టెర్రకోట కళకు ఆధునికత అండ.. అరగంటలో మట్టి సిద్ధం! | Annamayya District: Clay Mixer Rollers Reduce Burden For Terracotta Artisans | Sakshi
Sakshi News home page

ఆధునిక మిషన్లతో టెర్రకోట కళాకారులకు తగ్గిన శ్రమ

Published Wed, Oct 26 2022 7:48 PM | Last Updated on Wed, Oct 26 2022 7:48 PM

Annamayya District: Clay Mixer Rollers Reduce Burden For Terracotta Artisans - Sakshi

టెర్రకోట కళాకారులకు ప్రభుత్వం కొత్తగా అందజేసిన క్లే మిక్సర్‌ రోలర్‌ మిషన్లు

కురబలకోట: ఆశావాదికి ఒక దారి మూసుకుపోతే మరో దారి వెల్‌ కమ్‌ చెబుతుందంటారు. అన్నమయ్య జిల్లా కుమ్మరుల జీవితాల్లో అదే జరిగింది. 40 ఏళ్ల క్రితం ఆనాటి పెద్దలు మట్టితో కుండలు, కడవలు, బానలు, వంట పాత్రలు తయారు చేసి ఎడ్లబండిపై ఊరూరా తిరిగి అమ్మేవారు. వచ్చిన దాంతో కాలం వెళ్లదీసేవారు. అల్యూమినియం, ఇతర వంట పాత్రలు మార్కెట్‌లోకి రావడంతో కుమ్మరుల నుంచి మట్టి కుండలు, పాత్రలు కొనేవారు కరువయ్యారు. ఇలాంటి పరిస్థితిలో ఆనాటి రిషివ్యాలీ స్కూల్‌ క్రాఫ్ట్‌ టీచర్‌ విక్రమ్‌ పర్చూరే వీరి పాలిట ఆశాజ్యోతిగా మారారు. ఆయనే రాష్ట్రంలో టెర్రకోట ప్రక్రియకు ఆద్యుడని చెప్పకతప్పదు. 

తొలుత కురబలకోట మండలంలోని దుర్గం పెద్ద వెంకట్రమణ, అసనాపురం రామయ్యలకు ఈయన టెర్రకోట ప్రక్రియలో కుండలు, బొమ్మలు చేయడం నేర్పించాడు. వారి ద్వారా ఇవి వారసత్వంగా ఇప్పుడు బహుళ ప్రాచుర్యంలోకి వచ్చాయి. అంగళ్లు, కంటేవారిపల్లె, పలమనేరు, సీటీఎం, ఈడిగపల్లె, సదుం, కాండ్లమడుగు, కుమ్మరిపల్లె తదితర ప్రాంతాల్లో ఎందరికో కొత్త జీవితాన్ని ఇస్తున్నాయి. 


ఒకప్పుడు వంట ఇంటకే పరిమితమైన ఇవి నేడు నట్టింట ఇంటీరియర్‌ డెకరేటివ్‌గా మారాయి. పల్లెలు, సంతల్లో అమ్ముడయ్యే ఇవి ఇప్పుడు ఎంచక్కా హైవేపక్కన కొలువు దీరాయి. నగరవాసులను ఆకట్టుకుంటున్నాయి. మట్టితో ఎన్నో కుండలు, బొమ్మలు చేస్తూ కొత్త కళ తెప్పిస్తున్నారు. రాష్ట్రపతి, గవర్నర్ల బంగ్లాలలో తిష్ట వేశాయి. పార్లమెంటు, అసెంబ్లీలలో కూడా ఇవి చోటు సంపాదించుకున్నాయి. ఎగ్జిబిషన్లలో ఆకట్టుకుంటున్నాయి. అదే మట్టి అదే కుమ్మరులు.. కానీ మారిందల్లా పనితనమే. రూపం మార్చారు. దీంతో విలువ పెరిగింది. ఇందుకు ఆధునిక మిషన్లు ఆయుధంగా మారాయి. ఇదే వారికి సరి కొత్తదారిని చూపింది. తక్కువ సమయంలో ఎక్కువ తయారు చేసుకోగలుగుతున్నారు. కుటుంబాలను చక్కదిద్దుకుంటున్నారు. 

కురబలకోట, సీటీఎంకు చెందిన ముగ్గురికి టెర్రకోట కళలో రాష్ట్ర స్థాయి అవార్డులు కూడా వరించాయి. అన్నమయ్య జిల్లాకే మకుటాయమానంగానే కాకుండా సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా కూడా ఇవి నిలుస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో  652 కుటుంబాల దాకా ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. పేదరికం జయించి జీవన ప్రమాణాలు పెంచుకున్నాయి. జీవన శైలి కూడా మారింది.   

ఆధునిక మిషన్లతో తగ్గిన శ్రమ  
పెద్దల కాలం నుంచి మట్టి పిసికి కాళ్లతో తొక్కి సిద్ధం చేసేవారు. దీని వల్ల శారీరక శ్రమ ఎదురయ్యేది. ఒక రోజంతా మట్టి సిద్ధం చేసుకుని మరుసటి రోజున పని మొదలుపెట్టేవారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం డీఆర్‌డీఏ ద్వారా వివిధ రకాల మిషన్లను వీరికి ఉచితంగా అందజేసింది. దీంతో సునాయాసంగా కుండలు, బొమ్మలకు కావాల్సిన మట్టిని సిద్ధం చేసుకోగలుతున్నారు. దశాబ్దాలుగా సారెపై వీటిని చేసేవారు. దీని స్థానంలో పాటరీ వీల్‌ను ఇచ్చారు. ఇది రూ.16 వేలు. కరెంటుతో నడుస్తుంది. కూర్చునే పనిచేయవచ్చు. చక్రం తిప్పే పనిలేదు. ఆన్‌/ఆఫ్‌ బటన్‌ సిస్టమ్‌ ద్వారా పనిచేస్తుంది. 

ప్లగ్‌ వీల్‌ అనే మరో మిషన్‌ కూడా ఇచ్చారు. ఇందులో మట్టి వేస్తే అది కుండలు, బొమ్మలు చేయడానికి అనువుగా మట్టి ముద్ద తయారై వస్తుంది. ఇది రూ.33 వేలు. వీటికి తోడు కొత్తగా క్లే మిక్సర్‌ రోలర్‌ మిషన్‌ వచ్చింది. ఇది రూ.75 వేలు. మట్టి ఇందులో వేస్తే ఇసుక, రాళ్లు లాంటివి కూడా పిండిగా మారి బొమ్మలు, కుండలకు అనువుగా మట్టి తయారవుతుంది. ఇదివరలో మట్టిని సిద్ధం చేసుకోడానికి రోజంతా పట్టేది. ఈ మిషన్‌తో ఇప్పుడు అరగంటలో మట్టి సిద్ధం అవుతోందని టెర్రకోట కళాకారులు సంతోషంగా వెల్లడిస్తున్నారు. ఈ మిషన్లను డీఆర్‌డీఏ కళాకారులకు ఉచితంగా అందజేసింది. సీఎఫ్‌సీ సెంటర్లు కూడా కట్టించి ఇచ్చారు.  

టెర్రకోటతో కొత్త బాట 
టెర్రకోట అంటే కాల్చిన మట్టి అని అర్థం. కుండలు, బొమ్మలు తయారు చేసి వాటిని కాల్చే ప్రక్రియనే టెర్రకోటగా వ్యవహరిస్తున్నారు. పెద్దల కాలంలో సాధారణ మట్టి కుండలు చేసే మాకు టెర్రకోట కొత్త బతుకు బాట చూపింది. వీటిలో ప్రావీణ్యం సాధించిన మేము దేశ విదేశాల్లో శిక్షణ కూడా ఇస్తున్నాం. మాకు ఆస్తిపాస్తులు కూడా లేవు. ఈ వృత్తే ఆధారం. కొత్త జీవనం, కొత్త జీవితాన్ని ఇచ్చింది.      
– దుర్గం మల్లికార్జున, టెర్రకోట కళాకారుల సంఘం నాయకులు, అంగళ్లు   

70 శాతం కష్టం తగ్గింది 
ఈ మిషన్ల ద్వారా 70 శాతం శారీరక కష్టం తగ్గింది. ఇదివరలో మట్టిని.. శుభ్రం చేయడం, నీళ్లు చల్లి కాళ్లతో తొక్కి సిద్ధం చేయాల్సి వచ్చేది. ఇప్పుడా సమస్యే లేదు. మిషన్లతో మట్టిని ముద్ద చేయడం, కుండలు, బొమ్మలకు అనువుగా మట్టిని మార్చుకోవడం ఇప్పుడు గంటలో పని. అధునాతన మిషన్లు మా వృత్తిని సులభతరం చేశాయి. నాణ్యత, నవ్యత పెరిగింది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు. తక్కువ సమయంలో ఎక్కువ కుండలు, బొమ్మలు తయారు చేసుకోగలుగుతున్నాం. నెలకు రూ. 30 వేల నుంచి రూ. 40 వేల దాకా సంపాదించుకోగలుగుతున్నాం.     
– రాజగోపాల్,  రాష్ట్ర అవార్డు గ్రహీత, అంగళ్లు

వీటికే ఎక్కువ డిమాండ్‌ 
టెర్రకోట కళ గురించి తెలియని వారు అరుదు. 250 రకాలు కుండలు, బొమ్మలు చేస్తున్నాం. వీటిలో  మట్టి వంట పాత్రలకు అధిక డిమాండు ఉంది. ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరిగింది. మట్టి పాత్రల్లో వంట శ్రేష్టమని భావిస్తున్నారు. దీంతో వీటికి గిరాకీ పుంజుకుంటోంది. వివిధ నగరాల హోటళ్లకు కూడా బిర్యానీ కుండలు వెళుతున్నాయి. వీటి తర్వాత ఇంటిరియర్‌ డెకరేటివ్‌ పార్ట్స్‌కు, ఆ తర్వాత గార్డెన్‌ ఐటెమ్స్‌కు ఆదరణ ఉంటోంది. 80 శాతం వీటినే ఆదరిస్తున్నారు. కొనుగోలుదారుల అభిరుచులకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు కొత్తదనంతో కుండలు, బొమ్మలు చేస్తున్నాం. బతుకుతెరువుకు ఏ మాత్రం ఢోకా లేదు.      
– డి.కళావతి, టెర్రకోట హస్తకళాకారిణి, అంగళ్లు   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement