ఉత్తరకాశీ/న్యూఢిల్లీ: ఒకటి రెండు రోజుల్లో కార్మికులు సొరంగం నుంచి బయటకొస్తారన్న ఆశలకు గండి పడింది. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లా సిల్‌క్యారా సొరంగం కూలిన ఘటనలో చిక్కుకున్న 41 మంది కార్మికులను కాపాడేందుకు చేస్తున్న ఆగర్ మెషీన్ డ్రిల్లింగ్‌ను నిలిపేశారు. శిథిలాల్లో ఉన్న ఇనుప కడ్డీలు డ్రిల్లింగ్ మెషీన్ బ్లేడ్లను నాశనం చేయడమే ఇందుకు అసలు కారణం.
సొరంగం అంతర్గత నిర్మాణంలో వాడిన ఇనుప కడ్డీలు సొరంగం కూలాక శిథిలాల్లో చిందరవందరగా పడి ఆగర్ మెషీన్ ముందుకు కదలకుండా అడ్డుపడుతున్నాయి. దీంతో డ్రిలింగ్ వేళ మెషీన్ బ్లేడ్లన్నీ ధ్వంసమయ్యాయి. డ్రిల్లింగ్ ప్లాన్‌ను పక్కనబెట్టి ఇక మాన్యువల్‌గా తవ్వాలని అధికారులు ప్రాథమిక అంచనాకొచ్చారు. ఇంకా దాదాపు 12 మీటర్లమేర శిథిలాల గుట్టను తొలగించాల్సి ఉంది.
‘‘ఇదంతా తొలగించి కార్మికులను బయటకు తెచ్చేందుకు ఇంకొన్ని రోజులు/వారాలు పట్టొచ్చు’ అంటూ జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ సభ్యుడు, మాజీ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నాయిన్ చేసిన మీడియా ప్రకటన కార్మికుల కుటుంబాల్లో భయాందోళనలు పెంచేసింది. క్రిస్మస్ పండుగ లోపు కార్మికులను రక్షిస్తామంటూ అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు ఆర్నాల్డ్ డిక్స్ చెప్పడంచూస్తుంటే ఈ మొత్తం ప్రక్రియకు నెలరోజులు పట్టేట్టు ఉందని తెలుస్తోంది. ‘ మరో ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధంగా ఉంది.
కొండ పైనుంచి నిట్టనిలువునా డ్రిల్లింగ్ వచ్చే 24–36 గంటల్లో మొదలెడతాం’’ అని సయ్యద్ చెప్పారు. ‘ 25 మీటర్ల డ్రిల్లింగ్ పనులు పూర్తిచేసేందుకు హైదరాబాద్ నుంచి ప్లాస్మా కట్టర్‌ను తెప్పిస్తున్నాం’ అని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఘటనాస్థలిలో చెప్పారు. డ్రిల్లింగ్‌ను నిలిపేయడంతో డ్రిల్లింగ్ చోటుదాకా వెళ్లి తాజా పరిస్థితిని ధామీ పర్యవేక్షించారు.
లోపలికి ల్యాండ్‌లైన్, ఘటనాస్థలిలో టెలిఫోన్ ఎక్సే్ఛంజ్
ప్రస్తుతానికి కార్మికులు క్షేమంగా ఉన్నారు. అయితే లోపల ఉన్న కార్మికుల మానసిక స్తైర్థ్యం దెబ్బతినకుండా ఉండేందుకు సహాయకంగా లూడో వంటి బోర్డ్ ఆట వస్తువులతోపాటు మొబైల్ ఫోన్లను పంపించారు. నిరంతరం మాట్లాడేందుకు వీలుగా ‘ల్యాండ్‌లైన్’ను పంపుతున్నారు. ఇప్పటికే ఘటనాస్థలిలో టెలిఫోన్ ఎక్సే్ఛంజ్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ ఏర్పాటుచేసింది. అక్కడి పరిస్థితిని ప్రత్యక్షంగా చూసేందుకు ఎండోస్కోపిక్ కెమెరాను వాడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment