machine work
-
Uttarkashi tunnel collapse: డ్రిల్లింగ్కు భారీ అవాంతరం
ఉత్తరకాశీ/న్యూఢిల్లీ: ఒకటి రెండు రోజుల్లో కార్మికులు సొరంగం నుంచి బయటకొస్తారన్న ఆశలకు గండి పడింది. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లా సిల్క్యారా సొరంగం కూలిన ఘటనలో చిక్కుకున్న 41 మంది కార్మికులను కాపాడేందుకు చేస్తున్న ఆగర్ మెషీన్ డ్రిల్లింగ్‌ను నిలిపేశారు. శిథిలాల్లో ఉన్న ఇనుప కడ్డీలు డ్రిల్లింగ్ మెషీన్ బ్లేడ్లను నాశనం చేయడమే ఇందుకు అసలు కారణం. సొరంగం అంతర్గత నిర్మాణంలో వాడిన ఇనుప కడ్డీలు సొరంగం కూలాక శిథిలాల్లో చిందరవందరగా పడి ఆగర్ మెషీన్ ముందుకు కదలకుండా అడ్డుపడుతున్నాయి. దీంతో డ్రిలింగ్ వేళ మెషీన్ బ్లేడ్లన్నీ ధ్వంసమయ్యాయి. డ్రిల్లింగ్ ప్లాన్‌ను పక్కనబెట్టి ఇక మాన్యువల్‌గా తవ్వాలని అధికారులు ప్రాథమిక అంచనాకొచ్చారు. ఇంకా దాదాపు 12 మీటర్లమేర శిథిలాల గుట్టను తొలగించాల్సి ఉంది. ‘‘ఇదంతా తొలగించి కార్మికులను బయటకు తెచ్చేందుకు ఇంకొన్ని రోజులు/వారాలు పట్టొచ్చు’ అంటూ జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ సభ్యుడు, మాజీ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నాయిన్ చేసిన మీడియా ప్రకటన కార్మికుల కుటుంబాల్లో భయాందోళనలు పెంచేసింది. క్రిస్మస్ పండుగ లోపు కార్మికులను రక్షిస్తామంటూ అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు ఆర్నాల్డ్ డిక్స్ చెప్పడంచూస్తుంటే ఈ మొత్తం ప్రక్రియకు నెలరోజులు పట్టేట్టు ఉందని తెలుస్తోంది. ‘ మరో ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధంగా ఉంది. కొండ పైనుంచి నిట్టనిలువునా డ్రిల్లింగ్ వచ్చే 24–36 గంటల్లో మొదలెడతాం’’ అని సయ్యద్ చెప్పారు. ‘ 25 మీటర్ల డ్రిల్లింగ్ పనులు పూర్తిచేసేందుకు హైదరాబాద్ నుంచి ప్లాస్మా కట్టర్‌ను తెప్పిస్తున్నాం’ అని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఘటనాస్థలిలో చెప్పారు. డ్రిల్లింగ్‌ను నిలిపేయడంతో డ్రిల్లింగ్ చోటుదాకా వెళ్లి తాజా పరిస్థితిని ధామీ పర్యవేక్షించారు. లోపలికి ల్యాండ్‌లైన్, ఘటనాస్థలిలో టెలిఫోన్ ఎక్సే్ఛంజ్ ప్రస్తుతానికి కార్మికులు క్షేమంగా ఉన్నారు. అయితే లోపల ఉన్న కార్మికుల మానసిక స్తైర్థ్యం దెబ్బతినకుండా ఉండేందుకు సహాయకంగా లూడో వంటి బోర్డ్ ఆట వస్తువులతోపాటు మొబైల్ ఫోన్లను పంపించారు. నిరంతరం మాట్లాడేందుకు వీలుగా ‘ల్యాండ్‌లైన్’ను పంపుతున్నారు. ఇప్పటికే ఘటనాస్థలిలో టెలిఫోన్ ఎక్సే్ఛంజ్‌ను బీఎస్ఎన్ఎల్ ఏర్పాటుచేసింది. అక్కడి పరిస్థితిని ప్రత్యక్షంగా చూసేందుకు ఎండోస్కోపిక్ కెమెరాను వాడుతున్నారు. -
టెర్రకోట కళకు ఆధునికత అండ.. అరగంటలో మట్టి సిద్ధం!
కురబలకోట: ఆశావాదికి ఒక దారి మూసుకుపోతే మరో దారి వెల్ కమ్ చెబుతుందంటారు. అన్నమయ్య జిల్లా కుమ్మరుల జీవితాల్లో అదే జరిగింది. 40 ఏళ్ల క్రితం ఆనాటి పెద్దలు మట్టితో కుండలు, కడవలు, బానలు, వంట పాత్రలు తయారు చేసి ఎడ్లబండిపై ఊరూరా తిరిగి అమ్మేవారు. వచ్చిన దాంతో కాలం వెళ్లదీసేవారు. అల్యూమినియం, ఇతర వంట పాత్రలు మార్కెట్లోకి రావడంతో కుమ్మరుల నుంచి మట్టి కుండలు, పాత్రలు కొనేవారు కరువయ్యారు. ఇలాంటి పరిస్థితిలో ఆనాటి రిషివ్యాలీ స్కూల్ క్రాఫ్ట్ టీచర్ విక్రమ్ పర్చూరే వీరి పాలిట ఆశాజ్యోతిగా మారారు. ఆయనే రాష్ట్రంలో టెర్రకోట ప్రక్రియకు ఆద్యుడని చెప్పకతప్పదు. తొలుత కురబలకోట మండలంలోని దుర్గం పెద్ద వెంకట్రమణ, అసనాపురం రామయ్యలకు ఈయన టెర్రకోట ప్రక్రియలో కుండలు, బొమ్మలు చేయడం నేర్పించాడు. వారి ద్వారా ఇవి వారసత్వంగా ఇప్పుడు బహుళ ప్రాచుర్యంలోకి వచ్చాయి. అంగళ్లు, కంటేవారిపల్లె, పలమనేరు, సీటీఎం, ఈడిగపల్లె, సదుం, కాండ్లమడుగు, కుమ్మరిపల్లె తదితర ప్రాంతాల్లో ఎందరికో కొత్త జీవితాన్ని ఇస్తున్నాయి. ఒకప్పుడు వంట ఇంటకే పరిమితమైన ఇవి నేడు నట్టింట ఇంటీరియర్ డెకరేటివ్గా మారాయి. పల్లెలు, సంతల్లో అమ్ముడయ్యే ఇవి ఇప్పుడు ఎంచక్కా హైవేపక్కన కొలువు దీరాయి. నగరవాసులను ఆకట్టుకుంటున్నాయి. మట్టితో ఎన్నో కుండలు, బొమ్మలు చేస్తూ కొత్త కళ తెప్పిస్తున్నారు. రాష్ట్రపతి, గవర్నర్ల బంగ్లాలలో తిష్ట వేశాయి. పార్లమెంటు, అసెంబ్లీలలో కూడా ఇవి చోటు సంపాదించుకున్నాయి. ఎగ్జిబిషన్లలో ఆకట్టుకుంటున్నాయి. అదే మట్టి అదే కుమ్మరులు.. కానీ మారిందల్లా పనితనమే. రూపం మార్చారు. దీంతో విలువ పెరిగింది. ఇందుకు ఆధునిక మిషన్లు ఆయుధంగా మారాయి. ఇదే వారికి సరి కొత్తదారిని చూపింది. తక్కువ సమయంలో ఎక్కువ తయారు చేసుకోగలుగుతున్నారు. కుటుంబాలను చక్కదిద్దుకుంటున్నారు. కురబలకోట, సీటీఎంకు చెందిన ముగ్గురికి టెర్రకోట కళలో రాష్ట్ర స్థాయి అవార్డులు కూడా వరించాయి. అన్నమయ్య జిల్లాకే మకుటాయమానంగానే కాకుండా సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా కూడా ఇవి నిలుస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 652 కుటుంబాల దాకా ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. పేదరికం జయించి జీవన ప్రమాణాలు పెంచుకున్నాయి. జీవన శైలి కూడా మారింది. ఆధునిక మిషన్లతో తగ్గిన శ్రమ పెద్దల కాలం నుంచి మట్టి పిసికి కాళ్లతో తొక్కి సిద్ధం చేసేవారు. దీని వల్ల శారీరక శ్రమ ఎదురయ్యేది. ఒక రోజంతా మట్టి సిద్ధం చేసుకుని మరుసటి రోజున పని మొదలుపెట్టేవారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం డీఆర్డీఏ ద్వారా వివిధ రకాల మిషన్లను వీరికి ఉచితంగా అందజేసింది. దీంతో సునాయాసంగా కుండలు, బొమ్మలకు కావాల్సిన మట్టిని సిద్ధం చేసుకోగలుతున్నారు. దశాబ్దాలుగా సారెపై వీటిని చేసేవారు. దీని స్థానంలో పాటరీ వీల్‌ను ఇచ్చారు. ఇది రూ.16 వేలు. కరెంటుతో నడుస్తుంది. కూర్చునే పనిచేయవచ్చు. చక్రం తిప్పే పనిలేదు. ఆన్/ఆఫ్ బటన్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది. ప్లగ్ వీల్ అనే మరో మిషన్ కూడా ఇచ్చారు. ఇందులో మట్టి వేస్తే అది కుండలు, బొమ్మలు చేయడానికి అనువుగా మట్టి ముద్ద తయారై వస్తుంది. ఇది రూ.33 వేలు. వీటికి తోడు కొత్తగా క్లే మిక్సర్ రోలర్ మిషన్ వచ్చింది. ఇది రూ.75 వేలు. మట్టి ఇందులో వేస్తే ఇసుక, రాళ్లు లాంటివి కూడా పిండిగా మారి బొమ్మలు, కుండలకు అనువుగా మట్టి తయారవుతుంది. ఇదివరలో మట్టిని సిద్ధం చేసుకోడానికి రోజంతా పట్టేది. ఈ మిషన్‌తో ఇప్పుడు అరగంటలో మట్టి సిద్ధం అవుతోందని టెర్రకోట కళాకారులు సంతోషంగా వెల్లడిస్తున్నారు. ఈ మిషన్లను డీఆర్డీఏ కళాకారులకు ఉచితంగా అందజేసింది. సీఎఫ్‌సీ సెంటర్లు కూడా కట్టించి ఇచ్చారు. టెర్రకోటతో కొత్త బాట టెర్రకోట అంటే కాల్చిన మట్టి అని అర్థం. కుండలు, బొమ్మలు తయారు చేసి వాటిని కాల్చే ప్రక్రియనే టెర్రకోటగా వ్యవహరిస్తున్నారు. పెద్దల కాలంలో సాధారణ మట్టి కుండలు చేసే మాకు టెర్రకోట కొత్త బతుకు బాట చూపింది. వీటిలో ప్రావీణ్యం సాధించిన మేము దేశ విదేశాల్లో శిక్షణ కూడా ఇస్తున్నాం. మాకు ఆస్తిపాస్తులు కూడా లేవు. ఈ వృత్తే ఆధారం. కొత్త జీవనం, కొత్త జీవితాన్ని ఇచ్చింది. – దుర్గం మల్లికార్జున, టెర్రకోట కళాకారుల సంఘం నాయకులు, అంగళ్లు 70 శాతం కష్టం తగ్గింది ఈ మిషన్ల ద్వారా 70 శాతం శారీరక కష్టం తగ్గింది. ఇదివరలో మట్టిని.. శుభ్రం చేయడం, నీళ్లు చల్లి కాళ్లతో తొక్కి సిద్ధం చేయాల్సి వచ్చేది. ఇప్పుడా సమస్యే లేదు. మిషన్లతో మట్టిని ముద్ద చేయడం, కుండలు, బొమ్మలకు అనువుగా మట్టిని మార్చుకోవడం ఇప్పుడు గంటలో పని. అధునాతన మిషన్లు మా వృత్తిని సులభతరం చేశాయి. నాణ్యత, నవ్యత పెరిగింది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు. తక్కువ సమయంలో ఎక్కువ కుండలు, బొమ్మలు తయారు చేసుకోగలుగుతున్నాం. నెలకు రూ. 30 వేల నుంచి రూ. 40 వేల దాకా సంపాదించుకోగలుగుతున్నాం. – రాజగోపాల్, రాష్ట్ర అవార్డు గ్రహీత, అంగళ్లు వీటికే ఎక్కువ డిమాండ్ టెర్రకోట కళ గురించి తెలియని వారు అరుదు. 250 రకాలు కుండలు, బొమ్మలు చేస్తున్నాం. వీటిలో మట్టి వంట పాత్రలకు అధిక డిమాండు ఉంది. ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరిగింది. మట్టి పాత్రల్లో వంట శ్రేష్టమని భావిస్తున్నారు. దీంతో వీటికి గిరాకీ పుంజుకుంటోంది. వివిధ నగరాల హోటళ్లకు కూడా బిర్యానీ కుండలు వెళుతున్నాయి. వీటి తర్వాత ఇంటిరియర్ డెకరేటివ్ పార్ట్స్‌కు, ఆ తర్వాత గార్డెన్ ఐటెమ్స్‌కు ఆదరణ ఉంటోంది. 80 శాతం వీటినే ఆదరిస్తున్నారు. కొనుగోలుదారుల అభిరుచులకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు కొత్తదనంతో కుండలు, బొమ్మలు చేస్తున్నాం. బతుకుతెరువుకు ఏ మాత్రం ఢోకా లేదు. – డి.కళావతి, టెర్రకోట హస్తకళాకారిణి, అంగళ్లు -
కాంక్రీట్ మిల్లర్‌లో నలిగిన మహిళ తల
ఆమదాలవలస : పట్టణంలోని సాగర్ డిగ్రీ కళాశాల పక్కన జరుగుతున్న గృహ నిర్మాణం వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. భవన నిర్మాణ పనులు వద్ద జరిగిన ప్రమాదంలో భవన నిర్మాణ కార్మికురాలు మృతి చెందింది. స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మున్సిపాలిటీ పరిధి ఒకటో వార్డు జగ్గుశాస్త్రులపేటకు చెందిన దండుపాటి లక్ష్మి(40) భవన నిర్మాణ కార్మికురాలిగా పనిచేస్తోంది. పట్టణంలోని ఎస్.అప్పలనాయుడు గృహ నిర్మాణ పనులకు శుక్రవారం ఉదయం ఆమె వచ్చింది. మధ్యాహ్నం సమయంలో కాంక్రీట్ కలుపుతున్న మిల్లర్ వద్ద ఆమె పనిచేస్తుండగా తన తలకు చుట్టుకుని ఉన్న చుమ్మ(క్లాత్) ప్రమాదవశాత్తు మిల్లర్‌లోకి లాగేసింది. ఆ క్లాత్‌తో పాటు ఆమె జుత్తు కూడా యంత్రంలోకి లాగేసి తల మొత్తం యంత్రంలో చిదిమేసింది. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. గృహ యజమాని 108కు సమాచారం అందించాడు. ఆ వాహనం వచ్చేలోపే ఆమె ప్రాణాలు విడిచిపెట్టడంతో చేసేది లేక వైద్య సిబ్బంది వెనుదిరిగారు. అప్పటివరకూ సరదాగా గడిపి... అప్పటివరకు తమతో సరదాగా మాట్లాడుతూ గడిపిన లక్ష్మి ఒక్కసారిగా ఇలా ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోవడంతో తోటి కార్మికులు, కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం కావడంతో భర్త రాముతో పాటు లక్ష్మి నిత్యం కూలీ పనులకు వెళ్తుంది. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె రాజేశ్వరికి వివాహం కాగా కుమారుడు షణ్ముఖరావు పట్టణంలో ఐటీఐ చదువుతున్నాడు. చిన్న కుమార్తె తేజేశ్వరి మండలంలోని అక్కులపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవతరగతి చదివి, ఇటీవల వచ్చిన ఫలితాల్లో పాసైంది. తమ తల్లి మరణవార్త విన్న పిల్లలు తల్లడిల్లిపోయి కన్నీరుమున్నీరై విలపిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. అయితే విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ జి.వాసుదేవరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును కార్మికులు, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. -
మంత్రం కాదిది.. యంత్రం
జీలుగుమిల్లి : డ్రైవర్ లేకుండా వాహనం అటూఇటూ తిరుగుతుంటే స్థానికులు సంభ్రమాశ్చర్యాలతో తిలకించారు. రిమోట్‌తోనే వాహనం, దానికి అనుసంధానంగా ఉన్న యంత్రం పనిచేస్తుంటే ఆసక్తిగా గమనించారు. బుధవారం రిమోట్ ఆపరేటింగ్‌తో పనులు చేసే వాహనం జీలుగుమిల్లి జాతీయ రహదారిపై ఇలా హల్చల్ చేసింది. జీలుగుమిల్లి జంగారెడ్డిగూడెం రూట్లో రిలయన్స్ ఓఎఫ్‌పీ కేబుల్ పనులు చేసే యంత్రం( వెర్మర్ డి 24ఎక్స్40)స్థానికులను ఇలా ఆకట్టుకుంది. ఆపరేటర్ కేవలం రిమోట్‌తో వాహనం, యంత్రాన్ని పనిచేయించడంతో స్థానికులు ఆసక్తిగా తిలకించారు.