ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్‌లోని సిల్ క్యారా సొరంగంలో 12 రోజులుగా చిక్కుకుపోయిన కార్మికులను రక్షించే పనులకు శుక్రవారం మళ్లీ అవరోధం ఏర్పడింది. గురువారం సాంకేతిక సమస్యల కారణంగా నిలిచిపోయిన డ్రిల్లింగ్‌ను 25 టన్నుల భారీ ఆగర్ యంత్రంతో శుక్రవారం తిరిగి ప్రారంభించారు. అయితే, కొద్దిసేపటికే మరోసారి సమస్యలు రావడంతో నిలిపివేశారు.
వాటిని సరిచేసి మళ్లీ పనులు ప్రారంభించినా గంటలోనే మళ్లీ అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. కూలిన శిథిలాల గుండా సొరంగంలోకి ఒకదానికొకటి వెల్డింగ్‌తో కలిపిన స్టీలు పైపులను పంపించి, వాటిగుండా కార్మికులను వెలుపలికి తీసుకు వచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
రెండు రోజులుగా ఏర్పడుతున్న అంతరాయాలు టన్నెల్ వద్ద ఆత్రుతగా ఎదురుచూస్తున్న కార్మికుల సంబంధీకుల్లో ఆందోళన రేపుతోంది. అయితే, మిగిలి ఉన్న 5.4 మీటర్ల మేర శిథిలాల్లో డ్రిల్లింగ్‌కు అవరోధాలు ఎదురుకాకపోవచ్చని ప్రత్యేక రాడార్ ద్వారా తెలిసిందని అధికారులు తెలిపారు. ఇలా ఉండగా, టన్నెల్ నుంచి వెలుపలికి వచ్చాక కార్మికులకు వైద్య పరీక్షలు చేసి, ఆ వెంటనే గ్రీన్ కారిడార్ ద్వారా ఆస్పత్రులకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు గఢ్‌వాల్ రేంజ్ ఐజీ కేఎస్ నంగ్యాల్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment