Uttarakhand Tunnel Crash: కొండ పైనుంచి టన్నెల్‌లోకి రంధ్రం | Tunnel Crash: Rescue team begins operation to insert 6-inch diameter pipe inside tunnel | Sakshi
Sakshi News home page

Uttarakhand Tunnel Crash: కొండ పైనుంచి టన్నెల్‌లోకి రంధ్రం

Published Sun, Nov 19 2023 5:19 AM | Last Updated on Sun, Nov 19 2023 9:19 AM

Tunnel Crash: Rescue team begins operation to insert 6-inch diameter pipe inside tunnel - Sakshi

ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో సిల్క్యారా సొరంగం కూలి అప్పుడే ఏడు రోజులైంది. లోపల చిక్కుకున్న 40 మంది కార్మికుల భద్రతపై ఆందోళనలు తీవ్రమవుతుండగా, అధికారులు మరో ప్రత్యామ్నాయాన్ని ముందుకు తెచ్చారు. శుక్రవారం నిలిపివేసిన అమెరికన్‌ ఆగర్‌ యంత్రం డ్రిల్లింగ్‌ పనులను మళ్లీ ప్రారంభించారు.

బోర్డర్‌ రోడ్‌ ఆర్గనైజేషన్‌(బీఆర్‌వో) రూపొందించిన తాజా ప్రణాళిక ప్రకారం..సొరంగం నిర్మాణ పనులు సాగుతున్న కొండ పైనుంచి సొరంగంలోకి సమాంతరంగా రంధ్రం చేయాల్సి ఉంది. కొండ పైనుంచి 1,000 నుంచి 11,00 మీటర్ల పొడవైన రంధ్రం చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే పనులు ప్రారంభించాం. రేపు మధ్యాహ్నం కల్లా ఇది సిద్ధమవుతుంది’అని బీఆర్‌వోకు చెందిన మేజర్‌ నమన్‌ నరులా చెప్పారు.

‘ముందుగా 4–6 అంగుళాల రంధ్రాన్ని తొలిచి లోపల చిక్కుబడిపోయిన వారికి అత్యవసరాలను అందిస్తాం. పరిస్థితులు అనుకూలిస్తే మూడడుగుల వెడల్పుండే రంధ్రాన్ని 900 మీటర్ల పొడవున తొలుస్తాం. దీని గుండా లోపలున్న వారు కూడా బయటకు చేరుకోవచ్చు’అని బోర్డర్‌ రోడ్స్‌ డీజీ ఆర్‌ఎస్‌ రావు చెప్పారు. ప్రధానమంత్రి కార్యాలయం అధికారుల బృందం కూడా ఘటనాస్థలానికి చేరుకుంది.

కార్మికులను కాపాడేందుకు నిపుణులు వివిధ రకాలైన అయిదు ప్రణాళికలను సిద్ధం చేసినట్లు ప్రధాని మాజీ సలహాదారు, ప్రస్తుతం ఉత్తరాఖండ్‌ ప్రభుత్వ ఓఎస్‌డీ భాస్కర్‌ ఖుల్బే చెప్పారు. ఇలా ఉండగా, శిథిలాల నుంచి డ్రిల్లింగ్‌ను మరింత సమర్థంగా కొనసాగించేందుకు శనివారం ఇండోర్‌ నుంచి ఒక యంత్రాన్ని తీసుకువచ్చారు. దీనిని కూడా బిగించి, డ్రిల్లింగ్‌ కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.

డ్రిల్లింగ్‌ పనులు మళ్లీ మొదలు: శుక్రవారం మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో అయిదో పైపును లోపలికి పంపేందుకు డ్రిల్లింగ్‌ పనులు సాగుతుండగా సొరంగంలో ఒక్కసారిగా పెళ్లుమనే శబ్దం వినిపించింది. దీంతో, వెంటనే పనులను నిలిపివేశామని అధికారులు తెలిపారు. ఈ శబ్ధం సహాయక చర్యల్లో నిమగ్నమైన సిబ్బందిలో వణుకు పుట్టించింది.

డ్రిల్లింగ్‌ను కొనసాగిస్తే టన్నెల్‌ మరింతగా కూలే ప్రమాదముందని నిపుణుడొకరు చెప్పారు. మొత్తం 60 మీటర్లకు గాను 24 మీటర్లలో శిథిలాల గుండా డ్రిల్లింగ్‌ పూర్తయిందన్నారు. ఇలా ఉండగా, సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల సంఖ్య 41గా తేలినట్లు అధికారులు వివరించారు. బిహార్‌లోని ముజఫర్‌పూర్‌ జిల్లాకు చెందిన దీపక్‌ కుమార్‌ కూడా లోపలే ఉండిపోయారని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement