drilling works
-
Uttarkashi tunnel collapse: డ్రిల్లింగ్కు భారీ అవాంతరం
ఉత్తరకాశీ/న్యూఢిల్లీ: ఒకటి రెండు రోజుల్లో కార్మికులు సొరంగం నుంచి బయటకొస్తారన్న ఆశలకు గండి పడింది. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లా సిల్క్యారా సొరంగం కూలిన ఘటనలో చిక్కుకున్న 41 మంది కార్మికులను కాపాడేందుకు చేస్తున్న ఆగర్ మెషీన్ డ్రిల్లింగ్‌ను నిలిపేశారు. శిథిలాల్లో ఉన్న ఇనుప కడ్డీలు డ్రిల్లింగ్ మెషీన్ బ్లేడ్లను నాశనం చేయడమే ఇందుకు అసలు కారణం. సొరంగం అంతర్గత నిర్మాణంలో వాడిన ఇనుప కడ్డీలు సొరంగం కూలాక శిథిలాల్లో చిందరవందరగా పడి ఆగర్ మెషీన్ ముందుకు కదలకుండా అడ్డుపడుతున్నాయి. దీంతో డ్రిలింగ్ వేళ మెషీన్ బ్లేడ్లన్నీ ధ్వంసమయ్యాయి. డ్రిల్లింగ్ ప్లాన్‌ను పక్కనబెట్టి ఇక మాన్యువల్‌గా తవ్వాలని అధికారులు ప్రాథమిక అంచనాకొచ్చారు. ఇంకా దాదాపు 12 మీటర్లమేర శిథిలాల గుట్టను తొలగించాల్సి ఉంది. ‘‘ఇదంతా తొలగించి కార్మికులను బయటకు తెచ్చేందుకు ఇంకొన్ని రోజులు/వారాలు పట్టొచ్చు’ అంటూ జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ సభ్యుడు, మాజీ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నాయిన్ చేసిన మీడియా ప్రకటన కార్మికుల కుటుంబాల్లో భయాందోళనలు పెంచేసింది. క్రిస్మస్ పండుగ లోపు కార్మికులను రక్షిస్తామంటూ అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు ఆర్నాల్డ్ డిక్స్ చెప్పడంచూస్తుంటే ఈ మొత్తం ప్రక్రియకు నెలరోజులు పట్టేట్టు ఉందని తెలుస్తోంది. ‘ మరో ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధంగా ఉంది. కొండ పైనుంచి నిట్టనిలువునా డ్రిల్లింగ్ వచ్చే 24–36 గంటల్లో మొదలెడతాం’’ అని సయ్యద్ చెప్పారు. ‘ 25 మీటర్ల డ్రిల్లింగ్ పనులు పూర్తిచేసేందుకు హైదరాబాద్ నుంచి ప్లాస్మా కట్టర్‌ను తెప్పిస్తున్నాం’ అని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఘటనాస్థలిలో చెప్పారు. డ్రిల్లింగ్‌ను నిలిపేయడంతో డ్రిల్లింగ్ చోటుదాకా వెళ్లి తాజా పరిస్థితిని ధామీ పర్యవేక్షించారు. లోపలికి ల్యాండ్‌లైన్, ఘటనాస్థలిలో టెలిఫోన్ ఎక్సే్ఛంజ్ ప్రస్తుతానికి కార్మికులు క్షేమంగా ఉన్నారు. అయితే లోపల ఉన్న కార్మికుల మానసిక స్తైర్థ్యం దెబ్బతినకుండా ఉండేందుకు సహాయకంగా లూడో వంటి బోర్డ్ ఆట వస్తువులతోపాటు మొబైల్ ఫోన్లను పంపించారు. నిరంతరం మాట్లాడేందుకు వీలుగా ‘ల్యాండ్‌లైన్’ను పంపుతున్నారు. ఇప్పటికే ఘటనాస్థలిలో టెలిఫోన్ ఎక్సే్ఛంజ్‌ను బీఎస్ఎన్ఎల్ ఏర్పాటుచేసింది. అక్కడి పరిస్థితిని ప్రత్యక్షంగా చూసేందుకు ఎండోస్కోపిక్ కెమెరాను వాడుతున్నారు. -
Uttarkashi tunnel collapse: సొరంగం పనులకు మళ్లీ ఆటంకం
ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్‌లోని సిల్ క్యారా సొరంగంలో 12 రోజులుగా చిక్కుకుపోయిన కార్మికులను రక్షించే పనులకు శుక్రవారం మళ్లీ అవరోధం ఏర్పడింది. గురువారం సాంకేతిక సమస్యల కారణంగా నిలిచిపోయిన డ్రిల్లింగ్‌ను 25 టన్నుల భారీ ఆగర్ యంత్రంతో శుక్రవారం తిరిగి ప్రారంభించారు. అయితే, కొద్దిసేపటికే మరోసారి సమస్యలు రావడంతో నిలిపివేశారు. వాటిని సరిచేసి మళ్లీ పనులు ప్రారంభించినా గంటలోనే మళ్లీ అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. కూలిన శిథిలాల గుండా సొరంగంలోకి ఒకదానికొకటి వెల్డింగ్‌తో కలిపిన స్టీలు పైపులను పంపించి, వాటిగుండా కార్మికులను వెలుపలికి తీసుకు వచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. రెండు రోజులుగా ఏర్పడుతున్న అంతరాయాలు టన్నెల్ వద్ద ఆత్రుతగా ఎదురుచూస్తున్న కార్మికుల సంబంధీకుల్లో ఆందోళన రేపుతోంది. అయితే, మిగిలి ఉన్న 5.4 మీటర్ల మేర శిథిలాల్లో డ్రిల్లింగ్కు అవరోధాలు ఎదురుకాకపోవచ్చని ప్రత్యేక రాడార్ ద్వారా తెలిసిందని అధికారులు తెలిపారు. ఇలా ఉండగా, టన్నెల్ నుంచి వెలుపలికి వచ్చాక కార్మికులకు వైద్య పరీక్షలు చేసి, ఆ వెంటనే గ్రీన్ కారిడార్ ద్వారా ఆస్పత్రులకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు గఢ్వాల్ రేంజ్ ఐజీ కేఎస్ నంగ్యాల్ చెప్పారు. -
Uttarakhand Tunnel Crash: తుది దశకు రెస్క్యూ ఆపరేషన్
ఉత్తరకాశీ/న్యూఢిల్లీ: పది రోజులకుపైగా సిల్క్యారా సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను సురక్షితంగా బయటకుతెచ్చే డ్రిల్లింగ్ పనులు తుది దశకు చేరుకున్నాయి. దేశ, విదేశీ నిపుణుల పర్యవేక్షణలో కొనసాగుతున్న సహాయక, డ్రిల్లింగ్ పనుల్లో భారీ పురోగతి కనిపిస్తోందని అక్కడి వర్గాలు వెల్లడించాయి. ఉత్తరాఖండ్‌లోని ఛార్‌ధామ్ ప్రాజెక్టులో భాగంగా సిల్క్యారా వద్ద కొండను తవ్వుతుండగా లోపల 57 మీటర్లమేర సొరంగం కూలిందని సహాయక బృందాలు అంచనావేస్తున్నాయి. ఇందులో ఇప్పటికే 39 మీటర్లమేర తవ్వగా బుధవారం సాయంత్రానికి మరో ఆరు మీటర్ల మేర డ్రిల్లింగ్ చేసి ‘సహాయక’పైపును విజయవంతంగా జొప్పించారు. వీరి అంచనా ప్రకారం మరో 12 మీటర్లు తవ్వితే కారి్మకులు చిక్కుకున్న చోటుకు పైపు చేరుకోవచ్చు. దాదాపు మీటరు వ్యాసమున్న ఈ స్టీల్ పైపులోంచి కారి్మకులను బయటకు తీసుకురావాలని ప్రణాళిక సిద్దంచేసిన సంగతి తెల్సిందే. కార్మికులను బయటకు రాగానే వారికి అత్యవసర ప్రథమ చికిత్స అందించేందుకు ఛాతి డాక్టర్లతో కూడిన 14 మంది వైద్య బృందాన్ని ఘటనాస్థలి వద్ద సిద్ధంగా ఉంచారు. 12 అంబులెన్సులను, 41 పడకల తాత్కాలిక ఆస్పత్రిని సిద్ధంచేశారు. మరీ అత్యవసరమనుకుంటే వారిని వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి ఆగమేఘాల మీద తరలించేందుకు హెలీకాప్టర్‌ను తెప్పించనున్నట్లు సమాచారం. బగ్వాల్ పండుగ వారితోనూ చేసుకుందాం ‘‘డ్రిల్లింగ్ విజయవంతంగా కొనసాగుతోంది. వారిని సురక్షితంగా బయటకు తీసుకొస్తాం. వారితో కలిసే స్థానిక బగ్లాల్ పండగ జరుపుకుందాం’’ అని ప్రధాని కార్యాలయం మాజీ సలహాదారు భాస్కర్ ఖుల్బే ఘటనాస్థలి వ్యాఖ్యానించారు. దీపావళి పండగ తర్వాత స్థానిక గర్వాల్ ప్రాంతంలో బగ్వాల్ పండగ జరుపుకోవడం ఆనవాయితీ. అక్కడి బగ్వాల్ను ఈ ఏడాది గురువారం జరుపుకుంటున్నారు. మరోవైపు, రెస్క్యూ ఆపరేషన్ పురోగతిపై రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీతో ప్రధాని మోదీ బుధవారం మాట్లాడారు. సొరంగంలో కూలింది ఎక్కడ ? సిల్క్యారా బెండ్ నుంచి మొదలుపెట్టి బార్కోట్ వరకు కొండ కింద 4.531 కి.మీ.ల మేర సొరంగం తవ్వుతున్నారు. సిల్క్యారా వైపు నుంచి 2.340 కి.మీ.ల మేర సొరంగం తవ్వకం, అంతర్గత నిర్మాణం పూర్తయింది. సొరంగం ముఖద్వారం నుంచి దాదాపు 205–260 మీటర్ల మార్క్ వద్ద దాదాపు 57 మీటర్ల పొడవునా సొరంగం కూలింది. అదే సమయంలో ఆ మార్క్ దాటి సొరంగం లోపలి వైపుగా కార్మికులు పనిలో ఉన్నారు. అంటే దాదాపు రెండు కిలోమీటర్ల మేర విశాలమైన ప్రాంతంలో కార్మికులు చిక్కుకుపోయారు. 57 మీటర్ల వెడలై్పన శిథిలాలున్నాయి. ఇంతే వెడల్పున శిథిలాల గుండా పైపును జొప్పించి వారిని బయటకు తెచ్చేందుకు యతి్నస్తున్నారు. -
Uttarakhand Tunnel Crash: కొండ పైనుంచి టన్నెల్లోకి రంధ్రం
ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో సిల్క్యారా సొరంగం కూలి అప్పుడే ఏడు రోజులైంది. లోపల చిక్కుకున్న 40 మంది కార్మికుల భద్రతపై ఆందోళనలు తీవ్రమవుతుండగా, అధికారులు మరో ప్రత్యామ్నాయాన్ని ముందుకు తెచ్చారు. శుక్రవారం నిలిపివేసిన అమెరికన్ ఆగర్ యంత్రం డ్రిల్లింగ్ పనులను మళ్లీ ప్రారంభించారు. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్(బీఆర్వో) రూపొందించిన తాజా ప్రణాళిక ప్రకారం..సొరంగం నిర్మాణ పనులు సాగుతున్న కొండ పైనుంచి సొరంగంలోకి సమాంతరంగా రంధ్రం చేయాల్సి ఉంది. కొండ పైనుంచి 1,000 నుంచి 11,00 మీటర్ల పొడవైన రంధ్రం చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే పనులు ప్రారంభించాం. రేపు మధ్యాహ్నం కల్లా ఇది సిద్ధమవుతుంది’అని బీఆర్వోకు చెందిన మేజర్ నమన్ నరులా చెప్పారు. ‘ముందుగా 4–6 అంగుళాల రంధ్రాన్ని తొలిచి లోపల చిక్కుబడిపోయిన వారికి అత్యవసరాలను అందిస్తాం. పరిస్థితులు అనుకూలిస్తే మూడడుగుల వెడల్పుండే రంధ్రాన్ని 900 మీటర్ల పొడవున తొలుస్తాం. దీని గుండా లోపలున్న వారు కూడా బయటకు చేరుకోవచ్చు’అని బోర్డర్ రోడ్స్ డీజీ ఆర్ఎస్ రావు చెప్పారు. ప్రధానమంత్రి కార్యాలయం అధికారుల బృందం కూడా ఘటనాస్థలానికి చేరుకుంది. కార్మికులను కాపాడేందుకు నిపుణులు వివిధ రకాలైన అయిదు ప్రణాళికలను సిద్ధం చేసినట్లు ప్రధాని మాజీ సలహాదారు, ప్రస్తుతం ఉత్తరాఖండ్ ప్రభుత్వ ఓఎస్డీ భాస్కర్ ఖుల్బే చెప్పారు. ఇలా ఉండగా, శిథిలాల నుంచి డ్రిల్లింగ్‌ను మరింత సమర్థంగా కొనసాగించేందుకు శనివారం ఇండోర్ నుంచి ఒక యంత్రాన్ని తీసుకువచ్చారు. దీనిని కూడా బిగించి, డ్రిల్లింగ్ కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. డ్రిల్లింగ్ పనులు మళ్లీ మొదలు: శుక్రవారం మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో అయిదో పైపును లోపలికి పంపేందుకు డ్రిల్లింగ్ పనులు సాగుతుండగా సొరంగంలో ఒక్కసారిగా పెళ్లుమనే శబ్దం వినిపించింది. దీంతో, వెంటనే పనులను నిలిపివేశామని అధికారులు తెలిపారు. ఈ శబ్ధం సహాయక చర్యల్లో నిమగ్నమైన సిబ్బందిలో వణుకు పుట్టించింది. డ్రిల్లింగ్‌ను కొనసాగిస్తే టన్నెల్ మరింతగా కూలే ప్రమాదముందని నిపుణుడొకరు చెప్పారు. మొత్తం 60 మీటర్లకు గాను 24 మీటర్లలో శిథిలాల గుండా డ్రిల్లింగ్ పూర్తయిందన్నారు. ఇలా ఉండగా, సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల సంఖ్య 41గా తేలినట్లు అధికారులు వివరించారు. బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాకు చెందిన దీపక్ కుమార్ కూడా లోపలే ఉండిపోయారని అన్నారు. -
Uttarkashi tunnel collapse: నెమ్మదించిన రెస్క్యూ ఆపరేషన్
ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్‌లోని ఛార్‌ధామ్ మార్గంలో సొరంగం కుప్పకూలి నాలుగు రోజులుగా లోపల చిక్కుబడిపోయిన 40 మంది కార్మికులను రక్షించే పనులను అధికారులు వేగవంతం చేశారు. ఇందుకోసం మరో భారీ యంత్రాన్ని తెప్పించారు. మూడు విడిభాగాలుగా యుద్ధవిమానాల్లో తరలించిన ఈ యంత్రాన్ని అసెంబుల్ చేసి, మరికొద్ది గంటల్లో డ్రిల్లింగ్ ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. కుప్పకూలిన టన్నెల్ శిథిలాల గుండా ఆగర్ మెషీన్ సాయంతో వెడల్పాటి స్టీల్ పైపులను లోపలికి పంపే పనులు అధికారులు మంగళవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. 800, 900 మిల్లీమీటర్ల వ్యాసమున్న స్టీలు పైపులను ఒకదాని తర్వాత ఒకటి లోపలికి పంపించి వాటి గుండా కార్మికులను వెలుపలికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అయితే, రాత్రి వేళ డ్రిల్లింగ్ పనులు జరుగుతున్న సమయంలో మరోసారి టన్నెల్ శిథిలాలు విరిగిపడటంతో ఇద్దరు సిబ్బంది గాయపడ్డారు. ఈ ఘటనతో పనులకు అంతరాయం ఏర్పడింది. రంగంలోకి అమెరికన్ ఆగర్ అధికారులు హుటాహుటిన భారీ అమెరికన్ ఆగర్ డ్రిల్లింగ్ మిషన్ భాగాలను భారత వాయుసేన విమానాల ద్వారా 30 కిలోమీటర్ల దగ్గర్లోని చిన్యాలిసౌర్‌కు తెప్పించారు. అక్కడి నుంచి ఘటనాస్థలికి రోడ్డు మార్గంలో తీసుకువస్తున్నామని ఎస్పీ అర్పణ్ తెలిపారు. వీటిని అసెంబ్లింగ్ చేసి, పనులు ప్రారంభిస్తామని చెప్పారు. సొరంగం లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు థాయ్‌లాండ్, నార్వే నిపుణుల సలహాలను తీసుకుంటున్నట్లు నేషనల్ హైవేస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్(ఎన్‌హెచ్‌ఐడి) డైరెక్టర్ అన్షు మాలిక్ తెలిపారు. 2018లో థాయ్‌లాండ్‌లోని ఓ గుహలో చిక్కుకుపోయిన ఫుట్‌బాల్ జట్టు జూనియర్ ఆటగాళ్లను అక్కడి సంస్థ నిపుణులు వారం పాటు శ్రమించి సురక్షితంగా తీసుకువచి్చన విషయం తెలిసిందే. -
సొరంగం కుప్పకూలిన ఘటన.. డ్రిల్లింగ్ పనుల్లో అంతరాయం
ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్‌లోని ఛార్‌ధామ్ మార్గంలో సొరంగం కుప్పకూలి 60 గంటలకు పైగా లోపల చిక్కుబడిపోయిన 40 మంది కార్మికులను రక్షించే పనుల్లో మంగళవారం రాత్రి అంతరాయం ఏర్పడింది. కుప్పకూలిన టన్నెల శిథిలాల గుండా ఆగర్ మెషీన్ సాయంతో వెడల్పాటి స్టీల్ పైపులను లోపలికి పంపే పనులు మంగళవారం మొదలైనట్లు తెలిపారు. డ్రిల్లింగ్ పరికరాలను ఉపయోగించి 800, 900 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన స్టీలు పైపులను ఒకదాని తర్వాత ఒకటి లోపలికి పంపించి వాటి గుండా కార్మికులను వెలుపలికి తీసుకురావడమే ఈ పథకం ఉద్దేశమన్నారు. అన్నీ సజావుగా సాగితే బుధవారాని కల్లా అందరినీ వెలుపలికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. అయితే, రాత్రి వేళ డ్రిల్లింగ్ పనులు జరుగుతున్న సమయంలో మరోసారి టన్నెల్ శిథిలాలు విరిగిపడటంతో ఇద్దరు సిబ్బంది గాయపడ్డారు. వారిని వెంటనే అక్కడే ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. క్షతగాత్రులకు ఎలాంటి ప్రమాదం లేనప్పటికీ పనులకు మాత్రం అంతరాయం ఏర్పడిందని అధికారులు చెప్పారు. ఎటువంటి అపాయం లేదు సొరంగం లోపల చిక్కుకున్న కారి్మకులకు ఆక్సిజన్, మంచి నీరు, టీ, ఆహారం ప్యాకెట్లు, మందులను ట్యూబుల ద్వారా లోపలికి పంపిస్తున్నామని అధికారులు వివరించారు. కార్మికులు 400 మీటర్ల వెడల్పుండే బఫర్ జోన్లో చిక్కుబడి పోయారన్నారు. వారు తేలిగ్గా, నడవొచ్చు, గాలి పీల్చుకోవచ్చు అని వివరించారు. అందరూ ఆరోగ్యంగా, చురుగ్గా ఉన్నారన్నారు. ఛార్‌ధామ్ ప్రాజెక్టులో భాగంగా బ్రహ్మఖాల్–యమునోత్రి జాతీయ రహదారిలో సిల్క్యారా– దండల్గావ్ మధ్య నిర్మిస్తున్న సొరంగం ఆదివారం ఉదయం సిల్క్యారా వైపు కూలిన విషయం తెలిసిందే. సొరంగంలో చిక్కుబడిన వారిలో బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన వలస కార్మికులున్నారు. ధైర్యంగా ఉండండి టన్నెల్లో చిక్కుబడిపోయిన 40 మందిలో ఒకరైన ఉత్తరాఖండ్‌కు చెందిన కార్మికుడితో ఆయన కుమారుడు కొద్ది సెకన్ల పాటు మాట్లాడి యోగక్షేమాలను తెలుసుకున్నాడు. భయపడాల్సిన అవసరం లేదని, తనతోపాటు ఉన్న తోటి వారికి కూడా ధైర్యం చెబుతున్నానని అతడు పేర్కొన్నాడు. సొరంగం కుప్పకూలడంతో ఆదివారం ఉదయం నుంచి లోపలే ఉండిపోయిన 40 మందిలో ఉత్తరాఖండ్‌లోని కొట్‌ద్వార్‌కు చెందిన గబ్బర్ సింగ్ నేగి కూడా ఉన్నారు. నేగి సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. ఘటనా స్థలి వద్దకు మంగళవారం ఉదయం నేగి కొడుకు ఆకాశ్, అన్న మహరాజ్ చేరుకున్నాడు. అధికారులు పైపు ద్వారా ఆకాశ్‌కు తండ్రితో మాట్లాడే అవకాశం కల్పించారు. తమకు ఆక్సిజన్ అందుతోందని, భయపడొద్దని కుమారుడికి నేగి ధైర్యం చెప్పారు. ఇంట్లో వాళ్లకి కూడా ఇదే విషయం చెప్పాలని కోరారు. ‘సొరంగం కూలిన ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. మాకు చాలినంత ఆహారం, నీరు అందుతున్నాయి. మరికొద్ది గంటల్లోనే సురక్షితంగా బయటకు వచ్చేందుకు ఇంజినీర్లు కృషి చేస్తున్నారు’అని కూడా నేగి తన కుమారుడికి తెలిపారు. -
రైల్వేలైన్‌పై రెండో బ్రిడ్జి
డ్రిల్లింగ్ పనులు ప్రారంభం మట్టి నమూనాల సేకరణ.. ల్యాబ్‌లో పరీక్ష తర్వాత నిర్మాణ పనులు కాజీపేట: కాజీపేట రైల్వేలైన్‌పై మరో సమాంతర బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, డీప్యూటీ సీఎం కడియం శ్రీహరి కృషికి ఫలితం దక్కింది. జిల్లా ప్రజల చిరకాల వాంఛగా ఉన్న బ్రిడ్జి విస్తరణకు ఇటీవల సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాజీపేట- ఫాతిమానగర్ దారిలో కుడి వైపున బ్రిడ్జి నిర్మిస్తే బాగుంటుందని, భూసేకరణకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు కడియం శ్రీహరి దృష్టికి తీసుకొచ్చారు. కాగా, రాష్ట్రప్రభుత్వ ఆదేశం మేరకు హైవే బ్రిడ్జి సెక్టార్స్ సంస్థ(హెచ్‌బీఎస్), ఇన్ ఫా ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సిబ్బంది బ్రిడ్జి నిర్మాణం కోసం నిర్ధేశించిన స్థలంలో బుధవారం డ్రిల్లింగ్ పనులు ప్రారంభించారు. రెండు కంపెనీల ప్రతినిధులు నాలుగు జట్లుగా విడిపోయి 14 మీటర్ల లోతులో డ్రిల్లింగ్ చేశారు. డ్రిల్లింగ్ చేయడం ద్వారా వచ్చిన మట్టిని వివిధ లోతుల్లో సేకరించి పరీక్ష కోసం హైదరాబాద్‌లోని ఓ ల్యాబ్‌కు పంపనున్నట్లు కంపెనీ ప్రతినిధి సంతోష్ తెలిపారు. పరీక్షల ఫలితాల ఆధారంగా ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించి పనులను ప్రారంభిస్తుందని సంతోష్ సాక్షికి తెలిపారు.