగా విక్రయాలు ఉండవు. కానీ ఈసా రి మాత్రం అమ్మకాలు కొంత పుంజుకున్నాయి. బంగారం ధర తగ్గడం కూడా కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మెరుగుపడటానికి కొంత కారణం‘ అని అఖిల భారత రత్నాభరణాల దేశీ మండలి చైర్మన్ ఆశీశ్ పేఠే తెలిపారు. గడిచిన కొద్ది నెలలుగా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్ల ధోరణి చూస్తుంటే ఆర్థిక వ్యవస్థ రికవరీ బాటలోనే ఉన్నట్లు కనిపిస్తోందని చెప్పారు. మహమ్మారి కారణంగా వాయిదా పడిన వివాహాలు ఈ ఏడాది ఆఖర్లో జరగనుండటం రత్నాభరణాల విక్రయాలకు దోహదపడగలవని పేర్కొన్నారు. ఈ పరిణామాల దరిమిలా 2019తో పోలిస్తే 20–25 శాతం దాకా అమ్మకాల వృద్ధి ఉండొచ్చని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఒకానొక దశలో రూ. 56,000 రికార్డు స్థాయిని తాకిన పసిడి ధర (పది గ్రాములు).. ప్రస్తుతం రూ. 49,200 స్థాయిలో తిరుగాడుతోంది.
మరో 3–4 నెలలు జోరుగా పెళ్లిళ్లు...
నవరాత్రుల దగ్గర్నుంచీ మార్కెట్లో డిమాండ్ గణనీయంగా కనిపిస్తోందని పీఎన్జీ జ్యుయలర్స్ సీఎండీ సౌరభ్ గాడ్గిల్ తెలిపారు. గతేడాది దీపావళితో పోలిస్తే వ్యాపారం రెట్టింపు కాగలదని, 2019తో పోలిస్తే 25–30 శాతం పెరగవచ్చని అంచనా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ‘కోవిడ్–19 భయాల నుంచి ప్రజలు కొంత బైటికి వచ్చినట్లు కనిపిస్తంది. సానుకూల భవిష్యత్ మీద వారు ఆశావహంగా ఉన్నారు. ఆభరణాల్లాంటివి కొనుగోలు చేయడం ద్వారా వారు సంతోషిస్తున్నారు. ఇక పెళ్లిళ్ల సీజన్ కూడా మరో 3–4 నెలల పాటు కొనసాగవచ్చు. ఇది పరిశ్రమకు గట్టి ఊతమిస్తుంది. ఒకవేళ థర్డ్ వేవ్ అంశాలేమీ లేకపోతే పరిశ్రమపై సానుకూల ప్రభావం చూపగలదు‘ అని తెలిపారు. ‘పేరుకుపోయిన డిమాండ్ వల్ల ఈసారి ధన్‌తెరాస్ నాడు ఆభరణాల అమ్మకాలు, గతేడాది దీపావళి సందర్భంతో పోలిస్తే 30–40 శాతం పెరగవచ్చని అంచనా వేస్తున్నాం‘ అని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ చైర్మన్ అహమ్మద్ ఎంపీ తెలిపారు.
‘దసరా నుంచి అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. నెమ్మదిగా మహమ్మారి మబ్బులు విడిపోతున్నాయి. వినియోగదారుల్లో విశ్వాసం పెరుగుతోంది. పేరుకుపోయిన డిమాండ్‌తో దీపావళి, రాబోయే పెళ్లిళ్ల సీజన్లో విక్రయాలు పుంజుకుంటాయని భావిస్తున్నాం. వార్షికంగా చూస్తే కనీసం 35–40 శాతం వృద్ధి అంచనా వేస్తున్నాం‘ అని డబ్ల్యూహెచ్పీ జ్యుయలర్స్ డైరెక్టర్ ఆదిత్య పేఠే చెప్పారు. వినియోగదారుల్లో సానుకూల సెంటిమెంటు వచ్చే ఏడాది ప్రథమార్ధం దాకా కొనసాగగలదని ఆశిస్తున్నట్లు పూజా డైమండ్స్ డైరెక్టర్ శ్రేయ్ మెహతా పేర్కొన్నారు.
రిటైల్ డిమాండ్ మెరుగుపడుతోంది
టీకా ప్రక్రియ పుంజుకోవడం, కోవిడ్ కేసులు నమోదయ్యే వేగం మందగించడం వంటి అంశాలతో ఆర్థిక కార్యకలాపాలు పటిష్టంగా మెరుగుపడుతున్నాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) ప్రాంతీయ సీఈవో సోమసుందరం పీఆర్ తెలిపారు. జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో బంగారు ఆభరణాల డిమాండ్ 58 శాతం ఎగియగా, కడ్డీలు.. నాణేలకు పెట్టుబడులపరమైన డిమాండ్ 18% పెరిగిందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కరోనా కట్టడిపరమైన ఆంక్షలను క్రమంగా సడలించే కొద్దీ రిటైల్ డిమాండ్ తిరిగి కోవిడ్ పూర్వ స్థాయికి చేరుతోందని సోమసుందర్ చెప్పారు. ఈసారి పండుగ, పెళ్లిళ్ల సీజన్లో అత్యధికంగా పసిడి కొనుగోళ్లు జరగవచ్చని ఆయన పేర్కొన్నారు.
చదవండి: ఇదే అతి పె..ద్ద.. గోల్డ్ మైనింగ్! ఏటా లక్షల కిలోల బంగారం తవ్వుతారట..