ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరకాశీ జిల్లాలోని సిలి్కయారా సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులు ఇంకా బయటకురాలేదు. వారం రోజుల క్రితం సొరంగం కూలిపోవడంతో వారు అందులో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. కార్మికులు బయటకు రావడానికి వీలుగా ఎస్కేప్ మార్గాన్ని సిద్ధం చేయడానికి తలపెట్టిన డ్రిల్లింగ్ పనులను ఆదివారం నిలిపివేశారు.
డ్రిల్లింగ్ యంత్రానికి అడ్డంకులు ఎదురు కావడమే ఇందుకు కారణం. గట్టి రాళ్లు రప్పలు ఎదురవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. సహాయక చర్యలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదివారం సమీక్షించారు. బాధితులను క్షేమంగా బయటకు తీసుకురావడానికి భారీ డయామీటర్ స్టీల్ పైపులైన్‌ను సిద్ధం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. సొరంగం శిథిలాల గుండా ఈ పైపులైన్‌ను పంపించనున్నట్లు తెలిపారు.
సొరంగంలో కార్మికులు ఉన్న చోటుకి చేరుకోవడానికి నిట్టనిలువుగా కంటే అడ్డంగా తవ్వడమే సరైందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అమెరికా యంత్రానికి ఎలాంటి అడ్డంకులు ఎదురు కాకుంటే రెండున్నర రోజుల్లో కార్మికులు ఉన్న చోటుకి చేరుకోవచ్చని వెల్లడించారు. సొరంగంలో కార్మికులు స్వేచ్ఛగా అటూ ఇటూ తిరగగలుగుతున్నారని, వారికి ఆహారం, నీరు, విద్యుత్, ఆక్సిజన్ అందుతున్నాయని, ప్రాణాపాయం లేదని నితిన్ గడ్కరీ స్పష్టంచేశారు.అమెరికా యంత్రంతో అతిత్వరలో డ్రిల్లింగ్ ప్రారంభిస్తామని ప్రభుత్వ అధికారులు చెప్పారు. సొరంగంలో ఉన్న కార్మికులకు మల్టీ విటమిన్ మాత్రలు, ఎండు ఫలాలు తదితరాలు అందిస్తున్నామని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ ఆదివారం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment